
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం 'నాంది' టీజర్ విడుదలైంది. నేరాలు, ఖైదీలు, వారి శిక్షలు నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో నరేష్ తన విలక్షణ నటనతో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జైలులో నగ్నంగా దర్శనమిచ్చి ఈ చిత్ర వైవిధ్యంపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
కొన్నేళ్లుగా మీరందరూ నాపై అంతులేని ప్రేమ, విశ్వాసంతో ఆశ్చర్యపరిచారు, సో.. ఈ పుట్టినరోజుకు నేను అందరినీ ఆశ్చర్యపర్చాలని నిర్ణయించుకున్నానంటూ కథానాయకుడు నరేష్ తన ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేశారు. ‘ఒక మనిషి పుట్టడానికి 9 నెలలే సమయం పడుతుంది.. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి సర్.. ఇన్ని సంవత్సరాలు పడుతోందంటూ’ తాజా టీజర్‌తో మరింత ఉత్కంఠకు తెరలేపారు.
దీంతో అటు తమ అభిమాన హీరో పుట్టినరోజు, ఇటు ఆసక్తికరమైన టీజర్ విడుదలైన సందర్భంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. కాగా విజయ్ కనకమేడల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతుండగా, ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్ ప్రియదర్శి, దేవీ ప్రసాద్, వినయ్ వర్మ, సీఎల్ నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్‌రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి, మణిచందన, ప్రమోదిని తదితరులు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment