#JusticeForPriyankaReddy - Telugu Movie Celebrities About 'Priyanka Reddy' Murder - Sakshi
Sakshi News home page

ప్రియాంక హత్య.. గుండె పగిలింది

Published Fri, Nov 29 2019 3:05 PM | Last Updated on Fri, Nov 29 2019 7:20 PM

Tollywood Celebrities React on Brutal Murder of Priyanka Reddy - Sakshi

డాక్టర్‌ ప్రియాంకరెడ్డి (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దారుణ హత్యపై టాలీవుడ్‌ సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో స్పందించారు. ప్రియాంకరెడ్డి హత్య తమను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. అల్లరి నరేశ్‌, అల్లు శిరీశ్‌, సుధీర్‌బాబు, వివి వినాయక్‌, కీర్తి సురేశ్‌, మెహ్రీన్ పిర్జాదా‌, లావణ్య త్రిపాఠి, రాశిఖన్నా, స్మిత తదితరులు ట్విటర్‌ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

మాటలు రావడం లేదు
పరిస్థితులు రోజురోజుకి దారుణంగా తయావుతున్నాయని, ప్రియాంకరెడ్డి హత్య తెలియగానే ఆ సమయంలో తనకు మాటలు రాలేదని హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ పేర్కొన్నారు. తాను అత్యంత సురక్షిత నగరమని భావించే హైదరాబాద్‌లో ఇంత దారుణ ఘటన బాధ కలిగించిందన్నారు. ఏ సమయంలోనైనా బయటికి వెళ్లిన మహిళలు సురక్షితంగా తిరిగివచ్చే పరిస్థితులు దేశంలో ఎప్పుడొస్తాయని ప్రశ్నించారు. ప్రియాంకను అత్యంత కిరాతం​గా హత్యచేసిన హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రియాంక మృతికి సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. తాను కర్మను నమ్ముతానని, అది ఎల్లవేళలా పనిచేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హంతకులను ఉరి తీయాలని హీరోయిన్‌ రాశిఖన్నా అన్నారు. ప్రియాంక హత్య గురించి తెలియగానే గుండె పగిలినంతపనైందని తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మన సమాజం ఎటుపోతోందని ఆవేదనగా ప్రశ్నించారు.

దిగ్భ్రాంతికి లోనయ్యాం
ప్రియాంక హత్య పట్ల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక అమ్మాయిని ఇంత కిరాతంగా​ చంపుతారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగాలని ఆమె ట్వీట్‌ చేశారు. ప్రియాంక హత్య వార్త గురించి తెలియగానే షాక్‌కు గురయ్యానని మరో హీరోయిన్‌ మెహ్రీన్‌ పిర్జాదా పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ ప్రియాంకరెడ్డి తన చెల్లితో మాట్లాడిన చివరి ఫోన్‌కాల్‌ హృదయాన్ని మెలిపెట్టేలా ఉందని హీరోయిన్‌ దివ్యాంషా కౌశిక్‌ పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో యువతులు చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దని సూచించారు. చాలా బాధాకరం. ‘ఈ దారుణాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది? ప్రాథమిక పాఠశాల విద్యాభ్యాసంలో భాగంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలు  నేర్పించాలి. ఆడ పిల్లలతో ఎలా మెలగాలి, వారిని ఎలా కాపాడాలనే దాని గురించి బాలురకు శిక్షణ ఇవ్వాలి. ఇటువం‍టి చర్యలతోనే వచ్చే తరాన్ని కాపాడుకోవాలి. సారీ ప్రియాంక’ అంటూ ప్రముఖ గాయని స్మిత ట్వీట్‌ చేశారు.

బాధ, కోపం, నిస్సహాయత
ప్రియాంక హత్యను ఖండించడానికి దారుణం, కిరాతం వంటి మాటలు కూడా సరిపోవని హీరో అల్లరి నరేశ్‌ పేర్కొన్నారు. ఈ వార్త విని చాలా బాధపడ్డానని తెలిపారు. దేశంలో ఆడపిల్లలను కాపాడుకోలేకపోతే మనకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ప్రియాంక కేసులో న్యాయం జరుగుతున్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆపద సమయంలో పోలీసుల సహాయం తీసుకోవాలని హీరో సుధీర్‌బాబు సూచించారు. లైవ్‌ లొకేషన్‌ యాప్స్‌, అత్యవసర ఫోన్‌ కాల్‌ ఆ​ప్షన్స్‌ తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలన్నారు. ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. హంతకులను అరెస్ట్‌ చేసి సాధ్యమైనంత త్వరగా శిక్షించాలని దర్శకుడు వివి వినాయక్‌ డిమాండ్‌ చేశారు. ప్రియాంక హత్య గురించి తెలియగానే తనకు బాధ, కోపం, నిస్సహాయత వంటి భావోద్వేగాలు కలిగాయని హీరో అల్లు శిరీష్‌ పేర్కొన్నారు. మన అందరి ఆగ్రహం ప్రియాంకరెడ్డికి న్యాయం జరగడానికి తోడ్పడాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. అదే సమయంలో మహిళలు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. #RIPPriyankareddy #Justiceforpriyankareddy హ్యాష్‌టాగ్స్‌తో ప్రియాంకరెడ్డికి ట్విటర్‌లో నివాళి అర్పిస్తున్నారు.

సంబంధిత వార్తలు...

నమ్మించి చంపేశారు!

భయమవుతోంది పాప​.. ప్లీజ్‌ మాట్లాడు

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

అప్పుడు  అభయ.. ఇప్పుడు !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement