తమిళంలోనూ ప్రేమదాసే
సినీ దాసులెం దరున్నా సినీ జగత్తులో దేవదాసు ఒక్కరే... ఆయనే అక్కినేని. ఈ దేవదాసు కీర్తి అజరామరం. తమిళంలోనూ ఈయన ప్రేమదాసుగానే కీర్తికెక్కారు. అక్కినేని నాగేశ్వరరావు భౌతికంగా మన మధ్య లేకున్నా సినీ భారతావనికి ఆయన పేరు చిరస్మరణీయమే. అక్కినేని నాగేశ్వరరావు గురించి ఎందరో ఎన్నో రకాలుగా కీర్తించారు. అయినా ఆ మహానటుడి గురించి రాయడానికి మాటలు చాలవు. 250 చిత్రాల సినీ యుగ పురుషుడు. గ్లాస్ పట్టితే అక్కినేని పట్టాలి. క్లాస్ స్టెప్‌లేస్తే ఆయనే వేయాలి.
ప్రేమనగర్ చిత్రంలో నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది అంటూ ప్రేక్షకులను గమ్మత్తుగా మత్తులోకి తీసుకెళ్లారు. నిజ జీవితంలో నిండు పున్నమి లాంటి ఆయన నవ్వే అభిమానులను మైమరపించింది. అంతటి చిద్విలాసి ఏఎన్‌ఆర్. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తమిళ పరిశ్రమతోనూ విడదీయరాని అనుబంధం వుంది. ఎవర్‌గ్రీన్ చిత్రం దేవదాస్. తమిళంలోనూ అద్భుత విజ యాన్ని సాధించింది. జెమినీ గణేశన్, సరోజదేవి నటించిన కల్యాణ పరిసు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యపాత్ర పోషించారు. ఒరు ఇరవు, మాయా కరి, పూంగోతై, ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి, అల్లా ఉద్దీన్ అద్భుద విళక్కు, మంజల్ మహిమై, అదిశయ పెణ్, దైవమేతుణై, ఎంగళ్ సెల్వి, తుయ్ ఉళ్లం, అన్భుమగళ్, మనిదన్ మారవిళ్లై, పెణ్ముణం మొదలగు తమిళ చిత్రాల్లో నాగేశ్వరరావు నటించి తమిళ ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందారు.
భారత జాతి గొప్ప నటుడిని కోల్పోయింది
తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు అస్తమయం నన్నెంతగానో దిగ్భ్రాంతికి గురి చేసింది. నాగేశ్వరరావు నాటక రంగం నుంచి ఎదిగిన నటుడు. ఆయన ధర్మపత్ని చిత్రం నుంచి సినీ కెరీర్‌ను ప్రారంభించారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందిన దేవదాస్ చిత్రం నాగేశ్వరరావు నట విశ్వరూపానికి మైలురాయిగా నిలిచింది. ఇరు ఇరవు, పూంగోతై తదితర చిత్రాల్లో తమిళ ప్రేక్షకులను అలరించిన నటుడీయన. తెలుగు చిత్రం ఇద్దరు మిత్రులు చిత్రంలో ద్విపాత్రాభినయం చేసిన తొలి హీరో నాగేశ్వరరావు. రఘుపతి వెంకయ్య, దాదా ఫాల్కే అవార్డు, పద్మభూషణ్, కలైమామణి, ఫిలింఫేర్, ఎన్‌టీఆర్ జాతీయ అవార్డు వంటి ఎన్నో అవార్డులకు అక్కినేని అలంకారం అయ్యారు. తెలుగులో నా తొలి చిత్రం (మనుషులు మమతలు) నాగేశ్వరరావుతోనే అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. అలాంటి మహానటుడి మరణం భారత సినీ జాతికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
- సీఎం జయలలిత
సినీ ఆకాశంలో గొప్ప స్టార్
అక్కినేని నాగేశ్వరరావు నాకు మానసిక గురువు. అలాంటి మహానటుడి మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు పదహారేళ్ల వయసులో సహాయ దర్శకుడిగా పని చేశాను. ఆ సమయంలో నాగేశ్వరరావు గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఎన్నో సలహాలిచ్చేవారు. అక్కినేని సినీ వినీలాకాశంలో ఒక గొప్ప స్టార్. తెలుగు సినిమా పెద్ద దిక్కును కోల్పోయింది.
- కమలహాసన్