టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారం.. మనీల్యాండరింగ్‌ కేసు నమోదు | ED Sends Summons to Tollywood Celebrities Over Drug Case | Sakshi
Sakshi News home page

Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారం.. మనీల్యాండరింగ్‌ కేసు నమోదు

Published Wed, Aug 25 2021 6:35 PM | Last Updated on Thu, Aug 26 2021 8:05 AM

ED Sends Summons to Tollywood Celebrities Over Drug Case - Sakshi

Tollywood Drug Case: టాలీవుడ్‌ ప్రముఖులతో ముడిపడి ఉన్న డ్రగ్స్‌ కేసు కథ మరో మలుపు తిరిగింది. నాలుగేళ్ల క్రితం నాటి ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అకస్మాత్తుగా దూకుడు పెంచింది. ఎక్సైజ్‌ విభాగానికి చెందిన సిట్‌ దాఖలు చేసిన చార్జ్‌షీట్ల ఆధారంగా మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. వీటికి సంబంధించి విచారణకు హాజరుకావాలని 10 మంది టాలీవుడ్‌ ప్రముఖులు సహా 12 మందికి బుధవారం నోటీసులు పంపింది. వీరిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్‌ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్‌ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ కూడా ఉన్నారు. వీరిని ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు విచారించనున్నారు. మాదకద్రవ్యాల క్రయవిక్రయాలకు సంబంధించి మనీలాండరింగ్‌ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. ఈ కోణంలోనే వీరిని ప్రశ్నించనుంది. నేరానికి సంబంధించి ఆధారాలు లభించే వరకు అందరినీ సాక్షులుగానే పరిగణించనుంది.

2017లో విచారణ.. నమూనాల సేకరణ
హైదరాబాద్‌కు చెందిన అనేక మంది ప్రముఖులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఓల్డ్‌ బోయిన్‌పల్లికి చెందిన కెల్విన్‌తోపాటు చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన సోదరులు అబ్దుల్‌ వహీద్, ఖుద్దూస్‌లను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు 2017 జూలై 2న అరెస్టు చేశారు. వీళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లతోపాటు విద్యార్థులు, సిటీ ప్రముఖులకు డ్రగ్స్‌ విక్రయించినట్లు అనుమానించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్‌) ఏర్పాటై 10 మంది అనేక మందికి నోటీసులిచ్చింది. అదే ఏడాది జూలై 19 నుంచి కొన్ని రోజులు వీరిని విచారించింది. 

మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్‌... 11 కేసుల దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిలో ఎక్కడా సినీ రంగానికి చెందిన వారిని నిందితులుగా చేర్చలేదు. 2017 జూలైలోనే టాలీవుడ్‌ ప్రముఖులతోసహా మొత్తం 62 మంది అనుమానితుల నుంచి జుట్టు, గోళ్ల నమునాలను సేకరించింది. మాదకద్రవ్యాలు తీసుకునే వారికి చాన్నాళ్ల పాటు వీటిలో ఆనవాళ్లు ఉంటాయని ఇలా చేసింది. అయితే ఆ పరీక్షల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశాన్ని ఇప్పటికీ బయటపెట్టలేదు. మాదకద్రవ్యాలను ముంబై నుంచి హైదరాబాద్‌?కు రవాణా చేసి.. ఇక్కడ విక్రయించిన దక్షిణాఫ్రికాకు చెందిన రాఫెల్‌ అలెక్స్‌ విక్టర్‌పైనా చార్జిషీట్‌ దాఖలైంది. ఇతడిని 2017లో అరెస్టు చేసి విచారించినప్పుడు కొందరు టాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ చార్జిషీట్ల ఆధారంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఆధారాల సేకరణ కోసం అప్పట్లో సిట్‌ విచారణకు హాజరైన సినీ ప్రముఖులను విచారించాలని తాజాగా నిర్ణయించింది. 

ఎప్పుడు ఎవరిని విచారిస్తారు? 
    ఆగస్టు 31:    పూరీ జగన్నాథ్‌
    సెప్టెంబర్‌ 2:    చార్మీ కౌర్‌
    సెప్టెంబర్‌ 6:    రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
    సెప్టెంబర్‌ 8:    రాణా దగ్గుబాటి
    సెప్టెంబర్‌ 9:    రవితేజతోపాటు డ్రైవర్‌ శ్రీనివాస్‌
    సెప్టెంబర్‌ 13:    నవ్‌దీప్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌
    సెప్టెంబర్‌ 15:    ముమైత్‌ ఖాన్‌
    సెప్టెంబర్‌ 17:    తనీష్‌
    సెప్టెంబర్‌ 20:    నందు
    సెప్టెంబర్‌ 22:    తరుణ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement