ఆ నలుగురి నమ్మకమే ఈ విజయం!
‘‘కెరీర్ స్టార్టింగ్‌లో హీరోగా ట్రై చేద్దామనుకున్నా. కానీ, కెమెరా వెనకాల డైరెక్టర్‌గా ఉండటమే బాగుందనిపించింది. అందుకే ప్రస్తుతానికి డైరెక్టర్‌గానే ఉందామని డిసైడ్ అయ్యా’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ఆయన దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘శమంతకమణి’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉందంటోన్న శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ–‘‘నా లైఫ్‌లో జరిగిన సంఘటన ఆధారంగా ‘భలే మంచిరోజు’ కన్నా ముందే ఈ చిత్రకథ రాశా. ఫస్ట్ సినిమాకి నలుగురు హీరోలంటే కష్టం కదా! ‘భలే మంచిరోజు’ తర్వాత నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, ఆదీ సాయికుమార్‌లను కలిశా.
నలుగురికీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఓపెనింగ్ సీన్, ఇంట్రవెల్ బ్యాంగ్, క్లైమాక్స్... ప్రతిదీ కళ్ళకు కట్టినట్లు నెరేట్ చేశాను. అప్పుడు నలుగురికీ పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. ఆ నలుగురి నమ్మకమే ఈ రోజు ‘శమంతకమణి’ విజయం. రాజేంద్ర ప్రసాద్‌గారు చేసిన పాత్ర మాకు చాలా ఫ్లస్ పాయింట్. నలుగురు హీరోలను హ్యాండిల్ చేయడంలో ఫస్ట్ డే భయపడ్డాను. క్లైమాక్స్ సీన్‌లో నలుగురితో పాటు రాజేంద్రప్రసాద్‌గారు స్క్రీన్‌పై కనిపిస్తారు. ఆ సీన్ బాగా రావాలని కోరుకున్నాను. సినిమాకు మౌత్ టాక్ బాగుంది. నాకు తెలియనివాళ్లు కూడా ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఐయామ్ హ్యాపీ. మరో రెండేళ్లపాటు క్రైమ్ కామెడీ సినిమాలు చేయకూడదనుకుంటున్నా’’ అన్నారు.