రెండుసార్లు చేదు అనుభావాల్ని చవిచూసిన ప్రముఖ నటి నయనతార ప్రస్తుతం తన జీవితంలో ప్రేమకు తావు లేదని స్పష్టం చేసింది.
రెండుసార్లు చేదు అనుభావాల్ని చవిచూసిన ప్రముఖ నటి నయనతార ప్రస్తుతం తన జీవితంలో ప్రేమకు తావు లేదని స్పష్టం చేసింది. ప్రేమ అనే రెండు అక్షరాలు ఆమె జీవితంలో ఒకసారి కాదు.... రెండుసార్లు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. భగ్న హృదయంతో నయనతార తన కెరీర్ మీదే దృష్టి పెట్టింది. నటిగా ఆమె సెకెండ్ ఇన్సింగ్స్ ప్రారంభించి షూటింగ్స్తో తీరిక లేకుండా గడుపుతోంది.
అయితే యువ హీరోల రూపంలో ప్రేమ మళ్లీ నయనను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. నయనతార తనకు ప్రత్యేక స్నేహితురాలు అంటూ హీరో ఆర్య బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాదు ఆమెను ఇంటికి తీసుకెళ్లి బిరియాని విందు ఇచ్చారు. దాంతో ఆర్యా, నయన్లు ప్రేమలో పడ్డారంటూ మీడియా కోడై కూసింది. అయితే ఆ వార్తలను నయనతార ఖండించింది. తమ మధ్య స్నేహమే తప్ప,.... మరెలాంటిది లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా పుకార్లకు పుల్స్టాప్ పెట్టాలంటూ మీడియాకు విజ్ఞప్తి కూడా చేసింది.
తాజాగా ఇప్పుడు మరో రెండక్షరాల కుర్ర హీరో నయనకు లవ్ ప్రపోజల్ చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు మరికొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు నయనను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటున్నారని సమాచారం. అయితే ప్రస్తుతానికి వీరెవరి ప్రేమనూ నయనతార అంగీకరించలేదట. తన జీవితంలో ఇక ప్రేమ అనే పదానికి తావులేదని వేదాంతం చెబుతోంది.
నటిగా తారాస్థాయిలో ఉన్నసమయంలో నయనతార, శింబు మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అప్పట్లో ఈ వ్యవహారం కోలీవుడ్లో సంచలనం సృష్టించింది. ఇక రేపో మాపో పెళ్లి పీటలు ఎక్కబోతారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ.... వీరిద్దరి ప్రేమకు అనూహ్యంగా బ్రేక్ పడింది. అలాగే వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్లో హల్చల్ చేశాయి. దీంతో నయనతార పూర్తిగా శింబును దూరం పెట్టింది. అంతే కాకుండా శింబుపై ఉన్న ఆగ్రహంతో ఆమె కోలీవుడ్కు కూడా దూరం అయ్యింది.
ఆతర్వాత టాలీవుడ్లో నయనతార టాప్ రేంజ్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో మరోసారి ఆమె ....అప్పటికే పెళ్లి అయిన ప్రభుదేవా ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం .... వెండితెర చిత్రం కన్నా ఎక్కువగా పలు మలుపులు తిరిగాయి. ప్రభుదేవా కోసం నయనతార మతం మార్చుకోగా.... ఆమె కోసం ప్రభుదేవా ప్రేమించి పెళ్లాడిన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇక పెళ్లే తరువాయి అన్న సమయంలో వీరిద్దరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి.
దాంతో ప్రభుదేవాకు దూరమైన ఆమె ఇక పూర్తిగా నటనపైనే దృష్టి పెట్టింది. దాంతో తనకు పెళ్లి అచ్చి రాదనుకుందో....లేక మరోసారి ప్రేమ విఫలం అయితే తట్టుకోలేననుకుందో ఏమో... నయన్ మాత్రం ప్రస్తుతం తనకు సినిమా తప్ప వేరే ధ్యాస లేదని ‘రిలేషన్‌షిప్’ గురించి ఆలోచించడం లేదని తెలిపింది. కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉండాలనుకుంటున్నట్లు తెగేసి చెప్పింది. ప్రస్తుతం నయనతార తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది.