ఆ అమ్మాయి ప్రశ్నలకు నిశ్చేష్టుణ్ణయ్యా! | Telugu film director Sunil Kumar Reddy Special Interview | Sakshi
Sakshi News home page

ఆ అమ్మాయి ప్రశ్నలకు నిశ్చేష్టుణ్ణయ్యా!

Published Thu, Jun 26 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM

ఆ అమ్మాయి ప్రశ్నలకు నిశ్చేష్టుణ్ణయ్యా!

ఆ అమ్మాయి ప్రశ్నలకు నిశ్చేష్టుణ్ణయ్యా!

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో సామాజిక స్పృహతో సినిమాలు చేయాలని తపించే అతి తక్కువమంది దర్శకుల్లో ఒకరు సునీల్‌కుమార్‌రెడ్డి. గంగపుత్రులు, సొంత ఊరు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ మంచి స్థానాన్ని ఏర్పరుచుకున్న సునీల్‌కుమార్‌రెడ్డి నుంచి రాబోతున్న చిత్రం ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ విలక్షణ దర్శకునితో సాక్షి జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ.
 
 మళ్లీ అమ్మాయిల ఫేసులకు పరదాలు కట్టారేంటి? ఈ దఫా చర్చ దేనిమీద?
 ‘రొమాంటిక్ కైమ్ కథ’ మాదిరిగానే... ఇది కూడా యువతరం నేపథ్యమే. అయితే... ఆ సినిమా కంటే... ముందుకెళ్లి ఇంకాస్త బోల్డ్‌గా తీసిన సినిమా ఇది. తప్పకుండా నచ్చుతుంది అనుకున్నా. దాదాపు 28 ఇంజనీరియంగ్ కళాశాలలకు, 12 జూనియర్ కాలేజ్‌లకు అతిథిగా వెళ్లి వందలాది మంది విద్యార్థులతో మాట్లాడటం జరిగింది. అప్పుడు ఓ అమ్మాయి అడిగిన ప్రశ్నలు... నన్ను ఆలోచింపజేశాయి. ‘ఒక తాగుబోతు అర్ధరాత్రి అమ్మాయిని ఏదైనా చేస్తే... అది పేపర్‌లో పతాక శీర్షిక అవుతుంది. కానీ... ఇంట్లో బాబాయో..లేక అన్నయ్యో, పాఠాలు చెప్పే గురువో ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తే అది మాత్రం పేపర్లో మూడో పేజీకో నాల్గవ పేజీకో పరిమితం అవుతుంది.
 
 ఎందుకు? అమ్మాయిలు ఇళ్లలోనే క్షేమంగా ఉంటారని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. కానీ... అక్కడే వాళ్లు డేంజర్‌లో ఉన్నారు. ఇది అన్నింటికంటే పెద్ద సమస్య. మరి దీన్నెందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు? ఒక తాగుబోతు తప్పు చేస్తే... ‘వాణ్ణి చంపేయాలి చంపేయాలి’ అని గోల చేసే ఈ సమాజం... ఒక తండ్రి, ఒక అన్న, ఒక గురువు తప్పు చేస్తే...  ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు? అని ఆ అమ్మాయి అడుతుంటే నిశ్చేష్ణుణ్ణై అలా నిలుచుండిపోయాను. వెంటనే ఈ సమస్యపై పూర్తిగా అధ్యయనం చేయాలనిపించింది. రీసెర్చ్ మొదలుపెట్టాను.
 
  అప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. లైంగిక వేధింపుల్లో ప్రపంచంలో మనదేశానిది రెండో స్థానం. ప్రతి ఏడాదీ దేశంలో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ... 53 శాతం మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇందులో సమైఖ్యాంధ్రప్రదేశ్‌ది రెండో స్థానం. ఇది సాక్షాత్తూ మన భారత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్. ప్రతి ఇద్దరమ్మాయిల్లో ఒక అమ్మాయి ఎవరితోనో ఒకరితో వేధింపులు గురవుతూ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీరి బాధను ఫోకస్ చేసే విషయంలో మీడియా కూడా చురుకుగా వ్యవహరించడంలేదు. అందుకే... సినిమా ద్వారా వారి గొంతును ఎందుకు వినిపించకూడదు అనిపించింది. ఆ ఆలోచనకు రూపమే... ‘ఓ క్రిమినల్ ప్రేమకథ’.
 
 ఈ సమస్యకు సరైన పరిష్కారం చెప్పేననే అనుకుంటున్నారా?
 ఒక సమస్యకు వందల పరిష్కారాలంటాయి. వాటిలో నేను ఒక పరిష్కారం చెప్పాను. ఈ సినిమా చేసే ముందు చాలామంది చదువుకునే అమ్మాయిలను ప్రత్యేకంగా కలిశాను. వారిలో 60 శాతం మంది తమ సమస్యల్ని చెప్పుకొని ఘొల్లు మన్నారు. 6వ తరగతిలో పాఠాలు చెప్పే నెపంతో అక్కడక్కడ చేతులేసిన మాస్టారు దగ్గర్నుంచి ప్రస్తుతం సాటి విద్యార్థుల వల్ల ఎదురవుతున్న లైంగిక వేధింపుల వరకూ వారు చెప్పిన సమస్యలు నన్ను ఎంతో కదిలించాయి. ఈ సమస్యలకు తెరపై నేనిచ్చిన పరిష్కారమేంటో నేను చెప్పడం కంటే మీరు తెరపై చూస్తేనే బావుంటుంది.
 
 సమస్యల చుట్టూ పరుగు పెడితే.. డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కదా!
 మీరన్నది నిజం. జాగ్రత్తగా తీయకపోతే... ఇలాంటి కాన్సెప్ట్‌లు డ్రైగా అనిపిస్తాయి. దాన్ని కథగా చెప్పాలనుకున్నప్పుడు అంతర్లీనంగా వినోదాన్ని కూడా జత చేయాలి. కంటి నుంచి నీరు, పెదాలపై నవ్వు ఒకేసారి వచ్చేలా చేయాలి. అదే ఇందులో చేశాను.
 
 కమర్షియల్ పంథాలో వెళ్లకుండా సమస్యల వెంట పరుగెత్తడం రిస్క్ అనిపించట్లేదా?
 లేదు... సినిమా శక్తిమంతమైన మాధ్యమం. దాన్ని వినోదానికే పరిమితం చేయకూడదు. ఏదో ఒక మంచి చెప్పాలి. అయితే... దాన్ని ఆసక్తికరంగా చెప్పినప్పుడు విజయం తథ్యం. ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’లో నేను తీసుకున్న సమస్య సామాన్యమైనది కాదు. వేధింపులు గురైన ప్రతి ఒక్కరూ ఎవరో ఒకర్ని వేధింపులకు గురి చేయడానికే చూస్తారు. ఇదొక చైన్ లింక్. వేధింపులకు గురైన కోడలు... అత్తగా మారాక, తన కోడల్ని వేధించడమే అందుకు ఓ నిదర్శనం. నిర్భయ కేసులో హంతకులందరూ వేధింపులకు గురైనవారే.  ఇలా అన్ని విషయాలనూ ఇందులో సృ్ఫశించాను. అమ్మాయిలు ప్రేమించలేదని ముఖంపై యాసిడ్ పోసేవారి గురించి కూడా ఈ కథలో ఉంటుంది.  
 
 చెడు వెళ్లినంత త్వరగా మంచి జనాల్లోకి వెళ్లదు. ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు ప్రేక్షకులు మరో కోణంలో ఎడ్యుకేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
 మనం చెబితే కానీ తెలుసుకోలేనంత అమాయకంగా జనాలు లేరు. నేను ఇందులో కొత్తగా ఏమీ చెప్పడం లేదు. తప్పుని నిర్భయంగా ఒప్పుకునే స్థైర్యాన్ని ఇస్తున్నానంతే. నా ఇంట్లో ఈ తప్పు జరుగుతోంది అని చెప్పడానికి ఓ ధైర్యం కావాలి. ఓ ఎనిమిదో తరగతి అమ్మాయి... తన తల్లి ముందు కూర్చొని ‘అమ్మా.. బాబాయి ఇలా చేస్తున్నాడు’ అని చెప్పుకోగలగాలి. ఒక్కసారి అంతా బయటకు కక్కేసి, భోరున ఏడ్చుకోగలితే సమస్యలన్నీ తీరిపోతాయి. కండోమ్స్ గురించి ప్రస్తావిస్తే ఒకప్పుడు సెన్సార్‌వాళ్లు గుండెలు బాదేసుకునేవారు. కానీ... ఇప్పుడు కండోమ్స్ గురించి కోట్లు ఖర్చుపెట్టి మరీ పబ్లిసిటీ చేస్తున్నారు. ఒక్క దేవాలయాలు మినహా బళ్లలో కూడా కండోమ్స్‌పై అవగాహన కలిగిస్తున్నారు. అ చైతన్యమే జనాల్లో రావాలి. చెత్త పక్కనుంటే ‘ముక్కుమూసుకొని వెళ్తే సరిపోతుంది’ అనుకునే భావదారిద్య్రం మనం బయటపడాలి. ఆ చెత్తను అక్కడున్నంచి తొలగించే చైతన్యం రావాలి. ఇవన్నీ జరగాలంటే... సమాజం తన మనసులకు కప్పుకున్న ముసుగు విప్పేయాలి. అందుకు సింబాలిక్‌గానే అమ్మాయిల ముఖాలకు ముసుగులు తొడిగాను. అంతేతప్ప స్త్రీలను కించపచడానికి ఆ ముసుగుల్ని చూపించలేదు.  
 
 వార్తను పేపర్లో చదవడానికీ, తెరపై చూడటానికీ తేడా ఉంది. ఘోరాలను కళ్లకు కట్టడం చూసేవారికి క్కూడా కష్టంగా ఉంటుంది కదా!
  కేంద్ర మంత్రి నితీష్‌కుమార్‌కి ఓ అమ్మాయి ఉత్తరం రాసింది. గత కొన్నాళ్లుగా తన తండ్రే తనను రేప్ చేస్తున్నాడని, ఈ విషయం తన అన్నకు చెబితే... తానూ తనను వాడుకోవడం మొదలుపెట్టాడని, ఇదేంటి అన్నయ్యా... అంటే... నాన్న బాధ తీరుస్తున్నావు, మరి నా బాధ ఎవరు తీరుస్తారు? అనడిగాడని ఆ ఉత్తరం సారంశం. వెంటనే నితీశ్‌కుమా సదరు తండ్రికొడుకులపై చర్య తీసుకున్నారు. ఈ విషయం బయటకు రాగానే... ఇలాంటి కేసులు పదుల సంఖ్యలో వెలుగు చూశాయి. ఆ చైతన్యం మరింతగా జనాల్లో రావాలనే ఈ ప్రయత్నం. దీని వల్ల కొంతైన మార్పొస్తే... నా ప్రయత్నం సఫలం అయినట్లే. సాంకేతికంగా కూడా నా గత చిత్రాలకంటే మిన్నగా ఉంటుందీ సినిమా.
 
 తేలిగ్గా విజయాలను అందుకోవడానికి సునీల్‌కుమార్‌రెడ్డి ఇలాంటి సినిమాలు తీస్తున్నాడనే విమర్శ మీపై ఉంది. దీనికి మీ సమాధానం?
 గంగపుత్రులు,సొంత ఊరు, రొమాంటిక్ క్రైమ్ కథ ఇవన్నీ.. సమాజంలోని ఆయా విభాగాలకు సంబంధించిన ప్రజల అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి చేసిన ప్రయత్నాలు. ఇప్పుడు రాబోతున్న ‘ఓ క్రిమినల్ లవ్‌స్టోరీ’ కూడా అలాంటి సినిమానే. అంతేతప్ప... తేలిగ్గా డబ్బులు సంపాదించడానికి చేసిన ప్రయత్నం కాదు. సొసైటీలోని విషయాలపై విమర్శించే ధైర్యం నాకున్నప్పుడు... నాపై వచ్చే విమర్శల్నికూడా స్వీకరించే ఓర్పు కూడా ఉండాలి.
 
 మీ ‘రొమాంటిక్ కైమ్ కథ’లో అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయనే విమర్శలు ఎదురయ్యాయి. మరి ఈ సినిమాలో కూడా అలాంటివి ఉంటాయా?
 చూడండీ... నా సినిమాల్లో ఒక్క డబుల్‌మీనింగ్ డైలాగ్‌ని కూడా మీరు వినలేరు. నేను కలిసి వ్యక్తుల మనోభావాలే నా సంభాషణలు. నిజాన్ని నిర్భయంగా చెబుతున్నప్పుడు విమర్శలు సహజం.
 
 ఒక్క సినిమా తీయడం కోసం ఇంత రీసెర్చ్ అవసరమా? మీకు టైమ్ వేస్ట్ కదా?
 ఇలా చేయడంలోనే నేను ఎంజాయ్ చేస్తా. నేను చెప్పే ఏ విషయం అయినా... జనానికి సూటిగా తగలాలి. అంతేతప్ప రాంగ్‌సెన్స్ రాకూడదు. దానికోసమే ఈ ప్రయత్నం. మెసేజ్ ఇవ్వాలనుకుంటే... ఒక ఎస్‌ఎంఎస్ కొడితే సరిపోతుందా. ‘రెండుగంటలు ఈ టార్చెర్ దేనికి?’ అనేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా ఎంజాయ్ చేసేలా సినిమా ఉన్నప్పుడే మనం విజయం సాధించినట్లు.  
 
 అంటే మీ నుంచి మామూలు సినిమాలు రావన్నమాట?
 డెఫనెట్లీ.. ఫ్యూచర్లో ఇవే మామూలు సినిమాలు అవుతాయనుకుంటున్నా. టి.కృష్ణ, వేజళ్ల సత్యనారాయణ... లాంటి వాళ్లు సినిమాలు చూస్తున్నప్పుడు ‘ఇదిరా మన సినిమా’ అన్నారు యువతరం. వారి బాటలోనే నేనూ.
 
 తెలుగు సినిమాకు నేషనల్ అవార్డు తేవడమే మీ ధ్యేయమా?
 నా పని నేను చేసుకుంటూ పోతున్నా. వస్తే కచ్చితంగా ఆనందమే.

  అసలు దర్శకునిగా మీ ప్రేరణ?
 నా చుట్టు ఉన్న సమస్యలే.

 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement