కోవిడ్ 19 (కరోనా వైరస్) ప్రభావంతో సినిమా షూటింగ్స్ ఆగిన సంగతి తెలిసిందే. అయితే ఫిల్మ్ అండ్ టెలివిజన్ షోలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆయా నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా పాటించాలని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 11 (సోమవారం) నుంచి నిర్మాణ సంస్థలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలుపెట్టుకోవచ్చు. ఎడిటింగ్, డబ్బింగ్, రీ–రికార్డింగ్, సౌండ్ డిజైన్/ సౌండ్ మిక్సింగ్, డీఐ (డిజిటల్ ఇంటర్ మీడియట్) విభాగాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఐదుగురు మాత్రమే పాల్గొనాలి.
గ్రాఫిక్స్ వర్క్ కోసం పది నుంచి పదిహేను మంది పని చేయవచ్చు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజేషన్, ట్రావెల్ పాస్‌లు.. ఇలా కరోనా నిర్మూలనలో భాగమైన వాటిని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో పాల్గొనేవారు పాటించేలా నిర్మాతలు తగిన చర్యలు తీసుకోవాలి. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా, సినిమా, టెలివిజన్ రంగాలకు సంబంధించిన నిర్మాతలు కరోనా కారణంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని కోలీవుడ్ టాక్. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment