నిరసన అంటే ఇది కాదు!
సినిమా ఆయనకి ప్రాణం. సమాజం దాన్ని నిలబెట్టే ఊపిరి. ఈ రెంటిపై నిర్దిష్ట అభిప్రాయం ఉన్న విశ్వనటుడు కమల్‌హాసన్. ఈ 7వ తేదీ 61 ఏళ్ళు నిండుతున్న కమల్ త్వరలో ‘చీకటిరాజ్యం’తో పలకరిస్తున్నారు. అవార్‌డలు వెనక్కివ్వడం నుంచి పలు అంశాలపై ‘సాక్షి’తో ముచ్చటించారు.
‘చీకటి రాజ్యం’ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. ఈ నెల 10న తమిళంలో (‘తూంగా వనమ్’) రిలీజ్. మంచి థియేటర్స్ కోసం తెలుగులో కాస్త ఆలస్యంగా 20న రిలీజ్ చేయనున్నాం. మామూలుగా అయితే ఒకేసారి రిలీజ్ చేస్తారు. కథ మీద నమ్మకంతో గ్యాప్ తీసుకున్నాం.{థిల్లర్ సినిమాల్లో డెప్త్ ఉండదు. కానీ ‘చీకటి రాజ్యం’లోని పాత్రల్లో డెప్త్, స్పీడ్ ఉంటాయి. సినిమాలో స్టంట్స్ స్టయిలిష్‌గా, రియలిస్టిక్‌గా ఉంటాయి. కమర్షియల్ వాల్యూస్ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. ఒక సినిమా చూశామంటే అరే ఇలాంటి కథ మన భాషలో కూడా వస్తే బాగుంటుందనుకుంటాం. ఫ్రెంచ్ సినిమా ‘స్లీప్‌లెస్ నైట్’ థీమ్ బాగుంది. అందుకే, ‘చీకటిరాజ్యం’గా తీశాం. చెప్పాలంటే ‘సాగర సంగమం’ కూడా ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ ప్రేరణతో వచ్చిందే. సినిమా అనేది టాలెంట్‌తో మాత్రమే ముడిపడి ఉండదు. ప్రొడక్షన్‌కు తగ్గట్టు ఒక్కోసారి యాక్టర్స్‌ను తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది యాక్టర్స్‌కు టాలెంట్ ఉన్నా సరే, వాళ్లకి మార్కెట్ ఉండదు. కొంత మంది సినిమాకు బాగా సహకరిస్తారు.
బాలచందర్‌గారు అవకాశం ఇవ్వకపోతే నేనీ స్థాయికి వచ్చేవాణ్ణి కాదు. నేను నా శిష్యులకు ఛాన్స్ ఇవ్వకపోతే నాకు కృత జ్ఞత లేనట్టే. కొత్త యాక్టర్స్‌కు, టెక్నీషియన్స్‌కి కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. అందుకే, నా దగ్గర పనిచేసిన రాజేశ్ సెల్వాకు ‘చీకటిరాజ్యం’లో ఛాన్సిచ్చా.నేను చేసిన చాలా సినిమాల్ని జనం రిసీవ్ చేసుకున్నారు. అయితే, కొన్నిసార్లు జనం మెచ్చలేదు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, దిలీప్‌కుమార్ లాంటి మహానటులకే అది తప్పలేదు. ఎవరికీ వందశాతం సక్సెస్ రేటుండదు! విజయానికి ఒక్కరిని కారణమనలేం. అలాగే పరాజయానికి కూడా. సినిమా సమష్టి కృషి . మంచి సినిమా సరైన టైమ్‌లో రిలీజ్ కాకపోతే ఫ్లాపవుతుంది. నాకు సినిమాలంటే ఇష్టం. అదే నన్ను నడిపిస్తోంది.‘బాహుబలి’ పదేళ్ల క్రితం వచ్చినా హిట్ అయ్యేది. అంతెందుకు... ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి పుట్టకముందే ‘మొఘల్ ఎ ఆజమ్’ లాంటి భారీ చిత్రం వచ్చి, హిట్ అయింది. మంచి సినిమాలు ఎప్పుడు వచ్చినా హిట్ అవుతాయి. ‘మరుద నాయగమ్’ను పునః ప్రారంభించడానికి చర్చలు జరుగుతున్నాయి.
‘షోలే’ వచ్చినప్పుడు అది చాలా అడ్వాన్స్‌డ్ సినిమా. కానీ అందరికీ రీచయింది. జనాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ‘ఉత్తమ విలన్’ టైమ్‌లో నన్ను డెరైక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తావని అంతా అడిగారు. అందుకే ‘చీకటిరాజ్యం’ చేసేశా. వెంటనే టి.కె. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో మళ్లీ ఇంకో తెలుగు, తమిళ సినిమా చేస్తున్నా. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. చాలా కాలం తర్వాత అమల, జరీనావహాబ్‌లతో నటిస్తున్నా.భిన్నాభిప్రాయాల్ని సహించలేక, ప్రభుత్వ పరంగా ఇప్పుడు వ్యక్తమవుతున్న అసహనం అసాధారణం. దానిపై అంతా పోరాడాల్సిందే. కానీ, అవార్డుల్ని వెనక్కివ్వడం పరిష్కారం కాదు. నిరసనంటే ఇది కాదు. ఆ అవార్డులు ప్రతిభకు గుర్తింపుగా, జనం మెప్పుతో వేర్వేరు ప్రభుత్వాలిచ్చినవి. మనం గాంధీలా ‘సత్యాగ్రహం’తో వేరే మార్గంలో పోరాడాలి.‘ఆస్కార్’ కోసం ఆరాటం అనవసరం. నన్నడిగితే, మనదేశానికి వాళ్ళు చిత్రాలు పంపేలా మనం తయారవ్వాలి. ఎందుకంటే మనం దేశం నుంచి ఏడాదికి 1000 చిత్రాలు వస్తున్నాయి. హాలీవుడ్ వాళ్లు మన రికార్డ్‌ని దాటలేరు. అక్కడ సినిమాల్ని మనంత గా ప్రేమించరు. మనం సినిమాల్ని ప్రేమిస్తాం.