బాలీవుడ్లో బిజీ అవుతోంది
సౌత్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఢిల్లీ భామ తాప్సీ పన్ను. తొలి సినిమాలోనే తన అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటి స్టార్ హీరోయిన్ ట్యాగ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. సౌత్లో వరుస సినిమాలు చేసినా స్టార్ ఇమేజ్ అందుకోలేకపోవటంతో బాలీవుడ్ బాట పట్టింది. సౌత్ హీరోయిన్లకు నార్త్లో పెద్దగా అవకాశాలు రావన్న అపవాదును చెరిపేస్తూ వరుస సినిమాలతో బిజీ అవుతోంది.
ప్రస్తుతం లండన్లో జరుగుతున్న సాకిబ్ సలీమ్తో చేస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొంటోంది తాప్సీ. ఈ సినిమా పూర్తవ్వగానే ప్రకాష్ రాజ్ తొలిసారిగా బాలీవుడ్లో డైరెక్ట్ చేస్తున్న తడ్కా సినిమా చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు అమితాబ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న పింక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనుంది. ఈ మూడు సినిమాల తరువాత రాజ్ కుమార్ రావ్ హీరోగా రత్నసిన్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలోనూ హీరోయిన్గా నటించనుంది. ఇలా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది తాప్సీ పన్ను.