ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాలి : దాసరి
‘‘ఎస్వీ రంగారావుగారు నాకు దేవుడిలాంటివారు. ఆయన లేకపోతే ‘తాతా మనవడు’ లేదు. ఎస్వీఆర్ జీవిత చరిత్ర గురించి రామారావు రాసిన ఈ పుస్తకం ఓ మంచి ప్రయత్నం’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. మహానటుడు ఎస్వీ రంగారావు జీవిత చరిత్రతో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రాసిన ‘ఒకే ఒక్కడు - యశస్వి ఎస్వీ రంగారావు’ పుస్తకాన్ని దాసరి ఆవిష్కరించి, సీనియర్ నటులు కైకాల సత్యనారాయణకు అందజేశారు. తొలి ప్రతిని బీఏ రాజు, జయ, మలి ప్రతిని తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేశ్ కొండేటి కొనుగోలు చేశారు.
ఈ వేడుకలో సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి, సీనియర్ నటి గీతాంజలి, నటుడు బ్రహ్మానందం, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, నటుడు మాదాల రవి, పారిశ్రామికవేత్త సారిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై ఇంకా దాసరి మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఘంటసాల, సూర్యకాంతం, జిక్కీ వంటి ప్రతిభావంతులను పరిచయం చేసింది కృష్ణవేణి అనే విషయం ఎంతమందికి తెలుసు? నేడు థియేటర్లు కబ్జాకి గురైనట్లే చరిత్ర కూడా కబ్జా అయిపోతోంది.
అసలైన చరిత్ర తెలియాలంటే ఇలాంటి పుస్తకాలు రావాలి ’’ అన్నారు. ‘‘లాబీలకు అలవాటుపడిన పద్మ పురస్కరాలకు విలువ ఉందా? ఎస్వీఆర్ స్థాయికి ఇలాంటివి కాదు.. ఇంకా మెరుగైన పురస్కారాలు ఏమిచ్చినా సరిపోవు’’ అని కైకాల అన్నారు. నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘హాలీవుడ్‌లో లార్డ్ బిరుదు పొందిన లారెన్స్ ఒలివర్ ‘నర్తనశాల’లో ఎస్వీఆర్ నటన చూసి ‘బెటర్ దేన్ మీ’ అన్నారు. ఎస్వీఆర్, సావిత్రి, కైకాల, దాసరిలకు ‘పద్మశ్రీ’ లేదు. తమిళ నటుడు ఎంజీఆర్‌కి భారత రత్న ఇచ్చారు. అంతకన్నా గొప్పవాడైన ఎన్టీఆర్‌కు ఇవ్వకపోవడం అన్యాయం? తెలుగువారికి ఇచ్చే విషయంలో చిన్న చూపు ఎందుకు?’’ అని ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు. ఎస్వీ రంగారావు వంటి గొప్ప నటుడి గురించి పుస్తకం రాయడం ఆనందంగా ఉందనీ, భవిష్యత్తులో ఇలాంటి పుస్తకాలు మరెన్నో రాయాలని ఉందని పుస్తక రచయిత అన్నారు.