దటీజ్ మోహన్‌బాబు | that is Mohanbabu | Sakshi
Sakshi News home page

దటీజ్ మోహన్‌బాబు

Published Sat, Nov 22 2014 12:55 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

దటీజ్ మోహన్‌బాబు - Sakshi

దటీజ్ మోహన్‌బాబు

‘దానవీరశూరకర్ణ’ చిత్రానికి పోటీగా విడుదలైన ‘కురుక్షేత్రం’(1977) చిత్రాన్ని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తిలకించారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఆ చిత్రం ఎన్టీఆర్‌కి నచ్చింది. ముఖ్యంగా ఆ చిత్రంలో శిశుపాలుడు పాత్ర పోషించిన కుర్రాడైతే బాగా నచ్చేశాడు. ‘ఈ శిశుపాలుడెవరో కానీ.. భవిష్యత్తులో గొప్పవాడవుతాడు’ అని జోస్యం చెప్పారు ఎన్టీఆర్. మహానటుని ప్రశంసలు పొందిన ఆ నటుడు - డా.మోహన్‌బాబు.
 
1980లో ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా విడుదలైంది. బంపర్ హిట్. డైలాగుల కేసెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడైపోయాయి. తొలిసారి ఎన్టీఆర్ డైలాగులతో పాటు మోహన్‌బాబు డైలాగుల గురించి కూడా మాట్లాడుకోవడం మొదలైంది. ‘మా వంటవాడు భారతీయుడు... మా తోటవాడు భారతీయుడు... మా పనివాడు భారతీయుడు..’ అంటూ బ్రిటీష్ దొరగా మోహన్‌బాబు పలికిన డైలాగులు పిల్లల నోళ్లలో విపరీతంగా నానాయి. తన జోస్యం త్వరగా నిజమైనందుకు ఎన్టీఆర్ కూడా ఎంతో సంతోషించారు.   
 
‘కొండవీటిసింహం’(1981)లో ఎన్టీఆర్, మోహన్‌బాబు తండ్రీ కొడుకులుగా నటించారు. ఆ సినిమా విడుదలై ముప్ఫై ఏళ్లు దాటుతున్నా... ఇప్పటికీ వారి పాత్రలనూ, ఆ సన్నివేశాలనూ ప్రేక్షకులు మర్చిపోలేరు. ‘కొండవీటి సింహం’ టైమ్‌కి నటునిగా మోహన్‌బాబు వయసు ఏడేళ్లు. అయినా సరే... ఆయనలో ఎక్కడా ‘మహానటుని ముందు నటిస్తున్నాను’ అనే భయం కనిపించదు. నిరూపించుకోవాలనే కసి కనిపిస్తుంది. దటీజ్ మోహన్‌బాబు.
 
ప్రతినాయకునిగా మోహన్‌బాబుది ఓ చరిత్ర. కొత్త కొత్త ఊతపదాలను సృష్టించి సరికొత్త ట్రెండ్‌కి నాంది పలికారాయన. సినిమాల విజయాల్లో ఆయన పోషించిన ప్రతినాయక పాత్రలు కూడా కీలక భూమికలు పోషించేవంటే అతిశయోక్తికాదు. గోరంతదీపం, శివరంజని, పదహారేళ్ల వయసు, దేవత, తాండ్రపాపారాయుడు, శ్రీనివాసకల్యాణం, వారసుడొచ్చాడు, బ్రహ్మపుత్రుడు, ఖైదీనంబర్ 786,  కొదమసింహం, కొడుకు దిద్దిన కాపురం... తదితర చిత్రాలే అందుకు నిదర్శనాలు.
 
ఇక హీరో మోహన్‌బాబు గురించి నేటి తరానికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘ఫలానా తరహా పాత్రలు పోషించడంలో మోహన్‌బాబు దిట్ట’ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే... ఏ తరహా పాత్రనైనా అమోఘంగా పోషించగల దిట్ట ఆయన. పౌరాణిక, జానపద, చరిత్రాత్మక, సాంఘిక, కౌబాయ్... ఇలా అన్ని తరహా పాత్రల్లోనూ నటించిన ఘనత ఆయనది. నటునిగానే కాదు... నిర్మాతగా, రాజకీయవేత్తగా, విద్యా సంస్థల అధినేతగా.. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయకేతనం ఎగుర వేసిన ప్రతిభాశాలి ఆయన. మోహన్‌బాబు నట ప్రస్థానాన్ని ప్రారంభించి నేటికి 39 ఏళ్లు పూర్తిచేసుకుని, 40వ పడిలోకి ప్రవేశించారు. ‘స్వర్గం-నరకం’(1975) చిత్రంతో ఆయన హీరోగా తెరంగేట్రం చేశారు. ఇప్పటికీ అడపాదడపా నటిస్తూనే ఉన్నారు. త్వరలో ‘యమలీల-2’తో యమధర్మరాజుగా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement