నేను అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాలి... | Telugu Dialogues in Salman Khan s Kick | Sakshi
Sakshi News home page

నేను అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాలి...

Published Mon, Jun 16 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

నేను అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాలి...

నేను అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాలి...

ఇదేంటి! సల్మాన్‌ఖాన్ స్టిల్ పెట్టి ‘నేను అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాలి’ అంటారేం టనుకుంటున్నారా! అయితే ముందు అర్జంట్‌గా ఇటీవలే విడుదలైన సల్మాన్ ‘కిక్’ ప్రచార చిత్రం చూడండి. ఎందుకో మీకే అర్థమవుతుంది. అసలు విషయం ఏంటంటే... ఈ ట్రైలర్‌లో సల్మాన్ చెప్పిన డైలాగ్ ఇది. సల్మాన్ ఈ డైలాగుని హిందీలో చెప్పారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అచ్చ తెలుగులో చెప్పారు. అవును.. నిజం. ‘నేను అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాలి’ అంటూ చక్కగా తెలుగులో డైలాగ్ చెప్పారు.
 
 కథ రీత్యా లాకప్‌లో ఉన్న సల్మాన్... పోలీసులతో చెప్పే డైలాగ్ ఇది. అసలు ఆ సన్నివేశంలో ఆయన తెలుగులో మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? తెలుగు డైలాగ్ ఈ సినిమాలో ఇదొక్కటేనా? ఇంకా ఉంటాయా? అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. ఇక ట్రైలర్ విషయానికొస్తే... దేశవ్యాప్తంగా ఉన్న సల్మాన్ అభిమానులు పండుగ చేసుకునేలా ఉంది. కేవలం రెండున్నర నిమిషాల ట్రైలర్‌లోనే ఊహకందని ఫీట్లు చేసేశాడు సల్మాన్. ఇక సినిమాలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సూపర్‌హీరో లుక్‌తో సల్మాన్ చేసిన విన్యాసాలు ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉన్నాయి.
 
 రెండు చక్రాల సైకిల్ నుంచి గాల్లో ఎగిరే హెలికాప్టర్ వరకూ ప్రతి వాహనంతో ఆడుకున్నారు సల్మాన్. ఈ ప్రచారచిత్రంతో సినిమాపై అంచనాలు ఆకాశమంత ఎత్తుకు చేరాయనడం తప్పేం కాదు. హాలీవుడ్ స్థాయిలో ‘కిక్’ ఉండబోతోందనడానికి ఈ ట్రైలరే ఓ నిదర్శనం. తెలుగు సినిమాలపై విపరీతమైన అభిమానం కనబరిచే సల్మాన్... గతంలో ‘పోకిరి, రెఢీ, స్టాలిన్’ చిత్రాలను బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. రాబోతున్న ‘కిక్’ కూడా రవితేజ ‘కిక్’ సినిమాకు రీమేక్ కావడం గమనార్హం.పైగా ఈ ట్రైలర్‌లో ఆయన తెలుగులో మాట్లాడడం నిజంగా విశేషమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement