ట్విన్ టవర్స్పై అద్భుత సాహసం.. | tha walk hollywood movie | Sakshi
Sakshi News home page

ట్విన్ టవర్స్పై అద్భుత సాహసం..

Published Sat, Oct 10 2015 4:35 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

ట్విన్ టవర్స్పై అద్భుత సాహసం.. - Sakshi

ట్విన్ టవర్స్పై అద్భుత సాహసం..

టైటిల్: ది వాక్- ఎ ట్రూ స్టోరీ
జానర్: అడ్వంచరస్ డ్రామా
డైరెక్టర్: రాబర్ట్ జెమెకిస్
స్క్రీన్ ప్లే: రాబర్ట్ జెమెకిస్, క్రిస్టోఫర్ బ్రోన్, ఫిలిప్ పెట్టీ (టు రీచ్ ది క్లౌడ్స్ పుస్తకం ఆధారంగా)
తారాగణం: జోసెఫ్ గోర్డొన్ లెవిట్, బెన్ కింగ్స్లే, ఛార్లొటే లి బోన్ తదితరులు
సంగీతం: ఆలెన్ సిల్వెస్ట్రీ
సినిమాటోగ్రఫీ: డారిజ్ వోయిస్కీ
ఎడిటర్:జెర్మియా ఒ డ్రిస్కోల్
విడుదల: అక్టోబర్ 9, 2015
నిడివి: 2 గంటల 3 నిమిషాలు

మనిషి మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుని ఉప్పొంగిపోయేది ఏది? చెక్ వన్స్.. సమాధానం తట్టింది కదా, అవును. సాహసం. ఏ స్థాయిలో అనేది పక్కనపెడితే ఎవరికి వాళ్లు తాము చేసిన సాహసాలను గుర్తుచేసుకోవడం కంటే గొప్పవిషయం ఏదీ ఉండదు! 'ది వాక్' సినిమా కూడా అలా మళ్లీ చూడాలనిపించే సెల్యూలాయిడ్ సాహసం. వాక్ అంటే అందరికీ తెలిసిన నడకే. కానీ ఎప్పుడు, ఎక్కడ ఎలా నడిచాడు? అనేది 'ది వాక్'లో ప్రధానాంశం.


కథేంటి?
అనగనగా ఫ్రాన్స్ దేశం. ఆ దేశ రాజధాని పారిస్ లోని ఈఫిల్ టవర్. దానికి దగ్గర్లోని ఓ ఇల్లు. కిటికీలో నుంచి టవర్ ను చూస్తూ కలలు కంటూ ఉంటాడో కుర్రాడు.. ఎప్పటికైనా అక్కడ నడవాలని. అందరిలాగా టికెట్ తీసుకొని ఈఫిల్ వద్ద కలియతిరగొచ్చు. కానీ అతను శ్వాసించేది మరోలా నడవటం.. అదే, రోప్ వాక్ గురించి. ఏళ్లు గడిచాయి.. అనుకున్నట్లే ఈఫిల్ సహా ఫ్రాన్స్ లో పెద్దపెద్ద కట్టడాల మధ్య రోప్ వాక్ చేశాడు. తర్వాత అమెరికాలోని ట్విన్ టవర్స్ గురించి తెలుసుకుంటాడు.

బృందంతో కలిసి న్యూయార్క్ బయలుదేరుతాడు. ఒక సాహసోపేత ఉదయాన.. ట్విన్ టవర్స్ మధ్య రోప్ వాక్ చేస్తాడు. 1,368 అడుగుల ఎత్తులో.. నార్త టవర్ నుంచి సౌత్ టవర్ కు తాడుపై నడుస్తాడు. ఒక్కసారికాదు.. ఏడెదిమిది సార్లు! తాడుపై గెంతుతాడు, డాన్స్ చేస్తాడు. ఆ దృశ్యాలు చూసినవారిని గగుర్పాటుకు గురిచేసినందుకుగానూ, అనుమతి తీసుకోకుండా సాహసం చేసిందనుకు (ఒకవేళ అడిగినా అనుమతించరనుకోండి) న్యూయార్క్ పోలీసులు అతడ్ని అరెస్టు చేసి జైలులో పెడతారు. ఆ తర్వాత ట్విన్ టవర్స్ చరిత్రలో తానూ ఓ సువర్ణాధ్యాయంగా మిగిలిపోతాడు.

