అరటి గెలలమ్మి సినిమా చూశాం
హైదరాబాద్: గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన జోష్ రవి తన చిన్నతనంలో వేసవి సెలవుల్లో చేసిన అల్లరి తలచుకుంటే నవ్వొస్తుందంటున్నాడు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఒక్కసారి గతంలోకి వెళ్లి వచ్చారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే...
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పక్కనే ఉన్న మార్టేరు మా సొంతూరు. వేసవి సెలవుల్లో హైస్కూల్ పక్కనే ఎస్‌ఆర్‌ఏ టాకీస్ ఉండేది. రోజులో మూడు ఆటలు చూసేవాళ్లం. ఐశ్వర్యారాయ్ ‘తాళ్’, చిరంజీవి, రజనీకాంత్ సినిమాలను పదుల సార్లు చూసేదాకా ప్రాణం నిలిచేది కాదు. ఊరు పక్కనే అరటి తోటలు ఉండేవి. ఎవరూ లేని సమయంలో అరటి గెలలు కోసి దూరంగా భూమిలో దాచి పెట్టే వాళ్లం. వారం, పది రోజుల తర్వాత అరటికాయలు పళ్లు అవ్వగానే అమ్మేసి వచ్చిన డబ్బుతో సినిమాలు చూసేవాళ్లం. అరటి తోటల యజమానులు మమ్మల్ని భయపెట్టడం, ఇంట్లో వాళ్లకి చెప్పడం చేసినా మళ్లీ మమూలే.
వేసవి వచ్చిందంటే మా ప్రపంచమంతా సినిమాలే. డబ్బులు లేని సమయంలో క్రికెట్ ఆడటం, పందేలు పెట్టుకుని చెరువుల్లో ఈత కొట్టడమంటే మాకు సరదా. ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యాక ఖాళీ దొరకడం లేదు. హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గరున్న బాస్కెట్‌బాల్ కోర్టుకి సరదాగా వెళుతుంటా. ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఊరెళ్లి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అమ్మ చేసిన వంటకాలను లాగించేస్తుంటా.