సినిమాల్లో పాడటంతోనే ఆగిపోకుండా.. నాలుగు దశాబ్దాలకు పైగా ఖాదీనే ధరించి.. తన అభిమాన దీప్తితో పొందూరు ఖాదీ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. స్వయంగా డిజైన్ తయారు చేయించి.. ఏఎన్నార్ పంచెలన్న ఒక బ్రాండ్ ఇమేజ్ సృష్టించి.. పొందూరు ఖాదీ ఆర్థికంగానూ బలపడటానికి బలమైన పునాది వేశారు. నేడు అక్కినేని అంటే.. పొందూరు ఖాదీ, పొందూరు ఖాదీ అంటే.. అక్కినేని అన్నట్లు పర్యాయ పదాలుగా మారిపోయారు. ఆ విధంగా పొందూరుతోనూ.. శ్రీకాకుళం జిల్లాతోనూ విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ఒక్క ఖాదీయే కాకుండా చేనేతపైనా తన ముద్ర వేసిన ఆయన శ్రీకాకుళంలో బీసీఐసీ ఉత్సవాలకు, మరికొన్ని చోట్ల జరిగిన కార్యక్రమాలకు హాజరై జిల్లాపై తన ఆత్మీయతను చాటుకున్నారు. నేడు ఆ మహానటుడు మన మధ్య నుంచి వెళ్లిపోవచ్చు గాక.. వేసిన ముద్ర, ఆత్మీయ బంధం చిరస్మరణీయంగా నిలిచి పోతాయి.బహుదూరపు బాటసారి అక్కినేని నాగేశ్వరరావు మరణవార్త సిక్కోలు జిల్లాను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆయనకు ఈ ప్రాంతంతో విడదీయలేని బంధం ఉంది. ఖాదీ దుస్తులంటే ఏఎన్‌ఆర్‌కు ప్రాణం. ఆయన పేరుతో పొందూరు, అక్కులుపేట చేనేత కార్మికులు పంచెలకు జరీ అంచులు నేస్తుంటారు. సరుబుజ్జిలి మండలం వీరమల్లిపేటలో గతంలో దేవదాసు పర్యటించారు. ఇక ఆయన లేరనే వాస్తవాన్ని తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర విషాదానికి గురయ్యారు.
అచేనేత వస్త్రాలతో విడదీయలేని అనుబంధం
పొందూరు,ఆమదాలవలస, న్యూస్‌లైన్.: మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు చేనేత వస్త్రాలంటే వల్లమానిన అభిమానం. అందుకే ఆయన స్వయంగా డిజై న్ తయారు చేయించి రూపొందించిన జరీ అంచు ఖాదీ పంచెలు వస్త్ర ప్రపంచంలో నేటికీ ధ్రువ తారగా నిలుస్తున్నాయి. ఖాదీకి వన్నె తెచ్చిన జరీ అంచు పంచెలను సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ హంసలతో పోల్చిన సందర్భం ఉంది. గాంధీ మనుమరాలు తారాగాంధీ మూడు సార్లు పొందూరు ఖాదీ సంస్థను సందర్శించిన సందర్భంలో ఏఎన్‌ఆర్ అంచుపంచెలను పరిశీలించి తన్మయత్వం చెందారు. జాతీయ నావికాదళ అధికారుల సతీమణుల సంఘం సైతం ఈ పంచెలను చూసి కార్మికుల హస్తకళా నైపుణ్యాన్ని కొనియాడారు. గతంలో సింహాచలం దేవస్థానానికి సైతం అక్కినేని బోర్డర్‌తో కూడిన పంచెలను సమర్పించేవారు. నాలుగన్నర దశాబ్దాల నుంచి నాగేశ్వరరావు పొందూరు ఖాదీ వస్త్రాలను ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ఈ పరిశ్రమపై కృతజ్ఞతా భావంతో ఆయన నటించిన పలు చిత్రాల్లో పొందూరు పేరు కలిసి వచ్చే విధంగా పాట ల్లో, సంభాషణల్లో ప్రస్తావింపజేసేవారు.
ఏఎన్‌ఆర్ అంచు పంచెలు ఉత్పత్తి ఇలా...
ఏఎన్‌ఆర్ అంచుపంచెలు రెం డు రకాలు. 5 సెంటీ మీటర్ల వెడల్పుతో ఉన్న అంచును సింగిల్ బోర్డర్ అని, 10 సెంటీమీటర్ల వెడల్పుతో ఉంటే డబుల్ బోర్డర్ అని గతంలో నాగేశ్వరరావే నామకరణం చేశారు. ఈ అంచులు అందమైన ఆకుపచ్చ, ఊదా, కెంపు రంగుల్లో ఉంటాయి. వీటిని నేయడానికి నూరవ కౌంట్ దారాన్ని ఉపయోగిస్తుంటారు. గుజ రాత్‌లోని సూరత్ నుంఈ ప్రత్యేకంగా తెప్పిస్తున్న బంగారు జరీని వీటిలో ఉపయోగిస్తుంటా రు. సింగిల్ బోర్డర్ పంచె ఖరీదు రూ.3,600, డబుల్ బోర్డర్ రూ. 6,500లు ఉంటుంది. సరాసరిన ఏటా 5.5 లక్షలకు పైగా ఏఎన్‌ఆర్ పంచెలు ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. చేనేత విభాగంలో తక్కువ ఖరీదుకు దొరికే ఏఎన్‌ఆర్ అంచు పంచె లు కూడా ఉన్నాయి. పొందూరు సాయిబాబా చేనేత సహకార సంఘం, సింగుపురం హటకేశ్వర చేనేత సహకార సంఘం, అక్కుల పేట సీతారామ చేనేత సహకార సంఘం సభ్యులు ఎక్కువగా వీటిని నేస్తారు. ఆమదాలవలస మండలంలోని అక్కులపేట,ఏనాంపేట చేనేత కార్మికులు కూడా ఏఎన్‌ఆర్ జరీ అంచు పంచెలను ఎక్కువగా తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు.
వీరమల్లిపేటలో ‘అక్కినేని’
వీరమల్లిపేట(సరుబుజ్జిలి)న్యూస్‌లైన్: చరిత్ర పురుషులు గతిం చినా వారి మధురానుభూతులు, పాతజ్ఞాపకాలు, మనుషులతో ఉన్న సత్సంబంధాలు ఎప్పటికీ మరువలేము. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అకాల మరణంతో మండలంలోని సింధువాడ పంచాయతీ పరిధిలోని వీరమల్లిపేట గ్రామం చిన్నబోయింది. గతంలో ఈ ఊర్లో అక్కినేని అడుగు పెట్టి గడిపినది కొద్ది గంటలే అయినా గ్రామస్తులతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అప్పటి మంత్రివర్యులు తమ్మినేని సీతారాం సతీమణి వాణీసీతారాం అధ్యక్షురాలుగా ఉన్న తమ్మినేని శ్రీరామ్మూర్తి సేవాసమితి వీరమమల్లిపేట గ్రామాన్ని దత్తతగా తీసుకొని అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆబృహత్తర కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఏఎన్‌ఆర్ 2002 జనవరి 27న గ్రామంలో అడుగుపెట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలు, అభిమానులతో కొన్ని గంటలు గడిపారు. ఆయన మరణ వార్త ఇక్కడి వారిని శోకసంద్రంలోకి నెట్టింది.
అక్కినేని మరణం కలచి వేసింది
అక్కినేని ఆకస్మిక మరణం నన్ను కలచివేసింది. ఆయన తమ గ్రామానికి వచ్చిన సందర్భంగా సర్పంచ్‌గా ఉండడం, పిన్న వయస్కుడిని కావడంతో నన్ను అభినందించి పలుసూచనలు,సలహాలు అందించారు. ఉన్నకొద్దిగంటలే అయినా మమ్మల్ని ఎంతో ఆకట్టుకొన్నారు. గ్రామంలో ఉన్న వాతావరణం, ఐకమత్యాన్ని చూసి వీరమల్లిపేటకు బదులు శాంతిమల్లిపేట అని పేరుపెడితే బాగుండేదని సలహా ఇచ్చారు. జి.శివానాందమూర్తి,సర్పంచ్,సింధువాడ
నటసామ్రాట్ నటనను తలుచుకుంటూ..
టీవీలకు అతుక్కుపోయిన అభిమానులు
శ్రీకాకుళం కల్చరల్, న్యూస్‌లైన్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మరణవార్త సిక్కోలు ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది. మహానటుడు మరిలేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయారు. బుధవారం తెల్లవారుజాము నుంచే టీవీలకు అతుక్కుపోయి ఆయన గురించి వచ్చే వార్తలను, విశేషాలను తెలుసుకున్నారు. ఏఎన్‌ఆర్ నటించిన సినిమాలు, పోషించి పాత్రలు, చేసిన నృత్యాలు, అభినయాలను తలచుకున్నారు. ఏఎన్‌ఆర్‌తో స్వీయ పరిచయం ఉన్న వారు వారి జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు. చిన్నతనం నుంచి ఆయన సినిమాలను చూసిన అభిమానులు కంటతడిపెట్టుకున్నారు.
్డ్ఠ 2002 జనవరి 29, 30, 31 తేదీల్లో మద్రాసు తెలుగు అకాడమి సంస్థ నిర్వాహకులు టీవీకే శాస్త్రి ఆధ్వర్యంలో భారత కల్చర్, ఇంటిగ్రిటీ కమిటీ (బీసీఐసీ) నిర్వహణలో పట్టణంలోని ఎన్‌టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో జరిగినసాంస్కృతిక ప్రదర్శనల సందర్భంగా అక్కినేని శ్రీకాకుళం వచ్చారు. ఆయన్ను చూసేందుకు, కలిసేందుకు, మాట్లాడేందుకు ఎంతో మంది అభిమానులు పోటీ పడ్డారు. ఆ సందర్భంగా ఏఎన్‌ఆర్‌ను కలిసిన కొంత అభిమానుల మాటలు మనం పంచుకుందాం.
అక్కినేని ద్వారానే ‘పోజ్’ వచ్చింది
ఏఎన్‌ఆర్ స్టిల్స్‌ను చూసి నేను స్టైల్ మార్చాను. నాటి నుంచే తనను అందరూ ‘అక్కినేని పోజ్’ అనే వారు. తెలుగు సినిమా రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఎలిన వారు ఎన్‌టి ఆర్, ఎఎన్‌ఆర్‌లు. వారిద్దరూ లేక పోవడం విచారకరం. సినిమా రంగంలో కొత్త శకం వీరి ద్వారానే వచ్చింది. ఏఎన్‌ఆర్ నటించిన దేవదాసు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం సినిమాలు అద్భుతమైనవిగా చెప్పవచ్చు.
- చిగిలిపల్లి శ్యామలరావు, మాజీ సినీ నటుడు
చాలాసార్లు అక్కినేనిని కలిశాను
టీవీకే శాస్త్రి నిర్వహించిన బీసీఐసీ కార్యక్రమాలలో చాలాసార్లు ఏఎన్‌ఆర్‌ను కలిశాను. ఆయన మంచి నటుడు, చాలా సౌమ్యుడు. ఎవరిని విమర్శించరు. దేవుడిని నమ్మడు. తన స్వయం కృషే తన ఎదుగుదలకు కారణంగా అనుకునే వ్యక్తి. ఉదయం ఆరు గంటలకు రేడియోలో ఆయన ఇక లేరనే వార్త విని చలించిపోయాను.
- బండారు చిట్టిబాబు,
సినీ,రేడియో సంగీత దర్శకుడు
కుటుంబ కథా చిత్రాల్లో నటించారు
నాగేశ్వరరావు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లోనే నటించేవారు. పాటలు, నటన బాగుండేవి. ఆయన కుటుంబం బాగుండాలి.
- ఐ.సావిత్రమ్మ, ఇప్పిలి వీధి, శ్రీకాకుళం