రియల్ స్టోరీ
1974.. అప్పటికే కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ ట్విన్ టవర్స్ నిర్మాణం పూర్తికాలేదు. ఆగస్టు 7 ఉదయం.. పైన మనం చెప్పుకున్న నిజ జీవిత గాథలో కథానాయకుడు, ఫ్రాన్స్ కు చెందిన ఫిలిప్ పెట్టీ ట్విన్ టవర్స్ మధ్య.. కేవలం నాలుగు అంగుళాల వెడల్పున్న ఉక్కుతాడు (స్టీల్ రోప్)పై నడిచాడు.. ఎలాంటి ఆధారం లేకుండా! అద్భుతం జరిగిన 34 ఏళ్ల తర్వాత దాని పూర్వాపరాలు జోడిస్తూ జేమ్స్ మార్ష్ అనే దర్శకుడు రూపొందించిన 'మాన్ ఆన్ వైర్' డాక్యుమెంటరీ.. 2008లో ఆస్కార్ అవార్డు సాధించింది. అంతకంటే మిన్నగా జనాదరణ పొందింది. వీటి ఆధారంగా రూపుదిద్దుకున్నదే 'ది వాక్' సినిమా.

కొత్తదనం ఏముంది?
'అందరికీ తెలిసిన కథనే మళ్లీ చెప్పడం ఏమంత తెలివైన పని కాదేమో!' ది వాక్ సినిమా చేస్తున్నాడని తెలిసిన తర్వాత దర్శకుడు రాబర్ట్ జెమెకిస్ కు హితులు చెప్పిన సలహా. కానీ, వాళ్లకూ తెలుసు.. రాబర్ట్ దేనినీ ఈజీగా తీసుకోడని. ఏదో ఒక అద్భుతం చేసి తీరతాడని. అయితే సినిమా విడుదలైన తర్వాత వాళ్ల ఆలోచనలు బద్దలయ్యాయి. సినిమా చూస్తున్నవాళ్లలో చాలామందికి గుండె ఆగినంత పనైందట! విజువల్ ఎఫెక్ట్స్ అంత అద్భుతంగా వచ్చాయి మరి. ఇప్పుడు లేని ట్విన్ టవర్స్ అందచందాలను (రోప్ వాకర్ దృష్టిలో టవర్స్.. ప్రియురాలి కంటే అందంగా ఉంటాయి) తమకు విందుగా వడ్డించినందుకు ప్రతి ప్రేక్షకుడు రాబర్ట్ కు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేడు.

థియేటర్ లోనూ సీట్ బెల్ట్ ఉండాలా?
ది వాక్ సినిమా చివరి 45 నిమిషాలు.. సీట్ల నుంచి జారిపోవడాలు, పిడికిలి బిగబట్టడాలు, అప్పుడప్పుడూ గుండె తడుముకోవడాలు.. అసహజమని అనిపించదు. గతంలో ఫారెస్ట్ గంప్, కాస్ట్ అవే.. ఈమధ్య రియల్ స్టీల్, మార్స్ నీడ్స్ మామ్ లాంటి సినిమాలతో ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకున్న రాబర్ట్ జెమెకిస్.. ఈ సినిమాతో.. ఆడియన్స్ చేత (థ్రిల్ తో కూడిన భయం వల్ల వచ్చే) తిట్లు స్వీకరించడానికి సంసిద్ధుడయ్యాడు.

నటీనటులు
ఫిలిఫ్ పెట్టీ పాత్రలో జోసెఫ్ గోర్డొన్ లెవిట్ అద్భుతంగా ఒదిగిపోయాడు. సాహస కృత్యం చేసినప్పుడు (1974లో) పెట్టీ ఎలా ఉండేవాడో జోసెఫ్ కూడా అచ్చు అలానే కనిపిస్తాడు. ఈ సినిమాకోసం నిజంగానే రోప్ వాక్ నేర్చుకున్నాడు. శిక్షణ ఇచ్చింది మరెవరో కాదు ఫిలిప్ పెట్టినే. సినిమాలో హీరోకు శిక్షకుడిగా నటించింది సీనియర్ నటుడు బెన్ కింగ్స్లే. పెట్టీ గర్ట్ ఫ్రెండ్ ఆనే పాత్రలో ఛార్లొట్ లి బోన్ అదరగొట్టింది. పెట్టీతో కలిసి ఫ్రాన్స్ నుంచి వచ్చే బృందం, అమెరికాలో వారికి పరిచయమయ్యే ఇంకొదరు స్నేహితుల పాత్రలూ తమ పరిధిమేరకు జీవించాయి.

ఫస్ట్ హాప్ లో హీరో బాల్యం, యవ్వనం, ప్రేమ, రోప్ వాక్ శిక్షణ, చిన్నచిన్న సాహసాలతో నడిచినా.. అదంతా గ్రేట్ వాక్ కోసం జరిగే రిహార్సల్సే. చివరి 45 నిమిషాలకోసం ప్రేక్షకుల్ని సమాయత్తం చేయడం. అయితే ఆ సీన్లను కూడా అద్భుతంగా కించిత్ దృష్టి మరల్చనీయకుండా చిత్రీకరించాడు. మొత్తానికి ఇది రాబర్ట్ జెమెకిస్ సినిమా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement