
అమెరికా నుంచి తిరిగి ఇండియా వచ్చిన తనుశ్రీ దత్తా బాలీవుడ్‌లో చిన్న సైజ్ బాంబ్‌లాంటిదే పేల్చారు. ఆ మోత ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. 2008లో ‘హార్న ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసింది. అయితే ఈ వేధింపులు జరిగి ఇప్పటికి దశాబ్దం అవుతోంది. ఈ వివాదం జరిగినప్పుడు ఎక్కువగా స్పందించని బాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు తనుశ్రీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, ఫర్హాన్ అక్తర్ వంటి ప్రముఖులు తనుశ్రీకి మద్దతు తెలిపారు.
అయితే ఇంత జరుగుతున్న స్టార్ హీరోలు కానీ, ఖాన్‌ల త్రయంతో సహా బిగ్ బీ అమితాబ్ కూడా ఈ విషయంపై స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు అభిమానులు. మిగితా వారి సంగతి ఎలా ఉన్నా ఈ విషయంలో బిగ్ బీ తీరు మాత్రం ఒకింత నిరాశపర్చేవిధంగా ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇందుకు కారణం తనుశ్రీ వివాదం పట్ల అమితాబ్ స్పందించిన తీరు. తనుశ్రీ - నానా వివాదం గురించి అమితాబ్‌ను ప్రశ్నించగా ఆయన ‘నేను తనుశ్రీని కాదు.. నానా పటేకర్‌ని కాదు.. మరి నేను ఎలా స్పందించాలి’ అంటూ చిత్రమైన సమాధానం ఇచ్చారు.
అయితే అమితాబ్ వ్యాఖ్యలపై తనుశ్రీ తీవ్రంగా మండిపడుతున్నారు. బిగ్ బీ లాంటి సూపర్ స్టార్ ఇలా మాట్లాడటం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఇలాంటి స్టార్‌లందరూ సినిమాల్లోనే ఆదర్శాలను వల్లిస్తారు తప్ప నిజ జీవితంలో కాదంటూ తనుశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘మీ(బిగ్ బీ) ముందు ఇలాంటి వివాదాలు జరుగుతున్నప్పుడు మీరు ఎవరో ఒక పక్షాన మాట్లాడటం అవసరం. కానీ మీ సమాధానం నన్ను చాలా బాధపెట్టింది. మహిళలకు జరిగే అన్యాయాల గురించి మాట్లడలేని వారు, ఆడవారికి మద్దతు తెలిపే సినిమాల్లో, ప్రకటనల్లో నటించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నారు.
అంతేకాక ఆమె ‘ఈ విషయం గురించి నేను సోషల్ మీడియాలో మాట్లాడను.. టీవీ చానెల్సలో కూడా మాట్లాడను. కానీ జనాల నుంచి కూడా సరైన స్పందన లేదు. ఇది నా ఒక్కర్తి బాధ మాత్రమే కాదు. ఇండస్ట్రీలోని ఎందరిదో. వారంతా ఇలా ధైర్యంగా ముందుకు రాలేకపోయారు. కానీ నేను అలా కాదు. నా ధర్మాన్ని పూర్తిగా నిర్వహిస్తాను. ఫలితాన్ని భగవంతుడికి వదిలివేస్తాను. ఇక మీదట నేను బాలీవుడ్‌లో నటించను. అమెరికా వెళ్లి పోతాన’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment