జ్యోతిక ఆ మాట అనకముందే నేను సినిమా చేస్తా! | Surya S3 release On April 9 | Sakshi
Sakshi News home page

జ్యోతిక ఆ మాట అనకముందే నేను సినిమా చేస్తా!

Published Mon, Feb 6 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

జ్యోతిక ఆ మాట అనకముందే నేను సినిమా చేస్తా!

జ్యోతిక ఆ మాట అనకముందే నేను సినిమా చేస్తా!

వంద రోజులు ఆడిన సినిమాల గురించి విన్నాం. వంద రోజులు వాయిదా పడిన సినిమా గురించి ఇప్పుడు వింటున్నాం. అదే ‘ఎస్‌3–యముడు3’. ‘అయినా నో టెన్షన్‌’ అంటున్నారు హీరో సూర్య. ‘సింగం’ సిరీస్‌ మీద ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం అలాంటిది అన్నారు. సూర్య, అనుష్క, శ్రుతీహాసన్‌ ముఖ్య తారలుగా హరి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ‘సింగం–3’ని నిర్మాత మల్కాపురం శివకుమార్‌ తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఈ నెల 9న వస్తున్న ఈ సినిమా గురించి సూర్య చెప్పిన సంగతులు.....

జ్యోతికకి బైక్‌ నేర్పినట్టున్నారు?
ఇట్‌ వాజ్‌ ఫన్‌. ఆల్రెడీ తనకి కొంచెం వచ్చు. గతంలో ఓ సినిమాలో హ్యార్లీ డేవిడ్‌సన్‌ నడిపింది. ‘మగళిర్‌ మట్టుమ్‌’లోని ఓ సీన్‌లో ఆగ్రా, ఉత్తరప్రదేశ్‌ రోడ్లపై ఊర్వశిగారిని వెనక కూర్చోబెట్టుకుని బుల్లెట్‌ నడపాలి. జ్యోతిక ఓ నెలలో కంప్లీట్‌గా నేర్చుకుంది. మొదటిరోజే నేను తన వెనక కూర్చోవలసి వచ్చింది. ‘నీకంత కాన్ఫిడెన్స్‌ ఏంటి? నేను బండి పడేస్తాననే భయం లేదా?’ అని జ్యోతిక అడిగింది. నేను వెనక కూర్చుంటే తనకి కాన్ఫిడెన్స్‌ పెరిగి, బాధ్యతగా బైక్‌ రైడ్‌ చేస్తుందని నా నమ్మకం.

మొత్తానికి వాయిదాల పర్వం పూర్తయింది!
(నవ్వుతూ..) దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. ఓసారి తమిళనాడు ముఖ్యమంత్రి మరణం, మరోసారి ‘జల్లికట్టు’.. తదితర కారణాల వల్ల సుమారు వంద రోజులు వాయిదా పడింది. విడుదల తేదీ ప్రకటించి, మళ్లీ మళ్లీ వాయిదా వేయడం వల్ల ప్రేక్షకుల్లో కన్‌ఫ్యూజన్‌ పెరుగుతుంది. కానీ, వాళ్లంతా ప్రేమ, గౌరవంతో సినిమాపై ఆసక్తితో ఉన్నారు. ‘సింగం’ సిరీస్‌కి హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ ఉండడం వల్లే ‘ఎస్‌ 3’పై క్రేజ్‌ ఉంది.

వసూళ్లపై ఈ ప్రభావం ఉంటుందనుకుంటున్నారా?
దీపావళికి విడుదలైతే 15 నుంచి 20 శాతం ఎక్కువ వసూళ్లు వచ్చే ఛాన్సుందని ట్రేడ్‌ వర్గాలు చెప్పాయి. ఇప్పుడు పండగ వాతావరణం లేదు. కానీ, ఫిబ్రవరిలో విడుదలైన కార్తీ ‘పరుత్తి వీరన్‌’, ‘యుగానికి ఒక్కడు’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. కథ బాగుంటే సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్టే.

‘జల్లికట్టు’కి మద్దతుగా సినిమా వాయిదా వేస్తే.. పబ్లిసిటీ కోసమేనంటూ పెటా ఆరోపణలు చేయడం, మీరు లీగల్‌ నోటీసుల వరకూ వెళ్లడం.. అప్పుడు మీ రియాక్షన్‌ ఏంటి?
    తమిళనాడు ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ‘జల్లికట్టు’కి మద్దతుగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఓ తమిళ వ్యక్తిగా నేనూ మద్దతిచ్చా. ‘దిస్‌ ఈజ్‌ మై ఫేస్‌. నేను బయటకి వచ్చినప్పుడు నా ముఖాన్ని పక్కనపెట్టి, మాస్క్‌ వేసుకుని రాలేను కదా!’. ‘ఎస్‌3’ విడుదలకి నాలుగు రోజుల ముందు ఈ ‘జల్లికట్టు’ అంశం తెరపైకి వచ్చింది. ఓ తమిళుడిగా సంస్కృతి పరిరక్షణకు మద్దతిస్తే వాళ్లు అలా మాట్లాడడం బాధాకరం. చివరికి, క్షమాపణలు చెప్పారు.

‘సింగం’ ఫ్రాంఛైజీలో మిమ్మల్ని ఎగై్జట్‌ చేస్తున్న అంశాలేంటి?
ఈరోజు ఐపీయస్‌ సీవీ ఆనంద్‌గారితో మాట్లాడితే... ప్రభుత్వ సహకారంతో బ్యాంకాక్‌ వెళ్లి కృషి బ్యాంక్‌ నిందితులను పట్టుకున్న వైనం గురించి చెప్పారు. ‘సింగం–2’లో ఆపరేషన్‌ ‘డి’ పేరుతో హీరో సౌతాఫ్రికా వెళతాడు. సినిమాల్లో చూపించినవి 80 శాతం రియల్‌ లైఫ్‌లో జరుగుతున్నాయి. మామూలుగా ఓ మనిషిని చెంపదెబ్బ కొట్టడానికి కూడా మన చట్టాలు ఒప్పుకోవు. కానీ, కమర్షియల్‌ యాక్షన్‌ పేరుతో ఓ 20 శాతం డ్రామా జోడించి, అర్థవంతమైన కమర్షియల్‌ సినిమాలు తీస్తున్నాం. సీవీ ఆనంద్‌ వంటి రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు (పోలీసులు) ‘సింగం’ చిత్రాలను గౌరవిస్తున్నారు. పోలీస్‌ ట్రైనింగ్‌ అకాడెమీలలో చూపించి ‘మీరూ ఇలా ఉండాల’ని చెబుతున్నారు. అవి విన్నప్పుడు ఎగై్జట్‌మెంట్‌ వస్తుంది.

ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌ సీఎంలుగా ఉన్నప్పటి సంఘటనల స్ఫూర్తితో ‘ఎస్‌3’ తీశామన్నారు. అవేంటి?
పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఓ సీనియర్‌ అధికారి మాకు చెప్పింది ఏంటంటే... ఎన్టీఆర్‌గారు మొదటిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు తమిళనాడు సీఎంగా ఎమ్జీఆర్‌ ఉన్నారు. అప్పుడు ఏపీలో జరిగిన ఓ రైడ్‌కి ఎక్కువ పోలీస్‌ సపోర్ట్‌ అవసరమైనప్పుడు ఎమ్జీఆర్‌గారు తమిళనాడు ఐపీయస్‌ అధికారులను ఏపీకి పంపించారు. ఓ రాష్ట్ర పోలీసులు పొరుగు రాష్ట్ర పోలీసులకు సహాయం చేయడమనే సంఘటన స్ఫూర్తితో దర్శకుడు హరిగారు ఈ కథ రాశారు.

‘సింగం’ మ్యూజిక్‌కి బ్రాండ్‌ తీసుకొచ్చిన దేవిశ్రీప్రసాద్‌ని ఎందుకు తప్పించారు?
సంగీత దర్శకుడు హ్యారీస్‌ జయరాజ్‌తో నేను 8, హరిగారు 4 సినిమాలు చేశాం. అన్నీ మ్యూజికల్‌ హిట్సే. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడం కోసమే ‘ఎస్‌3’కి ఆయన్ని తీసుకున్నాం. ప్రతి సినిమాకీ మణిరత్నం ఒకే డీఓపీతో పని చేయరు కదా! ఇదీ అంతే. ఏం చేసినా ‘సింగం’ బ్రాండ్‌ కోసమే. దేవిశ్రీతో ఈ మాట చెప్పగానే పెద్ద మనసుతో అంగీకరించారు.

‘ఎస్‌3’కి ముందు హరి దర్శకత్వంలో మరో కథతో సినిమా చేయాలనుకున్నారు కదా!
అది మిలటరీ నేపథ్యంలో జరిగే కథ. ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ. నాకూ ఆ సినిమా చేయాలనుంది. ‘సింగం–4’కి ముందే అది పట్టాలు ఎక్కుతుందని ఆశిస్తున్నా. ప్రస్తుతానికి ఏదీ ప్లాన్‌ చేయలేదు.

‘స్పెషల్‌ చబ్బీస్‌’ రీమేక్‌ ‘తానా సేంద కూట్టమ్‌’ చిత్రీకరణ ఎంతవరకూ వచ్చింది?
కంప్లీట్‌ రీమేక్‌ కాదు. ఆ సిన్మాలో రెండు సన్నివేశాల స్ఫూర్తితో వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ కొత్త కథ రాశాడు. ‘స్పెషల్‌ చబ్బీస్‌’ కంటే ‘తానా సేంద కూట్టమ్‌’ డిఫరెంట్‌గా ఉంటుంది. యువ దర్శకులతో పనిచేసినప్పుడు మనల్ని కొత్తగా ఆవిష్కరిస్తారు. రజనీకాంత్‌గారు కూడా యువ దర్శకుడు రంజిత్‌తో ‘కబాలి’ చేశారు.

మొన్న ఆదివారం మీ శ్రీమతి జ్యోతికకి దోసెలు వేశారు. తొలిసారి గరిటె తిప్పారా?
లేదండీ! (నవ్వుతూ..) అప్పుడప్పుడూ వంట చేస్తాను. ఆమ్లెట్స్, దోసెలు వేస్తా. సమోసాలు చేయడమూ వచ్చు. అయితే... జ్యోతిక ‘మగళిర్‌ మట్టుమ్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయింది. చాలా మంచి చిత్రమది. నలుగురు మహిళలు రోడ్‌ ట్రిప్‌కి వెళ్లినప్పుడు ఏం జరిగిందనేది కథ. మహిళలు మాత్రమే కాదు మగవారు కూడా చూడాల్సిన సినిమా.

‘మగళిర్‌ మట్టుమ్‌’ని తెలుగులో డబ్బింగ్‌ చేసే ఆలోచన ఉందా?
తప్పకుండా డబ్బింగ్‌ చేస్తాం. ‘36 వయదినిలే’ తెలుగు డబ్బింగ్‌ కూడా పూర్తయింది. మంచి విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నాం. పెళ్లైన మహిళల్లో స్ఫూర్తి నింపే చిత్రమది. ఏ వయసులోనైనా కొత్త కెరీర్‌ స్టార్ట్‌ చేయొచ్చని చెప్పే సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు మనం ఎక్కువ చేస్తాం. ఒక్కోసారి వాటిలో అర్థవంతమైన విషయాలు కూడా చెప్పొచ్చు. అప్పుడొచ్చే సంతృప్తి, సంతోషం మాటల్లో వర్ణించలేం.

మీరు, మీ భార్య జ్యోతిక మళ్లీ తెరపై కనిపించేది ఎప్పుడు?
గతేడాది కలసి ఓ సినిమా చేయాల్సింది. కానీ, కుదరలేదు. మళ్లీ ‘నేను నటించడం మానేస్తాను’ అని జ్యోతిక చెప్పక ముందే ఓ సినిమా చేసేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement