సినీ ప్రేక్షకుడు మారాడు. ఒకప్పుడు తన అభిమాన నటీనటుల సినిమా ఎలా ఉన్నా సరే థియేటర్‌కి వెళ్లి చూసేవాడు. కానీ ఇప్పుడు హీరోహీరోయిన్ల మొఖం చూడట్లేదు. కథలో దమ్ముంటేనే సినిమా చూస్తున్నారు. స్టార్ హీరో సినిమా అయినా సరే.. టికెట్ తెగాలంటే మంచి కంటెంట్ ఉండాల్సిందే. లేదంటే అపజయం తప్పదు. దీనికి ఇటీవల విడుదలైన ‘జిగ్రా’ సినిమానే మంచి ఉదాహరణ.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జిగ్రా’. వేదాంగ్ రైనా, మనోజ్ పవా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలై తొలి రోజే ఫ్లాప్ టాక్‌ని మూటగట్టుకుంది. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. వీకెండ్ మొత్తంలో రూ. 20 కోట్ల కలెక్షన్స్‌ని కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారం మొత్తంలో హిందీలోనే కేవలం రూ. 18 కోట్ల మాత్రమే వసూలు చేసిందంటే..ఇక మిగతా భాషల్లో కలెక్షన్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.
అపజయాన్ని ఆపలేకపోయినా స్టార్స్
ఆలియా భట్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేశారు. తెలుగులో హీరో రానా రిలీజ్ చేశాడు. వాస్తవానికి హిందీ తర్వాత ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది తెలుగులోనే అనే చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశాడు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా తన మద్దతును ప్రకటించాడు. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కి స్టార్ హీరోయిన్ సమంత, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై.. తన వంతు సాయం అందించారు.
ఇలా స్టార్స్ అంతా తమకు తోచిన సహాయం అందించినా.. జిగ్రాకు విజయం అందించలేకపోయారు. తెలుగులో మూడు రోజుల్లో కేవలం 18 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. యావరేజ్ టాక్ వచ్చిన ఓ చిన్న సినిమాకు కూడా ఇంతకంటే ఎక్కువే వస్తాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే కథలో దమ్ము లేనప్పడు ఏ హీరో అయినా ఏం చేయగలడు? కాస్త బాగున్న సినిమాను ప్రచారం చేస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ కంటెంట్‌లేని సినిమాకు ఎంత ప్రచారం చేసిన బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. విషయం వీక్‌గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందనడానికి ‘జీగ్రా’ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్.
Comments
Please login to add a commentAdd a comment