తననెవరూ పిలవడం లేదు అని అంటోంది నటి తాప్సీ. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ ఉత్తరాది బ్యూటీ ఒకప్పుడు ఐరెన్‌లెగ్ నటిగా ముద్రవేసుకున్నా, ప్రస్తుతం క్రేజీ నటిగా రాణిస్తున్నారు. అయితే తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాల కోసం పోరాడినా పెద్దగా సాధించలేకపోయారు. అలాంటిది బాలీవుడ్ ఈ అమ్మడిలోని టాలెంట్‌ను గుర్తించింది. అక్కడ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ సక్సెస్‌లు అందుకుంటున్నారు. టాలీవుడ్‌లోనూ ఆనందోబ్రహ్మ చిత్రంతో విజయాన్ని చవిచూసిన తాప్సీ తాజాగా తమిళం, తెలుగు భాషల్లో నటించిన గేమ్‌ఓవర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన తెరపైకి రానుంది.
వైనాట్ ప్రొడక్షన్ పతాకంపై శశికాంత్ నిర్మించిన ఈ చిత్రానికి మాయ చిత్రం ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. రోన్ ఈత్తాన్ యోహాన్ సంగీతాన్ని అందించిన ఇందులో నటి వినోదిని, రమ్య, కాంచన నటరాజన్, అనిల్ కురువిల్లా ముఖ్య పాత్రల్లో నటించారు. గేమ్‌ఓవర్ చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి తాప్సీ మాట్లాడుతూ గేమ్‌ఓవర్ తన కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రం అని పేర్కొన్నారు.
ఈ మూవీలో తాను వీడియో గేమ్ డిజైనర్‌గా నటించానని, ఒక ప్రమాదంలో కాలు విరగడంతో వీల్ చైర్‌లోనే కూర్చుని గేమ్ డిజైన్ చేస్తానని చెప్పారు. అలాంటి సమయంలో ఆ ఇంట్లో మరో ఆపద ఎదురవుతుందని, దాని నుంచి తాను గేమ్‌తో ఎలా బయట పడ్డానన్నది గేమ్ ఓవర్ చిత్రం అని తెలిపారు. తమిళంలో తాను నటించి చాలా కాలమైంది, నిజం చెప్పాలంటే ఇక్కడ తననెవరూ నటించడానికి పిలవడం లేదన్నారు.
పింక్ చిత్ర రీమేక్‌లో నటించమని తనను ఎవరూ అడగలేదని, ఒకవేళ అడిగితే కచ్చితంగా నటించేదానిన్ననారు. ప్రస్తుతం నటుడు జయంరవికి జంటగా నటించే చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, దీని గురించి చిత్ర నిర్మాతల నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపారు. తన నటిగా పెంచి పోషించిన తమిళ సినిమాను ఎప్పటికీ మరచిపోనని తెలిపారు. కాగా ఈ అమ్మడికి హిందీలోనూ మార్కెట్ ఉండడంతో గేమ్‌ఓవర్ చిత్రాన్ని అక్కడ అనువాదం చేసి విడుదల చేయనున్నట్లు నిర్మాత శశికాంత్ తెలిపారు. గేమ్‌ఓవర్ చిత్రం హాలీవుడ్ చిత్రాల తరహాలో చాలా వేగంగా థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment