Tummalapalli ramasatyanarayana
-
వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నా
‘‘సినిమా రంగంపై మక్కువతో 2004లో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. దాదాపు 97 చిత్రాలు నిర్మించిన నేను 98వ సినిమాగా ‘శివ 143’ నిర్మించాను. 99వ సినిమాని అతి త్వరలో నాకు చాలా ఇష్టమైన, వివాదాస్పద దర్శకునితో ప్లాన్ చేస్తున్నా. కథ రెడీ అవుతోంది’’ అని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. నేడు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని మాట్లాడుతూ– ‘‘నటుడిగా లక్ష్మీనరసింహ, ఘంటసాల గారి బయోపిక్ లాంటి సినిమాలతో పాటు సుమారు 75 చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించా. ‘శివ 143’ సినిమాలో రాష్ట్రపతి పాత్ర చేశాను. త్వరలో ఆ సినిమా విడుదల కానుంది. నేను నిర్మించనున్న 100వ చిత్రానికి దర్శకత్వం చేస్తానని శతాధిక చిత్రాల దర్శకుడు మాట ఇచ్చారు. ఆ అగ్ర దర్శకుడి పిలుపుకోసం ఎదురు చూస్తున్నా. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం నిర్మాత కళ్యాణ్‌గారి ఆశీస్సులు, డైరెక్టర్ కోడి రామకృష్ణగారి పరిచయమే. దాసరి నారాయణరావుగారి పరిచయం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యగారి సహకారం మరువలేనిది. నన్ను ఇష్టపడే దర్శకుడు వీవీ వినాయక్‌గారు, నాకు చాలా ఇష్టమైన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మగారు. వారందరి సహకారం వల్లే 98 సినిమాలు తీసి, ఈ స్థాయిలో ఉన్నా. ఇందుకు వారందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. -
ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాలి : దాసరి
‘‘ఎస్వీ రంగారావుగారు నాకు దేవుడిలాంటివారు. ఆయన లేకపోతే ‘తాతా మనవడు’ లేదు. ఎస్వీఆర్ జీవిత చరిత్ర గురించి రామారావు రాసిన ఈ పుస్తకం ఓ మంచి ప్రయత్నం’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. మహానటుడు ఎస్వీ రంగారావు జీవిత చరిత్రతో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రాసిన ‘ఒకే ఒక్కడు - యశస్వి ఎస్వీ రంగారావు’ పుస్తకాన్ని దాసరి ఆవిష్కరించి, సీనియర్ నటులు కైకాల సత్యనారాయణకు అందజేశారు. తొలి ప్రతిని బీఏ రాజు, జయ, మలి ప్రతిని తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేశ్ కొండేటి కొనుగోలు చేశారు. ఈ వేడుకలో సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి, సీనియర్ నటి గీతాంజలి, నటుడు బ్రహ్మానందం, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, నటుడు మాదాల రవి, పారిశ్రామికవేత్త సారిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై ఇంకా దాసరి మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఘంటసాల, సూర్యకాంతం, జిక్కీ వంటి ప్రతిభావంతులను పరిచయం చేసింది కృష్ణవేణి అనే విషయం ఎంతమందికి తెలుసు? నేడు థియేటర్లు కబ్జాకి గురైనట్లే చరిత్ర కూడా కబ్జా అయిపోతోంది. అసలైన చరిత్ర తెలియాలంటే ఇలాంటి పుస్తకాలు రావాలి ’’ అన్నారు. ‘‘లాబీలకు అలవాటుపడిన పద్మ పురస్కరాలకు విలువ ఉందా? ఎస్వీఆర్ స్థాయికి ఇలాంటివి కాదు.. ఇంకా మెరుగైన పురస్కారాలు ఏమిచ్చినా సరిపోవు’’ అని కైకాల అన్నారు. నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘హాలీవుడ్లో లార్డ్ బిరుదు పొందిన లారెన్స్ ఒలివర్ ‘నర్తనశాల’లో ఎస్వీఆర్ నటన చూసి ‘బెటర్ దేన్ మీ’ అన్నారు. ఎస్వీఆర్, సావిత్రి, కైకాల, దాసరిలకు ‘పద్మశ్రీ’ లేదు. తమిళ నటుడు ఎంజీఆర్‌కి భారత రత్న ఇచ్చారు. అంతకన్నా గొప్పవాడైన ఎన్టీఆర్‌కు ఇవ్వకపోవడం అన్యాయం? తెలుగువారికి ఇచ్చే విషయంలో చిన్న చూపు ఎందుకు?’’ అని ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు. ఎస్వీ రంగారావు వంటి గొప్ప నటుడి గురించి పుస్తకం రాయడం ఆనందంగా ఉందనీ, భవిష్యత్తులో ఇలాంటి పుస్తకాలు మరెన్నో రాయాలని ఉందని పుస్తక రచయిత అన్నారు. -
అమాయక పాత్రలతో...
విశ్వనాథ్‌రెడ్డి, వెన్నెల జంటగా టి. రాము దర్శకత్వంలో భక్త మార్కండేయ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘అమాయక పాండవులు’. అర్జున్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాన్ని ముఖ్య అతిథి తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేశారు. మరో అతిథి దర్శకుడు సాయి వెంకట్ చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. అనంతరం హీరో, నిర్మాత విశ్వనాథ్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘ఈ కథ నచ్చడంతో హీరోగా నటించడంతో పాటు, నిర్మిస్తున్నాను. కథ చాలా వినూత్నంగా ఉంది. మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఇందులో విశ్వనాథ్ శక్తిమంతమైన పోలీస్ అధికారిగా నటించారని దర్శకుడు తెలిపారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ ఇదని అర్జున్ చెప్పారు.