ప్రియుడు ఎవరు?
నా ప్రేమికుడెవరన్నది సమయం ఆసన్నమయినప్పుడు వెల్లడిస్తానంటున్నారు అందాల తార త్రిష. మూడు పదుల వయసు దాటుతున్నా చెక్కు చెదరని సౌందర్యంతో సమంత, హన్సికల వంటి ఈతరం హీరోయిన్లతో పోటీ పడుతోంది త్రిష. అమ్మడుపైనా ప్రేమ పుకార్లు చాలానే షికార్లు చేస్తున్నాయి. టాలీవుడ్ యువ నటుడు రానాతో చెట్టాపట్టాలంటూ ప్రచారం జోరుగానే సాగుతోంది. దేశంలోనే కాదు మలేషియా, సింగపూర్ వంటి ఇతర దేశాల్లో సినిమాకు అనుబంధం అయిన ఏ కార్యక్రమంలో నయినా ఈ జంట హల్‌చల్ చేస్తుంటుంది. ఇందుకు ఈ బ్యూటీ చెప్పే సమాధానం ఒక్కటే రానా తన చిన్ననాటి స్నేహితుడని. ఇంతకీ మీకు లవరెవరయినా ఉన్నారా? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్నలకు త్రిష బదులిస్తూ సమీప కాలంలో తాను రానా ప్రేమించుకుంటున్నట్లు, పెళ్లి కూడా చేసుకోనున్నట్లు రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయన్నారు.
అయితే ఈ వ్యవహారంపై ఇప్పుడే స్పందించనన్నారు. ఎలాంటి బంధం అయినా ఆ సమయం వచ్చినప్పుడే ముడిపడుతుందని పేర్కొన్నారు. ప్రేమ కూడా అంతేనన్నారు. సరైన సమయం ఆసన్నమయినప్పుడు తన ప్రేమికుడెవరన్నది వెల్లడిస్తానని చెప్పారు. తెలుగు చిత్రాల్లో నటించడానికి తాను నిరాకరిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రారంభ దశలో తమిళ చిత్రాల్లో నటిస్తుండగా తెలుగులో నటించే అవకాశం వచ్చిందని ఆ తరువాత అక్కడ పలు చిత్రాలు చేశానని అన్నారు. నిజానికి తాను ఆంధ్రాలోనే ఎక్కువ కాలం గడిపానన్నారు. ఆ సమయంలో తమిళ చిత్రాలను నిరాకరిస్తున్నట్లు ప్రచారం చేశారని పేర్కొన్నారు. కానీ ప్రియుడెవరన్నది మాత్రం చెప్పలేదు.