గోలీసోడా ఇష్టపడిన రజనీకాంత్
ఈ మధ్య తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నిలిచినవాటిలో ‘గోలీసోడా’ ఒకటి. చెన్నయ్‌లోని కోయంబేడు మార్కెట్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఆ మార్కెట్లో కూలీలుగా పని చేసే నలుగురు కుర్రాళ్ల చుట్టూ ప్రధానంగా ఈ కథ సాగుతుంది. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిన్న చిత్రం ప్రేక్షకాదరణతో పెద్ద సినిమా అయ్యింది. మామూలుగా ఈ తరహా చిత్రాలను రజనీకాంత్ చూస్తుంటారు. తనకు నచ్చితే, స్వయంగా దర్శక, నిర్మాతలకు, నటీనటులకు ఫోన్ చేసి అభినందిస్తుంటారు.
‘గోలీసోడా’ని చూసిన తర్వాత ఓ ప్రకటన విడుదల చేశారాయన. ‘‘కోయంబేడు మార్కెట్ నేపథ్యంలో అద్భుతమైన సినిమా చేశారు. చాలా ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా నలుగురు కుర్రాళ్ల నటన అద్భుతం. దర్శకుడి పని తీరు నాకు నచ్చింది. అందుకే, ఫోన్ చేసి అభినం దించాను. తన తదుపరి చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని ఆ ప్రకటనలో రజనీ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని అనుష్క, సమంత, మురుగదాస్ తదితర ప్రముఖులు కూడా మెచ్చుకున్నారు.