తను ఎల్లప్పుడూ మనందరి హృదయాల్లో జీవించే ఉంటాడని.. కాబట్టి ప్రతీ ఒక్కరు ధైర్యంగా ఉండాలని బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సుశాంత్ గురించి ఆలోచిస్తూ ఎవరూ మనసు పాడుచేసుకోవద్దని.. ఆ విషయం అతడి ఆత్మను మరింత క్షోభ పెడుతుందని ఉద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో సోమవారం ఆమె సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘‘మామూ ఇక లేడని నిర్వాన్‌తో చెప్పినపుడు.. ‘‘తను మన గుండెల్లో బతికే ఉంటాడు కదా’’అని వాడు మూడుసార్లు చెప్పాడు. 5 ఏళ్ల పసివాడు అలా చెప్పగలిగినపుడు... మరి మనందరం ఎంత దృఢంగా ఉండాలి.. అందరూ ధైర్యంగా ఉండండి... ముఖ్యంగా సుశాంత్ అభిమానులు.. తను ఎల్లప్పుడూ మన హృదయంలోనే ఉంటాడని గుర్తుపెట్టుకోండి’’ అని పేర్కొన్నారు. (సుశాంత్ ఆత్మహత్య: కృతి సనన్ భావోద్వేగం)
ఇక తను అమెరికాలో ఉన్నందున సుశాంత్ అంత్యక్రియలకు హాజరుకాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనకు టికెట్ కన్‌ఫాం అయ్యిందని.. మంగళవారం ఢిల్లీ నుంచి ముంబైకి చేరనున్నట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్వారంటైన్‌లో ఉండాల్సింది వస్తుంది కాబట్టి.. తన కుటుంబ సభ్యులను కలవడంలో మరింత జాప్యం కావొచ్చని పేర్కొన్నారు. కాగా మానసిక ఒత్తిడి తట్టుకోలేక సుశాంత్ సింగ్ ఆదివారం ముంబైలోని తన ఫ్లాట్‌లో బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. ఈ క్రమంలో ముంబైలోని విలే పార్లే శ్మశాన వాటికలో సోమవారం అతడి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా బిహార్‌లోని పట్నాలో 1986 జనవరి 21న జన్మించిన సుశాంత్‌కు నలుగురు అక్కలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment