‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నట్లుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వెండితెర వేల్పులు ఎందరు ఉన్నా దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌ది మాత్రంపూర్తిగా భిన్నమైన శైలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికీ అంతు చిక్కని ఆంతర్యం ఆయనది.
ప్రతి చిత్రం షూటింగ్ ముగియగానే రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి ఒక నెలరోజులపాటు ఆధ్యాత్మిక జీవనం గడపడం అలవాటు. ఆ తరువాత రెండు నెలలపాటు విదేశాల్లో విహరిస్తారు. హిమాలయాల్లో తన ఆధ్యాత్మిక గురువు బాబా నివాసమైన ఒక గుహలో కూర్చుని «ధ్యానం చేసుకుంటారు. ఆ గుహ అత్యంత ప్రమాదకరమైనదని కొందరు వారించినా రజనీ మానుకోలేదు. లక్షలాది అభిమానులు ఆయన చెంతకు చేరాలని ఉరకలేస్తుంటే ఆయన మాత్రం ఒంటరిగా ఉండేందుకు దూరంగా జరిగిపోతుంటారు. ఈ లౌకిక ప్రపంచానికి దూరంగా ఆనందమయమైన ఆధ్యాత్మిక జీవితం అంటే ఇష్టపడతారు. హిమాలయాల్లోని రిషికేష్ దయానంద సరస్వతి ఆశ్రమంలో గడుపుతారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: రజనీకాంత్ అంటే స్టైల్‌గా నడుస్తూ చేతులు తిప్పే వెండితెర నటుడు మాత్రమే కాదు. ఆయనలో ఒక అతిపెద్ద ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త ఉన్నాడు. ఎడమ చేతికి కూడా తెలియకుండా కుడి చేతితో దానం చేయగల దాత ఉన్నాడు.
‘నేను ఒక సినిమాలో నటించడం పూర్తికాగానే హిమాలయాలకు వెళతాను. అక్కడి నుంచి చెన్నైకి తిరిగి వచ్చి విదేశాల్లో రెండు నెలలు గడుపుతాను. ఈ రెండు నెలలో విదేశాల్లోని వింత ప్రదేశాలను చుట్టివచ్చేందుకు కాదు. సినీ ఆకర్షణ, పేరు, ప్రతిష్టలకు దూరంగా ఒక సాధారణ మనిషిలా జీవించేందుకు మాత్రమే. అక్కడి వీధుల్లో కాలినడకన తిరుగుతూ నేను ఒక సాధారణ మానిషినే అని గుర్తుచేసుకుంటున్నాను’ అని రజనీ పలు సందర్భాల్లో చెప్పారు. అంతేకాదు, సమయం, సందర్భం వచ్చినపుడల్లా తన చిత్రాల్లో ఈ నీతిని బోధిస్తుంటారు. తాను ప్రతిరోజు ఇంటిలో ధ్యానం, యోగా చేస్తుంటాను అని చెప్పడం ద్వారా తన అభిమానుల్లోనూ అలాంటి అలవాట్లను ప్రవేశపెట్టారు. అన్నామలై సినిమాలో రజనీ మెడలో ఒక రుద్రాక్షను వేసుకుంటారు. ఆ సినిమా విడుదలైన తరువాత పెద్ద సంఖ్యలో అభిమానుల మెడలో సైతం రుద్రాక్షమాల దర్శనం ఇచ్చింది. అంతేకాదు రుద్రాక్ష పవిత్రత గురించి కూడా అభిమానులు ప్రచారం చేయడం ప్రారంభించారు. ‘నా సినీ జీవితంలో సాధించిన విజయాలకు దేవుడే కారణం. దానికితోడు నా కృషి,ఆత్మవిశ్వాసం వెంట నిలిచాయి. అన్ని విషయాలను దేవుడే చూసుకుంటాడు అని నమ్ముతాను. ఇంట్లో ఉన్నపుడు నేను ఒక కండక్టరుగానే ఉంటాను, ఎంతో జాబ్ సెక్యూరిటీ ఉన్న ఆ ఉద్యోగాన్ని వదిలేసి రిస్క్‌తో కూడిన సినీ రంగంలోకి వచ్చానంటే నా ధైర్యం, ఆత్మవిశ్వాసమే కారణం. నా జీవితంలో 1978–81 ఎంతో కష్టమైన కాలం. 34 ఏళ్ల వయస్సులోనే ఆ దేవుడు నాకు అన్నిరకాల సుఖ దుఃఖాలను ఇచ్చేశాడు’ అని రజనీ చెప్పేవారు.
నేడు ప్రత్యేక పూజలు
ఈనెల 12న రజనీకాంత్ తన జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు అంతరంగికుల ద్వారా సిద్ధం చేసుకున్నారు. చెన్నై వడపళని, టీనగర్ శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నుంగంబాక్కంలోని ఓ అనాథ శరణాలయంలో సేవా కార్యక్రమాలు జరగనున్నాయి. ఎప్పటిలాగే తన ఇంటి వద్ద అభిమానులను కలుసుకుంటారా లేదా అనేది గోప్యంగా ఉంచారు.
రాజకీయ కోణంలో రజనీని చూస్తే..
ఇంతటి అంతర్గత ఆధ్యాత్మికత, గాంభీర్య గుణగణాలు కలిగిన రజనీకాంత్‌ను వేళ్లూనుకుని పోయిఉన్న రొచ్చు రాజకీయాలతో పోల్చి చూడగలమా అనే సందేహం అందరికీ కలగక మానదు. ఈ ఏడాది మేలో తన అభిమానులను కలుసుకున్నపుడు రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని బాధపడ్డారు. అంతేకాదు.. ‘దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా’ అంటూ మరో మాట అన్నారు. నరేంద్రమోదీ స్వయంగా వెళ్లి రజనీని కలిశారు. అంతే.. వ్యవస్థ మార్పుకోసం రజనీ రాజకీయ ప్రవేశం ఖాయమని ప్రచారం జరిగిపోయింది. అయితే రజనీలోని ఆధ్యాత్మికతే ఆయన చేత ఈ మాటలు అనిపించిందా లేక రాజకీయ అరంగేట్రానికి సంకేతమా అనే సందేహం నేడు తలెత్తింది. అభిమానుల సమ్మేళనం తరువాత మరలా ఆయన నోరుమెదపలేదు. ‘ఇప్పట్లో ఆ అవసరం లేదు’ అని ఇటీవల మీడియా ప్రశ్నకు ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. అయితే ఆయన సోదరుడు సత్యనారాయణ మాత్రం ‘తమ్ముడు వస్తాడు, డిసెంబర్ 12 జన్మదినం తరువాత నెలాఖరులో ప్రకటిస్తాడు’ అన్నారు. రజనీ జన్మదినం వచ్చేసింది. ఇంతకూ రజనీ మార్గం ఆధ్యాత్మిక జీవనమా, రాజకీయ పయనమా అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. జన్మదినం రోజున ఏదో ఒకటి ప్రకటించాలని ఆయన అభిమాన జన సందోహం ఎదురుచూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment