‘‘మన తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువమంది ఉపాధి కోసం గల్ఫ్‌కు వలస వెళుతుంటారు. అక్కడ కష్టాలు పడేవాళ్లలో 95 శాతం మంది తెలుగువాళ్లే. వాళ్లలో హింసకు గురయ్యే మహిళలూ ఉన్నారు. వారి పట్ల ప్రభుత్వాలు ఎక్కువగా స్పందించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల్లో, నాయకుల్లో ఆ స్పందన తీసుకురావడం కోసమే ‘గల్ఫ్’ సినిమా చేశా’’ అని పి. సునీల్‌కుమార్ రెడ్డి అన్నారు. చేతన్ మద్దినేని, డింపుల్ జంటగా ఆయన దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్‌కుమార్ నిర్మించిన ‘గల్ఫ్’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ‘గల్ఫ్’ మరో ఎత్తు. ఇది నా మనసుకి బాగా దగ్గరైన చిత్రం. కథ కోసం రీసెర్చ్ చేయడంతో సినిమాకు రెండున్నరేళ్లు పట్టింది. ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లేవాళ్లపై సినిమాలొచ్చాయి.
కానీ, గల్ఫ్ వలసల మీద తెలుగు లో ఒక్క సినిమా రాలేదు. అందుకే ఆ సున్నితమైన అంశం మీద సినిమా తీయాలనుకున్నా. గల్ఫ్ దేశాల్లో అక్కడి స్థానికులు మనవాళ్లని మోసం చేసేకన్నా మనవాళ్లని మనవాళ్లే మోసం చేయడం ఎక్కువ. మన తెలుగువారిలో 50 లక్షల మందికి గల్ఫ్ అంటే ఏంటో? అక్కడి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. ఇది వాళ్ల సినిమానే. వాళ్లు చూసినా చాలు మా సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవుతుంది. వాళ్లు చూస్తారనే నమ్మకంతోనే చేశా. గల్ఫ్ కష్టాల నేపథ్యం లోనే తెలుగబ్బాయి, తెలుగమ్మాయికి మధ్య నడిచే ప్రేమకథ కూడా ఉంటుంది. కమర్షియల్ అంశాలు కోరుకునేవారికీ, ప్రేక్షకుడి డబ్బుకీ న్యాయం జరుగుతుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment