‘‘మహిళలందరూ ఎప్పటికీ హీరోలే. మహిళలు లేకుండా తర్వాతి తరాలు లేవు. మిమ్మల్ని ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శక్తి అంటేనే స్త్రీ కదా. ఈ తొమ్మిది రోజులు (దసరా నవరాత్రులు) ఈ విషయాన్నే మనం ప్రపంచం అంతా చెబుతున్నాం. వీలుంటే మమ్మల్ని (పురుషులు) కొంచెం ఎంపవర్ చేయండి’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో, వేదాంగ్ రైనా మరో లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.
‘జిగ్రా’ తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దగ్గుబాటి రానా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఆర్‌ఆర్‌ఆర్’తో ఆలియా మన ఇళ్లల్లోకి వచ్చారు. ఈ విజయదశమికి ఆమెకు విజయాన్ని కానుకగా ఇచ్చి, మన ఇంటి అడపడుచులా పంపుదాం. తెలుగు, తమిళ, మలయాళం... ఇలా అన్ని చోట్ల ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ నాకు తెలిసి ఒకరు రజనీకాంత్‌గారు... తర్వాత సమంతగారే అనుకుంటున్నాను. సమంతగారూ ముంబైలోనే కాదు... అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వస్తుండండి. సినిమాలు చేయాలి’’ అన్నారు.
సమంత మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఎదిగాను. తెలుగు ప్రేక్షకులే నా ఫ్యామిలీ. హీరోయిన్లుగా మా సినిమాలు చూస్తున్న అమ్మాయిలకు వాళ్ల కథలో వాళ్లే హీరోలు అని గుర్తు చేసే బాధ్యత మా మీద ఉంది. మా కథల్లో మేమే హీరో అని ఆలియా భట్ తన వర్క్‌తో గుర్తు చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం రానా ఓ ఫిమేల్ మూవీని (35: చిన్న కథ కాదు’ సినిమాను ఉద్దేశించి కావొచ్చు) ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు ‘జిగ్రా’ను రిలీజ్ చేస్తున్నారు.
ప్రతి అమ్మాయికి రానాలాంటి బ్రదర్ ఉండాలేమో ’’ అని మాట్లాడారు. ఆలియా భట్ మాట్లాడుతూ– ‘‘సమంతకు, నాకు కలిపి త్రివిక్రమ్‌గారు ఓ కథ రాయాలని కోరుకుంటున్నాను. పురుషాధిక్య ప్రపంచంలో స్ట్రాంగ్‌గా నిలబడటం అనేది చిన్న విషయం కాదు. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌లో కూడా సమంత హీరోనే. తెలుగు ప్రేక్షకుల ప్రేమ ‘జిగ్రా’ పై కూడా ఉండాలి’’ అని తెలిపారు. ‘‘జిగ్రా’ అంటే ధైర్యం. యాక్టింగ్ అంటే ఆలియా’’ అని చెప్పారు వాసన్ బాల. ‘‘సినిమా ప్రమోషన్ విషయంలో ఆలియా అంకితభావం చూస్తుంటే ఇక్కడ ఉన్న యాక్టర్స్‌కు కొంత నేర్పాలని అనుకుంటాను’’ అని రానా అన్నారు. ఈ వేడుకలో జాన్వీ నారంగ్, సిమ్రాన్ నారంగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment