త్రీ స్టార్ విశాఖ.. ఫలించిన పోరాటం
జీవీఎంసీ పోరాటం ఫలించింది. స్వచ్ఛ సర్వేక్షణ్–2020కి కీలకం కానున్న గార్బేజ్ ఫ్రీసిటీ ర్యాంకింగ్స్‌లో 3–స్టార్ రేటింగ్ సాధించింది. నెల రోజుల క్రితం స్వచ్ఛభారత్ మిషన్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో జీవీఎంసీకి సింగిల్ స్టార్ రేటింగ్ కేటాయించింది. అన్ని అర్హతలున్నా సరైన రేటింగ్ దక్కకపోవడంతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో జీవీఎంసీ పోరాటం సాగించింది. ఈ క్రమంలో కాపులుప్పాడలోని భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను పరిశీలించిన కేంద్ర బృందం రేటింగ్‌లో మార్పుచేసినట్లు ప్రకటించింది. మహా నగరం స్ఫూర్తితో మరో ఆరు నగరాలు సైతం త్రీస్టార్ రేటింగ్ పొందాయి. 2018–19లో సింగిల్ స్టార్కే పరిమితమైన గ్రేటర్.. తాజా రేటింగ్స్‌తో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉందని జీవీఎంసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం: అనేక రంగాల్లో ది బెస్ట్ సిటీగా మన్ననలు పొందిన మహా విశాఖ నగరం.. తాజాగా గార్బేజ్ ఫ్రీ సిటీ ర్యాంకింగ్స్‌లోనూ మెరుగైన స్థానం సంపాదించింది. 2019–20 సంవత్సరానికిగానూ త్రీస్టార్ రేటింగ్ సాధించింది. నెల రోజుల క్రితం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సింగిల్ స్టార్కే పరిమితం చెయ్యడంతో.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో జీవీఎంసీ అమీతుమీ తేల్చుకోవడంతో పొరపాటు గ్రహించిన కేంద్రం.. విశాఖ నగరం త్రీస్టార్ రేటింగ్ సాధించినట్లు గురువారం ప్రకటించింది.
అన్నీ ఉన్నా.. సింగిల్ రావడంతో..
వ్యర్థాల నిర్వహణలో భాగంగా చెత్తలేని నగరాలకు స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా గార్బేజ్ ఫ్రీ సిటీ స్టార్ రేటింగ్స్ కేటాయిస్తున్నారు. ఈ విభాగంలో 2018–19లో విశాఖ నగరం సింగిల్ స్టార్ సాధించింది. అప్పుడు రాష్ట్రాలకు కూడా మెరుగుపరచుకునే అవకాశం ఇవ్వడంతో.. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 2 స్టార్ రేటింగ్ సాధించినట్లుగా ప్రకటించారు. అయితే 2019–20లో సింగిల్ స్టార్, 3, 5, 7 స్టార్ కేటగిరీలు మాత్రమే కేటాయింపులు చేశారు. మొత్తం మూడు విభాగాల్లో వీటిని గణించారు. మాండేటరీ, ఎసెన్షియల్, డిజైరబుల్ విభాగాల్లో మొత్తం 25 ఉప విభాగాలుంటాయి.
వీటిలో 24 విభాగాల్లో పాస్ అయిన జీవీఎంసీ.. కేవలం భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణలో మాత్రం ఫెయిల్ అయ్యింది. వీటిలో ఒక్కదాంట్లో ఫెయిల్ అయినా సున్నా మార్కులు కేటాయిస్తారు. భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఉన్నప్పటికీ థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన కాంటార్ సంస్థ విశాఖలో సీ అండ్ డీ ప్లాంట్ లేదంటూ నమోదు చేసింది. దీంతో ఈ విభాగంలో ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను రెండేళ్ల క్రితం నుంచే జీవీఎంసీ నిర్వహిస్తునప్పటికీ.. ఇందులో నమోదు చెయ్యకపోవడంపై జీవీఎంసీ కమిషనర్ జి.సృజన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్‌తో పోరాటం సాగించాలని నిర్ణయించారు. కమిషనర్ సూచనలతో అదనపు కమిషనర్ వి.సన్యాసిరావు అన్ని ఆధారాలు, డాక్యుమెంట్స్‌తో ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులకు అందించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర బృందం పది రోజుల క్రితం విశాఖ వచ్చి.. సీ అండ్ డీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌ని సందర్శించింది. అన్ని అనుకూలంగా ఉన్నాయని గుర్తించిన స్వచ్ఛభారత్ మిషన్ గురువారం రేటింగ్స్‌ను మార్పు చేస్తూ త్రీ స్టార్ కేటాయించింది.
విశాఖ స్ఫూర్తితో 148 నగరాలు
గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్స్‌లో తమకు అన్యాయం జరిగిందని విశాఖ నగరం పోరాటం ప్రారంభించిందని తెలుసుకున్న తర్వాత అనేక నగరాలు ముందడుగు వేశాయి. తమకూ అన్యాయం జరిగిందంటూ 148 నగరాలు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు ఫిర్యాదు చేశాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న స్వచ్ఛభారత్ మిషన్ అన్ని నగరాలకూ ప్రత్యేక బృందాల్ని పంపించి.. అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేశాయి. వీటిలో జీవీఎంసీతో పాటు మరో ఆరు నగరాలకు త్రీస్టార్ రేటింగ్ కేటాయిస్తున్నట్లు స్వచ్ఛభారత్ మిషన్ ప్రకటించింది. వడోదర, అహ్మద్‌నగర్, పూణే, బల్లార్పూర్, నోయిడా, గ్వాలియర్ నగరాలకూ త్రీస్టార్ ర్యాంకింగ్స్ లభించాయి. ఇందులో విశాఖ ఫిర్యాదు బలమైంది కావడంతో జాబితాలో తొలి పేరును విశాఖ నగరాన్ని ప్రకటించడం విశేషం.
మార్పు చేయడం సంతోషకరం
అన్ని అర్హతలున్నా సింగిల్ స్టార్‌కి పరిమితం చెయ్య డం నిరాశకు గురిచేసింది. 2019 నుంచి భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌లో పనులు కొనసాగుతున్నప్పటికీ ఈ విభాగంలో సున్నా మార్కులు వెయ్యడం చూసి ఎక్కడో తప్పు జరిగిందని అర్ధమైంది. అందుకే ఫిర్యాదు చేసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. ప్లాంట్‌లో తయారవుతున్న ఇసుక, టైల్స్ ఇలా పునర్వినియోగ సామగ్రిని చూసిన బృందం రేటింగ్‌ను మార్పు చేయడం సంతోషకరం. మా కష్టానికి ప్రతిఫలం లభించింది. జీవీఎంసీ టీమ్ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్
ర్యాంకు మెరుగయ్యేందుకు అవకాశం
జీఎఫ్‌సీలో సింగిల్ స్టార్ రావడంతో దీని ప్రభావం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుపై పడుతుందని చాలా బాధపడ్డాం. కమిషనర్ సూచనల మేరకు ఢిల్లీ వెళ్లి స్వచ్ఛభారత్ మిషన్‌కు అన్ని డాక్యుమెంట్లు అందించాం. వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ని పరిశీలించిన ఉన్నతా«ధికారుల బృందం రేటింగ్‌ని పెంచింది. త్రీ స్టార్ రావడంతో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు మరింత మెరుగవుతుంది.
– వి.సన్యాసిరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్