తనుశ్రీ దత్తా, నానా పటేకర్
‘నటుడు నానా పటేకర్ 2008లో ఓ సినిమా షూటింగ్ సమయంలో నన్ను లైంగికంగా వేధించాడు’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసి తనుశ్రీ దత్తా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ‘మీటూ’ ఉద్యమానికి ఇండియాలో శ్రీకారం చుట్టింది కూడా తనుశ్రీయే. ఆమె వ్యాఖ్యలతో నానా పటేకర్‌పై పోలీసులు లైంగిక వేధింపుల కేసును బుక్ చేసి, విచారణ చేపట్టారు. తనుశ్రీ చేసిన వేధింపులకు ఎటువంటి సాక్ష్యం తమకు లభించలేదని పోలీసులు చెప్పారు.
దీంతో నానా పటేకర్‌కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై తనుశ్రీ దత్తా మండిపడ్డారు. ‘‘పోలీసు, న్యాయ వ్యవస్థలకు సాక్ష్యాధారాలు చాలా ముఖ్యం. ఆ సాక్ష్యాలు లభించకుండా ఒక వ్యక్తిని దోషి అంటూ శిక్షించకూడదు అని భారతీయ చట్టం చెబుతోంది. అందుకే నానా పటేకర్‌కు క్లీన్ చిట్ దక్కింది. పోలీసు, న్యాయ వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయి. ఈ కారణంగా ఈ అవినీతిపరుడైన నానాకి క్లీన్ చిట్ ఇచ్చాయి.
నాకంటే ముందు ఎంతో మంది నటీమణులు నానాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినా అతని తప్పులు బయటపడలేదు. నా కేసు విషయంలో ప్రత్యక్ష సాక్షులను బెదిరించి వారి నోరు నొక్కేశారు. ఈ తీర్పు నన్ను షాక్‌కి గురిచేయలేదు. ఇండియాలోని ప్రతి మహిళ ఇలాంటి అనుభవాలకు అలవాటు పడిపోయింది. నాకు న్యాయం జరగనంత మాత్రాన ఇంకెవరికీ న్యాయం జరగదని కాదు. లైంగిక వేధింపులపై ధైర్యంగా పోరాడాలి. ఏదో ఒక రోజు నానా విషయంలో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఇప్పటికీ ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment