
ఇంతకీ అనుష్క ఏం చేస్తోంది ?
హైదరాబాద్: పండ్లున్న చెట్టుకే రాళ్లు అన్న చందానా, సక్సెస్ జోరులో ఉన్న అనుష్క చుట్టూనే మీడియా తిరుగుతోందని చెప్పవచ్చు. దర్శకుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలిలో కత్తి చేతబట్టి దేవసేన పాత్రలో ఒదిగిపోయింది. అలాంటి అనుష్క చేతిలో ఇపుడు ఒక్క చిత్రం మినహా వేరే అవకాశాలు లేవనే చెప్పాలి. ప్రభాస్ తాజా చిత్రం సాహోలోనూ కథానాయకి తానే అన్న ప్రచారం జరుగుతున్నా అది ఊహాగానమే. బాహుబలి-2 వంటి ఘనవిజయం తరువాత కూడా అనుష్కకు కొత్త అవకాశాలు రాకపోవడం ఏమిటి? అవకాశాలు రావడంలేదా? వస్తున్న వాటిని తిరస్కరిస్తోందా అనేది ఆసక్తికరమైన ప్రశ్నగానే మిగిలిపోయింది.
అయితే ఇలాంటి ప్రచారాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది బాహుబలి బ్యూటీ, స్వీటీ. ప్రస్తుతం భాగమతి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అశోక్.జి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంతో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో యువ నటుడు ఆది పినిశెట్టి ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వి.వంశీకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పుడు పొల్లాచ్చిలో చిత్రీకరణను జరుపుకుంటోంది. చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని సమాచారం.