టైటిల్ : థగ్స్ ఆఫ్ హిందుస్థాన్
జానర్ : అడ్వంచరస్ యాక్షన్ డ్రామా
తారాగణం : అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్
సంగీతం : అజయ్ అతుల్
నేపథ్య సంగీతం : జాన్ స్టువర్ట్
దర్శకత్వం : విజయ్ కృష్ణ ఆచార్య
నిర్మాత : ఆదిత్య చోప్రా
బాహుబలి సక్సెస్ తరువాత భారతీయ సినీ దర్శక నిర్మాతలు భారీ చిత్రాల మీద దృష్టి పెట్టారు. పీరియాడిక్, ఫాంటసీ డ్రామా తరహా కథలను తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు. అదే బాటలో తెరకెక్కిన బాలీవుడ్ మల్టీస్టారర్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. తొలిసారిగా బాలీవుడ్ టాప్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 1800ల కాలంలో భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఆజాద్, ఫిరంగీలు ఎలా ఎదుర్కొన్నారు అన్న కల్పిత కథతో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్‌లను తిరగరాస్తుందన్న నమ్మకంతో ఉన్నారు బాలీవుడ్ సినీ జనాలు. మరి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌కి బాహుబలి రికార్డ్‌లను బద్దలు కొట్టే సత్తా ఉందా..?
కథ :
1795 వర్తకం కోసం భారతదేశంలో అడుగుపెట్టిన బ్రిటీష్ పాలకులు సంస్థానాలను, రాజ్యాలను ఆక్రమించుకుంటున్న సమయం. అప్పటికీ స్వతంత్రంగా ఉన్న రాజ్యం రోనక్‌పూర్. ఈ రాజ్యం పై బ్రిటీష్ అధికారి జాన్ క్లైవ్ కన్నుపడుతుంది. రోనక్‌పూర్ రాజు, కొడుకును బంధించి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు క్లైవ్. తరువాత యువరాజుతో పాటు రాజు, రాణి కూడా చంపేస్తాడు. యువరాణి జఫీరా (ఫాతిమా సనా షేక్) మాత్రం రాజ్య రక్షకుడైన ఖుదాబక్ష్(అమితాబ్ బచ్చన్) సాయంతో అక్కడి నుంచి తప్పించుకుంటుంది. రాజ్యం నుంచి వెళ్లిపోయిన ఖుదాబక్ష్, ఆజాద్ పేరుతో సైన్యాన్ని తయారు చేసి బ్రిటీష్ అధికారులపై తిరుగుబాటు చేస్తుంటాడు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం ఆజాద్‌ను దోపిడీ దొంగగా ప్రకటిస్తుంది. బ్రిటీష్ పాలకులకు కొరకరాని కొయ్యగా మారిన ఖుదాబక్ష్ ను పట్టుకునేందుకు జిత్తులమారి ఫిరంగి(ఆమిర్ ఖాన్)ని నియమిస్తారు. మోసం చేయడం అలవాటైన ఫిరంగీ మంచి వాడిగా ఎలా మారాడు..? ఫిరంగీ, ఆజాద్‌ల సాయంతో జఫీరా తన రాజ్యాన్ని తిరిగి ఎలా సొంతం చేసుకుంది? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
సినిమా అంతా ముఖ్యంగా అమితాబ్, ఆమిర్‌ల పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరు తమ పాత్రల్లో జీవించారు. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ మరోసారి తనదైన నటనతో మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. రిస్కీ స్టంట్స్‌లోనూ అంతే పర్ఫెక్షన్ చూపించాడు. సీనియర్ నటుడు అమితాబ్ డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బరువైన కాస్ట్యూమ్స్ ధరించి ఆయన చేసిన యాక్షన్ సీన్స్ అభిమానులను అలరిస్తాయి. దంగల్ బ్యూటీ ఫాతిమా ఈ సినిమాతో యాక్షన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. పోరాట సన్నివేశాల్లో ఫాతిమా, ఆమిర్‌తో పోటి పడి నటించారు. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆమె నటన ఆకట్టుకుంటుంది. కత్రినా కైఫ్ కేవలం రెండు పాటలకు మాత్రమే పరిమితమైంది. రెండు పాటల్లోనూ కత్రిన గ్లామర్ షోతో ఆకట్టుకుంది.
విశ్లేషణ :
ధూమ్ లాంటి అల్ట్రా మోడ్రన్ కథలను అందించిన విజయ్ కృష్ణ ఆచార్య ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లాంటి పీరియాడిక్ స్టోరి కూడా బాగానే తయారు చేసుకున్నాడు. కానీ కథనం విషయంలోనే కాస్త తడబడ్డాడు. భారీ తారగణం ఉన్నా సినిమాలో వేగం లోపించినట్టుగా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ తప్ప మిగతా కథ అంతా సీరియల్ తరహాలో నెమ్మదిగా సాగుతుంది. పీరియాడిక్ డ్రామా అయినా పూర్తి కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అభిమానులను అలరిస్తాయి. ఫాంటసీ తరహా కథాంశం కావటంతో లాజిక్‌ల కోసం వెతకటం అనవసరం.భారీ సెట్స్, గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. నేపథ్యం సంగీతం సీన్స్‌ను మరింతగా ఎలివేట్ చేసింది. పాటలు తెలుగు ప్రేక్షకులను అలరించటం కష్టమే. సినిమాటోగ్రఫి సూపర్బ్ అనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
ఆమిర్, అమితాబ్‌ల నటన
యాక్షన్ సీన్స్
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్
సెకండ్ హాఫ్
సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment