వాళ్లే డబ్బు అడుగుతున్నారు!
‘ఇప్పటి పరిస్థితుల్లో స్టార్స్ లేని సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ముందుకు రావడం లేదు. సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాతలకు అడ్వాన్సులు ఇచ్చే ఎగ్జిబిటర్స్ ఈ చిత్రం కోసం ఎదురు డబ్బులు అడుగుతు న్నారు. దీంతో నిర్మాతలు కష్టపడి థియేటర్స్‌ను సంపాదించి సొంతంగా సినిమాను విడుదల చేస్తున్నారు. చిన్న నిర్మాతల పరిస్థితి అలా తయారైంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిశోర్, పావని ప్రధాన పాత్రల్లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన ‘ఎలుకా మజాకా’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందంతో కలసి దాసరి నారాయణరావు విలేకరులతో మాట్లాడారు.
‘‘చిన్న నిర్మాతల శ్రేయస్సు కోసం ఇప్పుడున్న రోజుకు నాలుగు ఆటలను ఐదు ఆటలు చేసి ఒంటిగంట ఆట చిన్న చిత్రానికి కేటాయించాలని, చిన్న సినిమాలకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరగా ప్రభుత్వ కమిటీ సానుకూలంగా స్పందించింది’’ అని దాసరి అన్నారు. ‘ఎలుకా మజాకా’ గురించి మాట్లాడుతూ - ‘‘రేలంగి చిత్రమంటే నా సినిమా కిందే లెక్క. వినాయకుడిని కేర్ చేయని హీరోను ఎలుక ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందన్నదే చిత్ర కథ. ఇది పిల్లలతో చూడాల్సిన చిత్రం’’ అని పేర్కొ న్నారు. ‘‘తొలిసారి గ్రాఫిక్స్‌తో చిత్రం తీశా. దీనిలో 40 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటాయి. జంధ్యాల గారి, నా చిత్రాల్లో ఓ మ్యాన రిజం ఉంటుంది. ఈ చిత్రంలో ఆ తరహా పాత్ర రఘుబాబు చేశారు’’ అని రేలంగి అన్నారు. దర్శకుడు కోడి రామకృష్ణ, ‘వెన్నెల’ కిశోర్, పావని, సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ మాట్లాడారు.