ఐటమ్ సాంగ్‌కు అరకోటిపైనే ..
ఐటమ్ సాంగ్‌లతో పాపులర్ అయినా వ్యాంపు గీతాల్లో నటించడానికి ఒకప్పుడు ప్రత్యేకంగా నర్తకీమణులు ఉండేవారు. ఇప్పుడు కథానాయికలే అలాంటి పాటలకు చిందేసేస్తున్నారు. ఇంతకు ముందు కథానాయికలు ప్రత్యేక గీతాల్లో నటిస్తే ఇమేజ్ డామేజ్ అవుతుందని భయపడేవారు. మరి కొందరు అలా నటించి కెరీర్‌ను పాడు చేసుకున్న వారు లేకపోలేదు. ఈ తరం నటీమణులు అలాంటి ఆలోచన గానీ, భయానికిగానీ తావివ్వడం లేదు. ఇమేజ్‌ను పణంగా పెట్టి అందుకు భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు.
నిజం చెప్పాలంటే ఇప్పటి టాప్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్‌లో నటించినా వారి స్టార్‌డమ్‌కు ఎలాంటి భంగం కలగడం లేదని చెప్పవచ్చు. నటి నయనతార, శ్రుతిహాసన్, తమన్నా, కాజల్‌అగర్వాల్ లాంటి టాప్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌లకుసై అంటున్నారు. అందుకు ఒక చిత్రంలో హీరోయిన్‌కు అందే పారితోషికం ఒక్క ఐటమ్ సాంగ్‌కే ముట్టడం ప్రధాన కారణం కావచ్చు. ఆ మధ్య నటి నయనతార శివకాశి అనే చిత్రంలో విజయ్‌తోనూ, సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన శివాజీ చిత్రంలోనూ సింగిల్ సాంగ్‌లో ఆడి భారీ మొత్తంలో పారితోషికం పొందారు. అదే విధంగా శ్రీయ, చార్మీ,అంజలి వంటి నాయికలు ఐటమ్ సాంగ్‌కు రెడీ అంటున్నారు.
ఇటీవల కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న జాగ్వర్ అనే చిత్రంలో శ్రుతిహాసన్ నిరాకరించిన ఐటమ్ సాంగ్‌లో నటించడానికి మిల్కీబ్యూటీ తమన్న సై అన్నారట. అందుకు తను కోటి రూపాయలు డిమాండ్ చేయగా దర్శక నిర్మాతలు బేరసారాలాడగా చివరికి 75 లక్షలకు బేరం కుదిరిందని సమాచారం. ఇక నటి కాజల్ అగర్వాల్ టాలీవుడ్ చిత్రం జనతా గ్యారేజ్‌లో సింగిల్ సాంగ్‌లో చిందేయడానికి అక్షరాలా అర కోటి పుచ్చుకున్నట్లు టాక్.
ఇలా టాప్ హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్‌కు సిద్ధం అంటుంటే ఇంకా ప్రత్యేక గీతాల్లో ఆడే నర్తకీమణులకు అవకాశాలెక్కడ ఉంటాయి. అయితే వ్యాపారపరంగా ప్లస్ అవుతుందని దర్శక నిర్మాతలే భారీ మొత్తాలను చెల్లించి టాప్ హీరోయిన్లను ఐటమ్ బాంబ్‌లుగా మారుస్తున్నారన్న వాదనలో నిజం లేకపోలేదు. ఇక ప్రేక్షకులు కూడా టాప్ హీరోయిన్ల శృంగార భరిత నృత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారన్నది గమనార్హం. ఇప్పుడిది ట్రెండ్‌గా మారిందనవచ్చు.