దీపావళికి ఆ మూడు చిత్రాలు రెడీ
దసరా, దీపావళి, సంక్రాంతి ఇలాంటి విశేష పర్వదినాల్లో సినీ ప్రేక్షకులను అలరించడానికి చిత్ర పరిశ్రమలో సందడి వాతావరణాన్ని సృష్టించడానికి భారీ చిత్రాలు తెరపైకి రావడం సర్వసాధారణం. ఆ విధంగా ఈ సారి కోలీవుడ్‌లో ముగ్గురు స్టార్స్ చిత్రాల వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కత్తి, ఐ, పూజై ఈ మూడు చిత్రాలు దీపావళికి తెరపై వెలుగులు విరజిమ్మడానికి ముస్తాబవుతున్నాయి. ఇళయదళపతిగా తమిళనాట అశేష అభిమానం గల నటుడు విజయ్ నటిస్తున్న భారీ చిత్రం కత్తి. ఆయనతో క్రేజీ బ్యూటీ సమంత తొలిసారిగా రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కెప్టెన్.
విజయ్ నాయకుడిగా, ప్రతి నాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇంతకుముందు విజయ్, ఏఆర్ మురుగదాస్ కలయికలో వచ్చిన తుపాకీ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. అయితే కత్తి చిత్రంపై తమిళ భాషాభిమాన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిత్ర విడుదలను అడ్డుకుంటామని, అవసరమైతే ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతామని అంటున్నారు. చిత్ర నిర్మాతలు మాత్రం కత్తి చిత్ర వివాదంపై వివరణ ఇస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కత్తి చిత్రం విడుదల ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. కాగా విశాల్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం పూజై. కమర్షియల్ దర్శకుడిగా పేరొందిన హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నటుడు విశాల్ సొంతంగా నిర్మించడం విశేషం. పూజై చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రారంభదశలోనే వెల్లడించింది. ఇక రెండేళ్లకుపై నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న చిత్రం ఐ. స్టార్ దర్శకుడు శంకర్, సియాన్ విక్రమ్‌ల కలయికతో అన్నియన్ వంటి సంచలన చిత్రం తరువాత తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఐ. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలిం నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఐ చిత్రం కోసం విక్రమ్ ఆహార్య విషయంలోను, నటనాపరంగాను చాలా ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో పాటు ఎంతగానో శ్రమించారు. వెయిట్‌లెస్, వెయిట్ ప్లస్ అంటూ చిన్న రకాల శారీరక రూపాల్లో అబ్బురపరచనున్నారు. శంకర్ చిత్రం అంటేనే బ్రహ్మాండానికి చిరునామా అంటారు. అలాంటి శంకర్ ఐ చిత్రంలో ఎన్ని అద్భుతాలు సృష్టించనున్నారో అని ఇటు చిత్ర పరిశ్రమ, అటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి బరిలోకి దించనున్నట్టు ఆస్కార్ ఫిలింస్ వర్గాల సమాచారం. పై మూడు చిత్రాల పైనా భారీ అంచనాలే ఉన్నాయి.