తమిళసినిమా: రాజకీయాల్లో వారసులు రాత్రికి రాత్రే ఎదుగుతున్నారని, సినిమాల్లో మాత్రం అలా కుదరడం లేదని సీనియర్ దర్శకుడు, నటుడు కే భాగ్యరాజ్ వ్యాఖ్యానించారు. నటుడు విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అసురగురు’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న కే భాగ్యరాజ్ మాట్లాడుతూ.. సినీరంగంలో వారసులకు విజయాలు సులభంగా రావడం లేదని, పోరాడి సాధించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లో మాత్రం వారసులు రాత్రికిరాత్రే ఎదుగుతున్నారని, ముఖ్యమైన పదవులు వారిని వరిస్తున్నాయి అన్నారు. కే భాగ్యరాజ్ కొడుకు శంతను హీరోగా పరిచయమై చాలాకాలమైనా మంచి హిట్ కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్న విషయం ఇక్కడ గమనార్మం. మరోవైపు సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న నటుడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి ఇటీవల డీఎంకే యువజన కార్యదర్శి పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో కే భాగ్యరాజ్ చేసిన వ్యాఖ్యలు చర్ఛనీయాంశంగా మారాయి.
విక్రమ్‌ప్రభుకు జోడీగా నటి మహిమా నంబియార్ నటించిన ‘అసురగురు’ చిత్రంలో యోగిబాబు, జగన్, మనోబాల ముఖ్యపాత్రలను పోషించారు. జేఎస్బీ ఫిలిం స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌దీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన దర్శకుడు మోహన్‌రాజా శిష్యుడు. గణేశ్‌రాఘవేంద్ర సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు విక్రమ్‌ప్రభు, నటి మహిమా నంబియార్, నిర్మాత కలైపులి థాను, ఎడిటర్ మోహన్ అతిథులుగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment