
మలయాళం మనసిలాగునుండో!...కేరాఫ్ మాలీవుడ్!
నేంద్రమ్‌పళమ్ చిప్స్.. సూపర్ ఉళున్ను వడ.. అబ్బో దడదడ అవియల్... అదరహో కేరళ కుట్టి... కేక అర్థం కావడంలేదు కదూ.. నేంద్రమ్‌పళమ్ అంటే అరటికాయ చిప్స్.. ఉళ్లున్ను వడ అంటే మినప గారెలు.. అవియల్ అంటే కొన్ని రకాల కూరగాయలతో చేసే కూర.. కేరళ కుట్టి అంటే అర్థమయ్యే ఉంటుంది.. కేరళ అమ్మాయి అని.
ఇప్పటివరకూ చాలామంది కేరళ కుట్టీలు తెలుగు తెరకు వచ్చారు. ఇప్పుడు సీన్ రివర్శ్. తెలుగులో ఇరగదీస్తున్న కుట్టీలు కేరళ వెళుతున్నారు. అది మాత్రమే కాదండోయ్... మన నటులు కూడా వెళుతున్నారు. మరి.. వీళ్లందరికీ ‘మలయాళం మనసిలాగునుండో’? అదేనండి.. మలయాళం అర్థమవుతుందా అని. మనసిలవకపోతే ఏంటి? అయితే ఏంటి? కళాకారులకు భాషతో పనేంటి? ఇక్కడివాళ్లు అక్కడ.. అక్కడివాళ్లు ఇక్కడ... మనం ఆర్టికల్ చదువుతూ ఇక్కడ...
యువరానర్... షి ఈజ్ ద లాయర్!
పుట్టింది కలకత్తాలో... పేరొచ్చింది తెలుగు సినిమాల్లో. అమల తల్లిది ఐర్లాండ్.. తండ్రిది బెంగాల్. అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన మరుక్షణమే... చక్కటి చీరకట్టు, బొట్టు, చెరగని చిరునవ్వుతో తెలుగింటి కోడలు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అనేట్టు నిలిచారు. నాగార్జునతో పెళ్లి తర్వాత అమల నటనకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. మళ్లీ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.
అయితే... ఈ ఇన్నింగ్స్‌లో భాషతో సంబంధం లేకుండా భావోద్వేగభరిత కథలకు ఓటేస్తున్నారు. ఇప్పుడామె ‘కేరాఫ్ సైరాభాను’ అనే మలయాళ సినిమా చేస్తున్నారు. సుమారు ఇరవైయేళ్ల తర్వాత అమల నటిస్తున్న మలయాళ చిత్రమిది. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అమల అక్కినేని లాయర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళ సీనియర్ హీరోయిన్ మంజూ వారియర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అమల పాత్ర ఆమెతో సమానంగా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. గతంలో అమల రెండు మలయాళ సినిమాలు చేశారు. రెండూ హిట్టే. ‘కేరాఫ్ సైరాభాను’తో ముచ్చటగా మూడో హిట్ అందుకోవాలని ఆశిద్దాం.
కమాండర్... బియాండ్ ద లాంగ్వేజ్!
అల్లు అర్జున్ స్ట్రయిట్ మలయాళ సినిమా ఒక్కటీ చేయలేదు. కానీ, అక్కడి స్టార్ హీరోలతో సమానంగా బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. ఈ సై్టలిష్ స్టార్ ప్రతి సినిమా మలయాళంలో డబ్బింగ్ కావడం కామన్. ఎప్పట్నుంచో బన్నీ ఓ మలయాళ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అన్నయ్య కంటే ముందు తమ్ముడు అల్లు శిరీష్ మలయాళ సినిమా చేస్తున్నారు.
మోహన్‌లాల్ హీరోగా చేస్తున్న ‘1971: బియాండ్ బోర్డర్స్’లో ఇండియన్ ఆర్మీ ట్యాంక్ కమాండర్‌గా అల్లు శిరీష్ నటిస్తున్నారు. ఇందులో శిరీష్‌పై ఓ పాట కూడా చిత్రీకరించారు. సినిమా విడుదలకు ముందే కేరళలో ఎక్కడికి వెళ్లినా.. అల్లు అర్జున్ తమ్ముడిగా శిరీష్‌ను గుర్తుపడుతున్నారట! దాంతో అన్నయ్య అర్జున్‌లా నాకూ మలయాళంలో మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నారు శిరీష్.
‘‘అన్నయ్య (అల్లు అర్జున్)పై కేరళ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత చూసి, మలయాళ సినిమాలు, ఆ కల్చర్‌తో నేను ప్రేమలో పడ్డాను. అందుకే, మలయాళ సినిమా ఛాన్స్ రాగానే అంగీకరించా. ‘1971: బియాండ్ బోర్డర్స్’ వంటి దేశభక్తి సినిమా చేసే ఛాన్స్ మళ్లీ వస్తుందనుకోవడం లేదు. మా యూనిట్‌లో తెలుగు ఆర్టిస్ట్‌ని నేనొక్కడినే. అందరూ ఫ్రెండ్లీగా చూసుకుంటున్నారు. మనతో పోలిస్తే వాళ్ల యాక్టింగ్ సై్టల్ డిఫరెంట్‌గా ఉంటుంది. మోహన్‌లాల్‌గారు మొదలుకుని మలయాళ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు మన తెలుగులోకి వస్తున్నారు. నేను మలయాళ సినిమాలో నటించడం హ్యాపీ’’ అన్నారు అల్లు శిరీష్.
స్నేహ.. ద గ్రేట్ మామ్!
