ఇప్పటికే డ్రగ్స్ కేసు, ఫోర్నోగ్రఫీ కేసులతో సతమతమవుతున్న సినీ ప్రముఖలపై తాజాగా మరో కొత్త కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార ఘటనపై బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ నటులు సల్మాన్ ఖాన్, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ సహా మొత్తం 38 మంది సెలబ్రిటీలపై తాజాగా కేసు నమోదు అయింది. అసలు దిశ కేసుకు, వీరికి సంబంధం ఏంటి? అన్నది చర్చనీయాంశంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... నవంబర్ 27, 2019న హైదరాబాద్‌లో ఓ యువతిపై నలుగురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడి, అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు దిశ అని పేరు పెట్టారు. ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా బాధితుల అసలు పేర్లను వాడకుండా ఇతర పేర్లతో వాటి గురించి చర్చలు చేస్తుంటారు. ముఖ్యంగా బాధితురాలి పేర్లను, ఫోటోలను బహిర్గతం చేయడం నేరం. ఒకవేళ అలా చేస్తే వారిపై కేసు నమోదు అవుతుంది.
అయితే దిశ ఘటన జరిగినప్పుడు మాత్రం పలువురు సెలబ్రిటీలు ఆమె అసలు పేరును ఉపయోగించారు. కొందరైతే ఫోటో కూడా వాడారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, అనుపమ్ ఖేర్, ఫర్హాన్ అక్తర్, సల్మాన్‌ఖాన్ సహా టాలీవుడ్ స్టార్స్ రవితేజ, అల్లు శిరీష్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి ఉన్నారు. వీరు బాధిత అమ్మాయి పేరుని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. ఇలాంటి సందర్భాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి నలుగురుకి ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు ఇలా పేరు వెల్లడించడం సరికాదంటూ ఢిల్లీకి చెందిన గౌరవ్ గులాటి అనే న్యాయవాది సబ్జీ మండీలోని పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 228ఏ కింద కేసు పెట్టారు. అంతేకాదు వీరిని అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment