సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల అంశం పరిష్కరించలేనిది ఏమీ కాదని, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే నిర్దిష్ట కార్యా చరణ, విస్తృత చర్చలతో దీనికి శాశ్వత పరిష్కారం తేవొచ్చని భూ చట్టాల నిపుణుడు, నల్సర్ అనుబంధ ప్రొఫెసర్ ఎం. సునీల్ కుమార్ (భూమి సునీల్) తెలిపారు. అసలు అసైన్డ్ చట్టంలో ఉన్న వెసులుబాట్లు, లోటుపాట్లు సరిదిద్దేలా మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అసైన్డ్ భూములకు సంబంధించిన అనేక అంశాలు, సందేహాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.
సాక్షి: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్ముకోవచ్చా?
సునీల్: ప్రభుత్వం పేదలకు రెండు సందర్భాల్లో భూములిస్తుంది. ఒకటి వ్యవసాయం కోసం. రెండు ఇళ్లు కట్టుకునేందుకు. ఈ అసైన్‌మెంట్ భూములను తరతరాలుగా వారసత్వంగా అనుభవించవచ్చు కానీ అమ్మడం లేదా మరే విధంగానూ ఇతరులకు బదలాయింపు చేయడానికి వీల్లేదు.
సాక్షి: ఎలాంటి సందర్భాల్లో అసైన్‌మెంట్ భూములను అమ్మే వీలుంది?
సునీల్: ఇందుకు పీవోటీ చట్టంలోనే మినహాయింపులిచ్చారు. 1977లో వచ్చిన చట్టంలో ఇప్పటి వరకు 11 రకాల వెసులుబాట్లు కల్పించారు. అసైన్డ్ పట్టాలో అమ్మకూడదు అనే నిబంధన పేర్కొనకపోతే, భూమిలేని నిరుపేదలు ఎవరైనా 1977 కంటే ముందు కనుక అసైన్డ్ భూములను కొనుగోలు చేసి ఉంటే అమ్ముకోవచ్చు. అసైన్డ్ భూములను బ్యాంకులకు, సహకార సమాఖ్యలకు కుదువ పెట్టవచ్చు. అప్పు తీర్చకపోతే కుదువ పెట్టిన భూములను బ్యాంకులు వేలం వేసి విక్రయించవచ్చు. అలా వేలంలో కొన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు వస్తాయి. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు భూములిస్తే వాళ్లు పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. రాజకీయ బాధితులైతే పట్టా చేతికి వచ్చిన మరుక్షణమే అమ్ముకోవచ్చు.
కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర చెల్లించిన వారికి అసైన్ చేస్తారు. వారికి ఫామ్–జీ పట్టాలిస్తారు. అవి పట్టాభూములే. వాటిని తక్షణమే అమ్ముకోవచ్చు. 1977 నుంచి 2007 వరకు ఆంధ్రప్రదేశ్‌లో, 2017 వరకు తెలంగాణలో ఎవరైనా భూమి లేని పేదలు అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే కొన్న వారికి మళ్లీ అసైన్‌మెంట్ పట్టా ఇవ్వవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటి స్థలాల కోసం ఇచ్చిన పట్టా భూములను 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. 2019 జనవరి కంటే ముందు అమ్ముకుని ఉంటే క్రమబద్ధీకరించుకోవచ్చు. అలాగే, రక్తసంబంధీకులకు దానం కానీ వీలునామా రూపంలో కానీ ఇవ్వవచ్చు. వారసుల పేరిట పట్టా మార్పిడి చేయొచ్చు.
సాక్షి: చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
సునీల్:అసైన్డ్ భూములను చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. సివిల్ చర్యల కింద వారిని ఆ భూమి నుంచి తొలగించి ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంటుంది. పీవోటీ చట్టం సెక్షన్–7 ప్రకారం తహసీల్దార్ క్రిమినల్ కేసు (కొనుగోలు చేసిన వారిపై, అడ్డుపడిన వారిపై) పెట్టవచ్చు.
సాక్షి: అసైన్డ్ భూముల విషయంలో ఇప్పుడెలాంటి నిబంధనలుండాలి?
సునీల్: దీన్ని విçస్తృత కోణంలో ఆలోచించాలి. బ్యాంకుల్లో కుదువపెట్టి వేలం వేయించుకోవడం కొందరికి దొడ్డిదారిగా మారింది. అసైన్డ్ భూములు వేలానికి వెళితే వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోనేరు రంగారావు కమిటీ సిఫారసు చేసింది. కానీ అమల్లోకి రావడం లేదు. ఇప్పటి వరకు జరిగిన అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి వాళ్లకు పట్టాలివ్వాలని చట్టంలోనే ఉంది. కానీ అదీ అమలు చేయడం లేదు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తే సరిపోతుంది. 2017తర్వాత కొను గోలు చేసినా ఇదే నిబంధన వర్తింపు చేస్తే చాలు.
సాక్షి: పెద్దలు ఈ భూములను కొనుగోలు చేసినా, కబ్జా చేసినా పరిస్థితేంటి?
సునీల్: పేదలు కాని వారు అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే ఏం చేయాలన్న దానిపై మూడు అభిప్రాయాలున్నాయి. మొదటిది అసైన్‌మెంట్ చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయాలి. ప్రభుత్వం ఆ భూములను తీసుకుని, మళ్లీ అసైన్‌చేయాలి లేదంటే ప్రజావసరాల కోసం వినియోగించుకోవాలి. రెండోది.. క్రమబద్ధీకరణ. మార్కెట్ విలువ కట్టించుకుని వారికి యాజమాన్య హక్కులివ్వాలి. ఇప్పుడున్న పీవోటీ చట్టంలో అలాంటి వెసులుబాటు లేదు. చట్టాన్ని మార్చుకుంటే కానీ ఇది సాధ్యం కాదు. ఇక, మూడోది.. ఫలానా తేదీ తర్వాత పెద్దలు ఈ భూములను కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి భూమిలేని మరో నిరుపేదకు పంపిణీ చేయాలి.. లేదా విస్తృత ప్రజా ప్రయోజనం కోసం వాడొచ్చు.
సాక్షి: అసైన్డ్ భూముల విషయంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా?
సునీల్: వారసత్వంగా అసైన్‌మెంట్ భూమి వచ్చి నా ఇంకా పట్టా మార్చడం లేదు. వారసుల పేరు మీద మ్యుటేషన్ చేసేందుకు చట్టంలో ఎక్కడా అడ్డంకులు లేవు. ఈ మ్యుటేషన్ ఫీజు ఎకరాకు రూ.2,500 భారమవుతుంది కనుక ఉచితంగా చే యాలి. లావుణి పట్టాలకు సంబంధించి ఇంకా కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వలేదు. ఇదేమంటే అసైన్డ్ భూమి అంటున్నారు. కానీ చట్టప్రకారం కొత్త పాస్ పుస్తకా లు ఇచ్చేందుకు అడ్డంకులు లేవు. అసైన్‌మెంట్ పట్టాలో ఉన్న సర్వే నెంబర్‌కు, అసైనీ కబ్జాలో ఉన్న భూమి సర్వే నెంబర్‌కు తేడాలున్నాయి. వీటిని పరిష్కరించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తేనే అసైన్డ్ భూములకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
సాక్షి: చట్ట ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునేందుకు అవలంబించాల్సిన పద్ధతులేంటి?
సునీల్:అసైనీదారులు, కొనుగోలుదారులకు మొదట నోటీసులివ్వాలి. ఆ తర్వాత తహసీల్దార్ విచారణ జరపాలి. చట్ట ఉల్లంఘన జరిగిందని ప్రకటిస్తే కొనుగోలుదారుడు లేదా కబ్జాదారులను ముందు ఆ భూమి నుంచి తొలగించాలి. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనపర్చుకోవాలి. క్రిమినల్ చర్యల్లో భాగంగా కేసు పెట్టాల్సింది తహసీల్దార్ మాత్రమే. తహసీల్దార్ లేదంటే ఆ పై స్థాయి అధికారి పెట్టవచ్చు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
సాక్షి: అసైన్డ్ భూములను ప్రభుత్వం తన విచక్షణతో స్వాధీనం చేసుకోవచ్చా?నష్టపరిహారం ఇస్తారా?
సునీల్: అసైన్‌పట్టాను పరిశీలిస్తే ‘ప్రభుత్వానికి ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది’ అనే నిబంధన ఉంటుంది. దీని ప్రాతిపదికగా చాలా సందర్భాల్లో అసైన్ భూములను ప్రభుత్వం తీసుకుంది. ఏ ఉద్దేశం కోసమైతే ప్రభుత్వం అసైన్ చేస్తుందో మూడేళ్లలో ఆ ఉద్దేశం నెరవేరకపోతే తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. అసైనీనే ప్రభుత్వానికి భూమిని సమర్పించవచ్చు. ప్రభుత్వం తీసుకుంటే 1992 వరకు నష్ట పరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత ఎకరానికి కంటితుడుపుగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవారు. రెండు నెలల క్రితం వచ్చిన కోర్టు తీర్పుల ప్రకారం కూడా ఏ విధంగా అసైన్డ్ భూములను ప్రభు త్వం తీసుకున్నా పరిహారం ఇవ్వాల్సిందే. పట్టా భూములకు ఎంత చెల్లిస్తారో అంత చెల్లించాల్సిందే. భూమి హక్కులకు ఉల్లంఘన జరిగితే ఎన్నేళ్ల తర్వాత వచ్చి అడిగినా పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
సాక్షి: అసైన్‌మెంట్ చట్టాల్లో మార్పులేమైనా చేయాలా?
సునీల్: ఈ చట్టాల్లో కచ్చితంగా మార్పులు చేయాల్సిందే. కొన్ని నిబంధనలను తొలగించడం, కొన్నింటిని చేర్చడం జరగాలి. ఈ చట్టంలో మార్పులు చేసేటప్పుడు స్థానిక పరిస్థితులు, పరిస్థితుల్లో మార్పు, పక్క రాష్ట్రాల్లో అనుభవాలు లాంటి అంశాలను విస్తృతంగా చర్చించి మార్పులు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment