సూపర్‌స్టార్‌కు సెంటినరీ అవార్డు
స్టయిల్ కింగ్ రజనీకాంత్‌కు మరో అరుదైన అవార్డు వరించనుంది. భారత ప్రభుత్వం ఈ దక్షిణాది సూపర్‌స్టార్‌కు సెంటినరీ (ఈఏడాది ప్రముఖ సినీ కళాకారుడు) అవార్డును ప్రకటించింది. భారతీయ సినిమా శత వసంతాల వేడుక జరుపుకున్న సందర్భంగా రజనీకాంత్‌కు ప్రతిష్టాత్మక అవార్డు వరించడం విశేషం.
రజనీకి బర్త్‌డే గిఫ్ట్
దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఈ సెంటినరీ అవార్డు ఆయన పుట్టిన రోజు కానుకగా పేర్కొనవచ్చు. అయితే ఇలాంటి అవార్డులు రజనీకాంత్‌కు కొత్తే మీ కాదు. డిసెంబర్ 12న 64వ వసంతంలోకి అడిగిడుతున్న రజనీ నటుడిగా నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ 40 ఏళ్లలో ఆయనకు ఎన్నో అవార్డులు, బిరుదులు అలంకారమయ్యూయి.
తమిళ ప్రభుత్వం అవార్డులతో పాటు ఫిలింఫేర్, కలైమామణి, ఇతర మీడియా అవార్డులెన్నో రజనీకాంత్‌కు వరించాయి. 2000 లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో గౌరవించింది. అదే ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్‌కపూర్ అవార్డుతో సత్కరించింది. తన పుట్టిన రోజు సందర్భంగా రజనీకాంత్ అభిమానులకు లింగా చిత్రాన్ని కానుకగా అందించడానికి సిద్ధం అవుతుంటే ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈసెంటినరీ అవార్డును అందించనుండడం విశేషం.
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఈ నెల 20 నుంచి 30 వరకు గోవా లో జరగనున్నాయి. 75 దేశాలు పాల్గొనే ఈ చిత్రోత్సవాల్లో 68 దేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శించనున్నారు. వాటిలో ఏడు చిత్రాలు ఆసియాకు చెందినవి కావడం విశేషం. ప్రఖ్యా త బాలీవుడ్ నటుడు అమితాబ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ వేడుకలో ప్రత్యేక అతిథిగా సూపర్‌స్టార్ రజనీకాంత్ వేదికపై అలంకారం కానున్నారు. ఈ చిత్రోత్సవాల్లో తొలి రోజున రజనీకాంత్‌కు సెంటినరీ అవార్డుతో గౌరవించనున్నట్లు కేంద్ర సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రతిభకు మా త్రమే బీజేపీ ప్రభుత్వం పట్టం కడుతుందని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు.
నివాళులు:
కేంద్రమంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది దివంగతులైన ప్రఖ్యాత కళాకారులు హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటన్ బరో, రాబి విలియమ్స్, భారతీయ ప్రముఖులు జోరో సేకల్, సుచిత్రా సేన్, అక్కినేని నాగేశ్వరరావు, సదాశివ్ అమ్రి పుర్కర్, ఫరూక్ షేక్ తదితరులకు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు.
అభినందనల వెల్లువ
రజనీకాంత్‌ను సెంటినరీ అవార్డు వరించడంతో చిత్ర పరిశ్రమ నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు భారతీయ జనతాపార్టీనేత తమిళిసై సౌందర్ రాజన్ ఆయనకు అభినందనలు తెలుపుతూ, ఒక ప్రకటన విడుదల చేశారు. రజనీకాంత్ మరిన్ని అవార్డులను అందుకోవాలని ఆకాంక్షిస్తూ అందులో పేర్కొన్నారు.