ఇక్కడా ‘అమ్మ’ థియేటర్లు రావాలి!
‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ‘సినిమా సిటీ’ కోసం రెండువేల ఎకరాలు కేటాయించడం ఆనందంగా ఉంది. కానీ, చిత్రసీమ అభివృద్ధి కోసం కృషి చేసేవారికే భూమి కేటాయించాలి. అంతేకానీ, గుత్తాధిపత్యం వహించేవారికి అప్పగించకూడదని మనవి చేసుకుంటున్నా’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పారు. రెండు వేల ఎకరాలు కేటాయించినంత మాత్రాన సమస్యలు సమసిపోవనీ, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని భరద్వాజ్ చెబుతూ -‘‘థియేటర్ల గుత్తాధిపత్యాన్ని అరికట్టాలంటే టిక్కెట్ విధానాన్ని కంప్యూటరైజింగ్ చేయాలి.
దానివల్ల పారదర్శకత రావడంతో పాటు ప్రభుత్వానికి కూడా పన్నులు సక్రమంగా అందుతాయి. అలాగే, చిన్న చిత్రాలకు ఆటలను ఐదుకి పెంచడంతో పాటు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలి. అది వెంటనే ఆచరణలో పెడితే నిర్మాతలు, థియేటర్ అధినేతలు, పంపిణీదారులకు మేలు జరుగుతుంది. తమిళనాడులో చిన్న చిత్రాలను ప్రదర్శించుకోవడానికి ‘అమ్మ’ పేరుతో, కర్నాటకలో ‘జనత’ పేరిట థియేటర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కేరళలో ఇప్పటికే కొన్ని థియేటర్లు ఉన్నాయి.
గుజరాత్‌లో కూడా కట్టించాలనుకుంటున్నారు. మన రెండు రాష్ట్రాల్లోనూ ఇలా థియేటర్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. కేసీఆర్ ప్రతిపాదించిన రెండు వేల ఎకరాల ‘చిత్రనగరి’లో మీకు స్టూడియో కట్టాలనే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు -‘నాకస్సలు అలాంటి కోరికలేవీ లేవు. రెండు రాష్ట్రాల్లోనూ పరిశ్రమ అభివృద్ధి చెందితే ఆనందపడతాను. అంతేకానీ నాకు భూములు వద్దు’’ అని భరద్వాజ్ స్పష్టం చేశారు.