
స్పీడ్ పెంచిన మహేష్ బాబు!
స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి రావడమే అరుదు.
స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి రావడమే అరుదు. ఎందుకంటే స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అనే రూల్‌ని మనవాళ్ళు పక్కాగా ఫాలో అవుతుంటారు. ఈ విషయంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ముందుంటారు. అయితే ఏమనుకున్నారో ఏమో ఈసారి ఆయన రూటు మార్చారు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ హార్ట్స్ దిల్ ఖుష్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
గత ఏడాది నుంచే మహేష్ తన దూకుడు చూపిస్తున్నారు. రెండు సినిమాలతో ఫ్యాన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆశించిన విజయాలు సాధించలేకపోయారు. ప్రిన్స్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'శ్రీమంతుడు' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండిటితో పాటు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. అంటే ఈ ఏడాది మహేష్ మొత్తం మూడు సినిమాలతో రాబోతున్నట్లు సమాచారం.
అంతే కాక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేసేందుకు కూడా మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్. త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో చేయడానికి మహేష్ అంగీకరించారని సినీవర్గాల సమాచారం. అయితే ఈ సినిమా ఈ ఏడాదా? లేక వచ్చే ఏడాదా? అనేది తెలియడంలేదు. ఏది ఏమైనా ప్రిన్స్ స్పీడ్ పెంచేశారు. అభిమానులకు పండుగే!