సుజానే
నేను వంద కోట్లు అడగడం ఏంటి?
Published Mon, Dec 30 2013 12:42 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
హృతిక్‌రోషన్.. అతని భార్య సుజానే ఉదంతం ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. గత ఆరు నెలలుగా ఈ జంట విడిగానే ఉంటున్నారు. విడిపోవడానికి కోర్టును కూడా ఆశ్రయించారనే విషయం చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంకేముంది.. మీడియా రంగంలోకి దిగి, జూలు విదిల్చింది. ఈ జంటపై తోచినట్లు మీడియాలో కథనాలు రావడం మొదలైంది. ఏకంగా వంద కోట్ల రూపాయలు భరణం క్రింద ఇవ్వాలని హృతిక్‌ని సుజానే డిమాండ్ చేస్తోందని, ఇరు పక్షాల న్యాయవాదులు అందుకు తగిన విధంగా సెటిల్‌మెంట్ చేస్తున్నారని పలు చానల్స్‌లో కథనాలు ప్రసారమయ్యాయి. దీనితో మనస్తాపానికి గురైన సుజానే... చివరకు అదే మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ‘‘జీవితంలో మేం అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో మాపై ఇలాంటి వదంతులు పుట్టించడం భావ్యం కాదు. నేను వంద కోట్లు అడగడం ఏంటి? ఇలాంటి నిరాధారమైన వార్తల్ని ప్రసారం చేయకండి ప్లీజ్’’ అని మీడియా ముందు వాపోయారు సుజానే.
Advertisement
Advertisement