తెలుగమ్మాయి స్నేహ కూడా ఇప్పుడో మలయాళ సినిమా చేస్తున్నారు. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఆ సినిమా పేరు ‘ద గ్రేట్ ఫాదర్’. ఇందులో హీరో వైఫ్‌గా, ఓ అమ్మాయికి తల్లి పాత్రలో స్నేహ నటిస్తున్నారట! ఆల్రెడీ స్నేహ పలు మలయాళ సినిమాలు చేశారు. గతంలో మమ్ముట్టితో రెండుసార్లు కలసి నటించారు. మరి, ఈ ‘గ్రేట్ ఫాదర్’ ప్రత్యేకత ఏంటంటే... తల్లైన తర్వాత స్నేహ చేస్తున్న తొలి చిత్రమిది. సినిమాలోనూ ఆమె తల్లిగానే నటిస్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత స్నేహ నటిస్తున్న సినిమా కావడంతో క్రేజ్ ఏర్పడింది. ఇందులో స్నేహ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట! ‘ద గ్రేట్ ఫాదర్’ విడుదల తర్వాత స్నేహ కెరీర్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఎదురు చూడాలి. తమిళ హీరో ప్రసన్నతో వివాహానంతరం స్నేహ చెన్నైలో సెటిల్ అయ్యారు.
‘‘విహాన్ (స్నేహ కుమారుడు) జన్మించిన తర్వాత యాక్టింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాను. మధ్యలో కొన్ని మంచి అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు. దర్శకుడు హనీఫ్ ‘ద గ్రేట్ ఫాదర్’ స్క్రిప్ట్ వినిపించిన తర్వాత నో చెప్పలేకపోయాను. చాలా పవర్‌ఫుల్ మదర్ క్యారెక్టర్. ఓ తల్లిగా, ఈ సినిమాలో ప్రస్తావిస్తున్న సమస్య గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం నా బాధ్యతగా భావించా. ఈ మలయాళ సినిమాతో పాటు ఓ తమిళ సినిమా కూడా చేస్తున్నా. మంచి ఛాన్సులొస్తే తెలుగులోనూ నటిస్తా’’ అన్నారు స్నేహ.
125 నాటౌట్... న్యూ ఇన్నింగ్స్!
సెంచరీ ఎప్పుడో కొట్టేశారు శ్రీకాంత్. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 125కు పైగా సినిమాల్లో నటించారాయన. తెలుగు ఇండస్ట్రీతో పాతికేళ్ల అనుభవం ఆయనది. ఇప్పుడు నటుడిగా మళ్లీ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించనున్న సినిమాతో శ్రీకాంత్ మలయాళ తెరకు పరిచయం అవుతున్నారు.
శ్రీకాంత్‌తో పాటు తమిళంలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగబ్బాయి విశాల్‌ను కూడా కీలక పాత్రకు ఎంపిక చేశారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా శ్రీకాంత్, విశాల్... ఇద్దరికీ మలయాళంలో మొదటిది. ఈ సినిమాతో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న మరో స్టార్ రాశీఖన్నా. తెలుగులో హీరోయిన్‌గా మంచి స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ ఢిల్లీ డాల్, మోహన్‌లాల్ సినిమా కావడంతో ఓకే చెప్పారట. ఇందులోనే విశాల్‌కి జోడీగా హన్సిక నటించనున్నారని సమాచారం. ఒక్క సినిమాతో ఇంతమంది పరభాషా నటీనటులను మలయాళ తెరకు పరిచయం చేస్తున్న మోహన్‌లాల్‌పై అక్కడ సరదాగా జోకులు వేస్తున్నారు.
‘‘సినిమాలో ఆయా పాత్రలకు ప్రాముఖ్యత ఉంది కాబట్టే... తెలుగు, తమిళ స్టార్స్ శ్రీకాంత్, విశాల్ మా సినిమాలో నటించడానికి అంగీకరించారు. వాళ్ల స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువే ఉంటుంది. అంతే కానీ, రెండు మూడు భాషల్లో సినిమా తీసే ఆలోచన మాకు లేదు. ఇది మల్టీ–లింగ్వల్ సినిమా కాదు. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే తీస్తున్నాం. ఇతర భాషల్లో డబ్బింగ్ చెయ్యొచ్చా? లేదా? అనే నిర్ణయం తర్వాత తీసుకుంటాం’’ అని చెప్పారు చిత్ర దర్శకుడు బి. ఉన్నికృష్ణన్.
గత ఏడాదే ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు
ఫ్యామిలీ జానర్ కథానాయకునిగా పేరు తెచ్చుకుని, ఇప్పుడు విలన్‌గా జగపతిబాబు వీర విహారం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాదే ఆయన కేరళ తెరకు పరిచయమయ్యారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘పులి మురుగన్’లో జగపతిబాబు విలన్‌గా నటించారు.
ఆయన పాత్ర పేరు ‘డాడీ గిరిజ’. తెలుగులో ‘మన్యంపులి’గా విడుదలై ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, ‘పులి మురుగన్’ విడుదల తర్వాత జగపతిబాబు కేరళ వెళ్లినప్పుడు ఆయన పేరుతో కాకుండా ‘డాడీ గిరిజ’ అని పిలిచారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ‘‘పొరుగు రాష్ట్రంలో అభిమానులను సంపాదించుకోవడం చాలా హ్యాపీగా ఉంది’’ అని జేబీ అన్నారు. మాలీవుడ్ నుంచి ఆయనకు మంచి అవకాశాలు వస్తున్నాయట.
– సత్య పులగం