ఉత్తమ విలన్ అనిపించుకుంటా...
ప్రస్తుతం తెలుగు సినిమాలో విలనీ అనేది హీరోకి ఢీ అంటే ఢీ అనేలా ఉండాలి. అందుకు మంచి శారీరక సౌష్టవం.. పొడవు ఉంటూ ఆకర్షణ ఉండాలనే ఉద్దేశ్యంతో ఇతర భాషా నటులను తెలుగు ఇండస్ట్రీ ప్రోత్సహిస్తోంది. అయితే బాలీవుడ్ నటులకు ఏ మాత్రం తీసిపోబోమని ఈ మధ్య కాలంలో కొత్త నటులు తెలుగు నేల నుంచి విలనిజాన్ని పండించడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ నటులను మరిపిస్తూ 6.5 అడుగుల ఎత్తు, 6 ప్యాక్ బాడీతో కండలు తిరిగిన దేహంతో విలన్ అంటే ఇలా ఉండాలి....అనే విధంగా ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరస అవకాశాలతో దూసుకుపోతున్నాడు మన తెలుగు ప్రతినాయకుడు చరణ్‌దీప్. ఆయన తన సినీ విశేషాల గురించి సాక్షితో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు...
విశాఖ ఫీచర్స్ : బీటెక్ పూర్తయిన తర్వాత సినిమాలో అవకాశాలు వెదుక్కుంటూ హైదరాబాద్ వైపు అడుగులు వేశాను. నా ఆహార్యం చూసిన తర్వాత కచ్చితంగా విలన్‌గా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటానని అనిపించింది. దాని కోసం ముందుగా శారీరక సామర్ధ్యం పెంచేందుకు బాడీ బిల్డప్ చేశాను. అలానే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తరువాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. మొదటిసారిగా ‘బిల్లా రంగా’ చిత్రంలో అవకాశం వచ్చింది. తరువాత ‘తుంగభద్ర’ సినిమాలో నటించాను. ఆ చిత్రం పూర్తయిన వెంటనే అనూహ్యంగా రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంలో మెయిన్ విలన్ ప్రభాకర్ తమ్ముడిగా అవకాశం వచ్చింది. వాటితోపాటు ‘పటాస్’, ఇప్పుడు ‘వినవయ్యా రామయ్యా’ చిత్రం. ఇవే కాకుండా తుంగభద్ర సినిమా సమయంలోనే తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన జిల్లా చిత్రంలో, అలానే పులిలో కూడా విలన్‌గా మంచి అవకాశాలు వచ్చాయి. రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నవి, సెట్స్ మీద ఉన్నవి ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి.
నా బాడీనే అవకాశాలు తెచ్చింది..
ఇప్పటి వరకు తెలుగు సినిమాలో విలన్ అంటే బాలీవుడ్ వైపు అందరూ పరుగులు తీసేవారు అయితే తెలుగులో కూడా మంచి విలనీ చేసేవారు ఉన్నారని ఇప్పుడు వస్తున్న నటులు నిరూపిస్తున్నారు. నా పొడవు, బాడీ నాకు విలనీగా గుర్తింపు తీసుకొస్తుందని అనుకున్నాను. నటనలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోకున్న నా బాడీనే నాకు అవకాశాలు తెచ్చింది.
సీనియర్ నటులను చూసే నేర్చుకున్నాను..
నటనలో ప్రత్యేకంగా ఎవరి వద్ద శిక్షణ తీసుకోలేదు. నటన నేర్చుకుంటే రాదని నా ఫీలింగ్. సెట్స్‌లో ఉన్నప్పుడు మిగిలిన నటులు ఎలా చేస్తున్నారు. ఏ సీన్‌లో ఏ స్థాయిలో ఎమోషన్స్ పలికిస్తున్నారు పరిశీలిస్తాను.. అలా తోటి నటీనటులను చూసే అన్నీ నేర్చుకుంటా. అలానే సీనియర్ నటుల సలహాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు నటనలో నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నాను.
‘వినవయ్యా రామయ్యా’ ప్రత్యేకం..
‘వినవయ్యా రామయ్యా’ చిత్రం నా కెరియర్‌లో ఓ ప్రత్యేక చిత్రంగా చెప్పుకుంటాను. చూడడానికి పద్ధతిగా కనిపించే పాత్రతోనే విలనీ చూపించాలి. ఈ సినిమా నా గుర్తింపుని మరింతగా పెంచింది. అలానే రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బహుబలి’లో ఓ కీలకమైన పాత్రకి నన్ను ఎంపిక చేసుకున్నారు. బాహుబలి పార్ట్-2లో నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఓ గొప్ప చిత్రంలో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది.
విలన్ గానూ నటన చూపించొచ్చు...
సినిమాలో మన యాక్టింగ్ టాలెంట్ చూపించాలంటే అది విలనీ ద్వారా ఎక్కువ అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. హీరో అవ్వాలనే ఆలోచన లేదు. కాని నాకంటూ ప్రత్యేకత చూపించే విధంగా పాత్రలు చేయాలని నా ఆలోచన. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్‌గా నటించాలని. తమిళంలో చేసిన మొదటి చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటించే అవకాశం వచ్చింది.