ఈ హీరోయిన్లు ఈ ఏడాది మేకప్ తీసేట్టు లేరు. సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా.... డైరీ బిజీ. ఫుల్‌గా సినిమాలు... నిల్‌గా డేట్స్.
నయా తార: ఎంతమంది కొత్త నాయికలు వచ్చినా.. నయనతార ‘నయా తార’లానే ఉన్నారు. గతేడాది డోరా, ఆరమ్, వేలైక్కారన్ ఇలా.. మూడు తమిళ సినిమాలు చేశారు. ఇందులో ‘డోరా’ తెలుగులో విడుదలైంది. మరి... ఈ ఏడాది స్కోర్ ఎంత అంటే? గతేడాది కన్నా ఎక్కువ. నయనతార ఖాతాలో మూడు తమిళ సినిమాలు (ఇమైక్క నొడిగళ్, కొలైయుదిర్ కాలమ్, కోలమావు కోకిల) ఉన్నాయి. ఇక తెలుగులో సంక్రాంతికి వస్తున్న ‘జై సింహా’లో నయనతారే కథానాయిక. ‘సైరా’కి సై అన్న విషయం తెలిసిందే. ‘కర్తవ్వం’ అనే టైటిల్‌తో ‘ఆరమ్’ని తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాల సంగతి ఇలా ఉంచితే.. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార లవ్‌లో ఉన్నారని చెన్నై ఇండస్ట్రీ కోడై కూస్తోంది. పెళ్లి ఎప్పుడు అనేది కాలమే నిర్ణయించాలి.
సౌత్‌లో ఆ గౌరవం త్రిషదే: చెన్నై చందమామ త్రిష గత ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై మెరవలేదు. అలాగని అవకాశాలు తగ్గిపోయాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఏకంగా ఆరు సినిమాలు (మెహిని, గర్జనై, చతురంగ వెటై్ట 2, 1818, 96, హే జ్యూడ్) ఆమె చేతిలో ఉన్నాయి. మరో మూడు సినిమాలకు డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో... 2018లో లెక్క ఎక్కువ. సినిమాలవైజ్‌గా గతేడాది వెనక్కి తగ్గారేమో కానీ,, అరుదైన గౌరవం దక్కించుకున్నారు త్రిష. యూనిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) సెలబ్రిటీ అడ్వకేట్ స్టేటస్‌ను పొందారామె. సౌత్‌లో ఈ గౌరవం దక్కించుకున్న ఫస్ట్ హీరోయిన్ త్రిషనే అట.
వెరీ వెరీ స్పెషల్: గతేడాది సమంతకు వెరీ వెరీ స్పెషల్. మరి... నచ్చిన కుర్రాడి (నాగచైతన్య)తో మూడు ముళ్లు వేయించుకోవడం అంటే స్పెషల్ కాక ఏంటి? పెళ్లి తర్వాత సినిమాల పరంగా స్పీడ్ తగ్గిస్తారేమో? అన్నది కొందరి ఊహ. కానీ, సమంతకు ఆ ఆలోచన లేదు. గతేడాది ‘రాజుగారి గది 2’, తమిళంలో ‘మెర్సెల్’లో నటించారు. ఈ ఏడాది విషయానికొస్తే... ‘రంగస్థలం , మహానటి’ సినిమాల్లో నటిస్తున్నారు. తమిళంలో ‘ఇరంబుదురై, ఇంకా టైటిల్ డిసైడ్ కాని ఓ సినిమా, ‘సూపర్ డీలక్స్’ సినిమాల్లో నటిస్తున్నారు. సో.. లెక్క పెరిగిందే కానీ, తగ్గలేదు.
ఫిదా చేసింది: బాన్స్‌వాడ భానుమతి అందానికి, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. కథానాయిక సాయిపల్లవి గురించి చెబుతున్నామని గ్రహించే ఉంటారు. గతేడాది ‘ఫిదా, ఎంసీఏ’ సినిమాలతో తెలుగు తెరపై కనిపించారామె. తమిళంలో చేసిన ‘కరు’ తెలుగులో ఈ ఏడాది ‘కణం’ పేరుతో రిలీజ్ కానుంది. తమిళంలో మరో రెండు సినిమాలు చేయనున్నారు. ఇక తెలుగులో నెక్ట్స్ శర్వానంద్‌తో జోడీ కట్టారు సాయిపల్లవి.
పక్కా స్కెచ్: గత ఏడాది ‘బాహుబలి–2’లో అవంతికగా, ‘జైలవకుశ’లో స్పెషల్ సాంగ్, తమిళ చిత్రం ‘ఏఏఏ’లో నాయికగా కనిపించారు తమన్నా. అందుకే ఈ ఏడాది పక్కా స్కెచ్ వేసుకున్నారామె. తెలుగులో మూడు సినిమాలు (సందీప్‌కిషన్ సరసన ఓ మూవీ, కల్యాణ్‌రామ్‌తో ఓ సినిమా, ‘క్వీన్’ తెలుగు రీమేక్) లైన్‌లో పెట్టారామె. అంతేకాదు ఈ జనవరిలో తెలుగు, తమిళ భాషల్లో ‘స్కెచ్’ రిలీజ్ కానుంది. అంతేకాదండోయ్ ‘కామోషీ’ సినిమాతో మరోసారి హిందీ ఇండస్ట్రీలో లక్‌ను చెక్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. లెక్క బాగుంది కదూ.
బొమ్మాళీ... తగ్గొద్దు : ఓ వైపు స్టార్ హీరోలతో కమర్షియల్ మూవీస్ చేస్తూనే మరో పక్క సోలోగా కత్తి తిప్పారు ఈ ‘అరుంధతి’. 2017లో అనుష్క మూడు చిత్రాల్లో కనిపించారు. ‘సింగమ్ 3’, ‘ఓం నమో వెంకటేశాయ’లో మెరిశారు. ఆ తర్వాత ‘బాహుబలి ది కన్‌క్లూజన్’లో దేవసేనగా అభిమానులను అలరించారు అనుష్క. ఈ ఏడాది జనవరిలో ‘భాగమతి’గా కనిపించనున్నారు. జవనరి 26న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి శివ దర్శకత్వంలో అజిత్ చేయబోతున్న ‘విశ్వాసం’ సినిమాలో హీరోయిన్‌గా ఈ భామ పేరును పరిశీలిస్తున్నట్టు కోలీవుడ్ టాక్.
సిక్సర్ : తమిళంలో ‘భైరవ’, ‘పాంబు సాటై్ట’, తెలుగులో ‘నేను లోకల్’.. ఇలా 2017లో మూడు సినిమాల్లో కనిపించారు కీర్తీ సురేశ్. వచ్చే ఏడాది ఏకంగా సిక్సర్ కొట్టనున్నారు కీర్తి. ‘గ్యాంగ్’, ‘అజ్ఞాతవాసి’తో సంక్రాంతి పండగకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. మళ్లీ మార్చిలో ‘మహానటి’గా రానున్నారు. ఆ తర్వాత ‘సామీ స్క్వేర్’లో, 2005లో వచ్చిన ‘పందెంకోడి’ చిత్రానికి సీక్వెల్‌లో, విజయ్ సరసన ఓ సినిమాలోనూ హీరోయిన్‌గా కనిపిస్తారు కీర్తీ సురేశ్. ఆ విధంగా 2018లో అరడజను సినిమాల్లో సందడి చేయనున్నారు. లెక్క అదిరిందబ్బా.
అదే దూకుడు: ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పన్నెండేళ్లవుతున్నా.. కాజల్ దూకుడు ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే చిన్న హీరోల పక్కన నటిస్తున్నారు. 2017లో ‘ఖైదీ నంబర్ 150’లో, ‘నేనే రాజు నేనే మంత్రి’, తమిళంలో విజయ్‌తో ‘మెర్సల్’ (తెలుగులో ‘అదిరింది‘), అజిత్‌తో ‘వివేగం’ (తెలుగులో ‘వివేకం’)’ సినిమాల్లో కనిపించారు కాజల్. ఆ ఉత్సాహంతో 2018లోను నాలుగు సినిమాల్లో కనిపించనున్నారామె. కల్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’, ‘క్వీన్’ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’, నాని నిర్మిస్తున్న ‘అ’ చిత్రాల్లో సందడి చేయనున్నారు.
రాశి బాగుంది:
రాశీ ఖన్నా 2017లో మూడు సినిమాల్లో కనిపించారు. ‘జై లవ కుశ’, ‘ఆక్సిజన్’ చిత్రాల్లో మెరిశారు. ‘విలన్’ సినిమా ద్వారా మలయాళ తెరకు పరిచయమయ్యారు. ఈ ఏడాది రాశీ ఖన్నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు తమిళ సినిమాలు రెండు తెలుగు సినిమాలు. ‘టచ్ చేసి చూడు’, ‘తొలిప్రేమ’. ‘సైతాన్ కా బచ్చా, ఇమైక్క నొడిగల్, అడంగమారు’... ఇలా ఐదు సినిమాలతో ఈ ఏడాది రాశీ ఖన్నా డైరీ బిజీ.
లెక్క తేలలేదు:
అతి కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లోకి చేరిపోయారు రకుల్ ప్రీత్‌సింగ్. గతేడాది ‘విన్నర్, స్పైడర్, జయ జానకి నాయక, రారండోయ్ వేడుక చూద్దాం, ఖాకీ’ సినిమాల్లో కనిపించారు రకుల్. ఈ ఏడాది మాత్రం కేవలం ఒక్కటే సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అది కూడా బాలీవుడ్ ‘అయ్యారీ’. ప్రస్తుతానికి కొన్ని రోజులు రకుల్ డైరీ ఖాళీ. అధికారికంగా ప్రకటించలేదు కానీ, రవితేజ–కల్యాణ్ కృష్ణ సినిమా, హరీష్ శంకర్–‘దిల్’ రాజు కాంబినేషన్ మూవీ (దాగుడు మూతలు), బోయపాటి–రామ్‌చరణ్ సినిమాలకు రకుల్ పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంకా లెక్క తేలలేదు.
2017 ఏం చేశారు? 2018 ఏం చేయబోతున్నారు?
గతేడాది స్ట్రైట్‌గా నాలుగు సినిమాల్లో కనిపించారు హీరోయిన్ మెహరీన్ (మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్). తమిళ, తెలుగు బైలింగ్వల్ ‘కేరాఫ్ సూర్య’లో నటించారామె. ఈ ఏడాది ఇప్పటివరకు గోపీచంద్ 25వ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే తెలుగులో ఒక సినిమా చేసిందో లేదో అప్పుడే కోలీవుడ్ నుంచి కాలింగ్ రావడం, ఆమె రెండు తమిళ సినిమాలకు (జీవాతో ఓ సినిమా, జీవీ ప్రకాశ్‌కుమార్‌తో ‘100% లవ్’ రీమేక్) సైన్ చేశారు.
కెరీర్‌లో దూసుకెళ్తున్నారు సీనియర్ హీరోయిన్ శ్రియ. 2017లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్’ సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా కనిపించారు. తమిళ సినిమా ‘ఏఏఏ’లో నటించారు. ఇక ఈ ఏడాది తమిళంలో ఆమె నటించిన ‘నరగాసురన్’ (తెలుగులో నరకాసురుడు) థియేటర్స్‌కు రానుంది. హిందీలో ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో వస్తోన్న ‘ధడ్కా’ రిలీజ్‌కి సిద్ధమైంది. ‘గాయత్రి, ‘వీరభోగ వసంతరాయలు’లో కీలక పాత్రలు చేస్తున్నారామె. బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత జోరు పెంచారు తాప్సీ. 2017లో మూడు హిందీ సినిమాల్లో (రన్నింగ్ షాదీ, నామ్ షబానా, జుడ్వా 2) నటించారు.
‘ఘాజీ’లో చిన్న పాత్ర చేసి, తెలుగు తెరపై మెరిసిన తాప్సీ ‘ఆనందో బ్రహ్మ’ సినిమా చేశారు. ఈ ఏడాది కూడా అదే స్పీడ్‌లో నాలుగు హిందీ సినిమాలను లైన్లో పెట్టారు. మరో తెలుగు సినిమా కోసం డిస్కస్ చేస్తున్నారు. గతేడాది ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, తుప్పరివాలన్’ (తెలుగులో డిటెక్టివ్) సినిమాలతో థియేటర్స్‌లో సందడి చేసిన అనూ ఇమ్మాన్యుయేల్ ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అందులో ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా, ‘నా పేరు సూర్య’ వేసవి బరిలో ఉంది. నాగచైతన్యతో చేయనున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ‘లై’ ఫేమ్ మేఘా ఆకాశ్ తొలి హీరో నితిన్‌తో మరో సినిమా చేస్తున్నారు.
తెలుగులో ‘మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలతో అలరించిన లావణ్య త్రిపాఠి ప్రజెంట్ సాయిధరమ్ తేజ్ సినిమా చేస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్ గతేడాది ‘శతమానం భవతి, జోమొంటే సువిషంగల్, ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాల్లో కనిపించారు. ఈ సంవత్సరం నాని ‘కృష్ణార్జున యుద్ధం’, సాయిధరమ్‌తో ఓ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనున్నారు. 2017లో తెలుగులో నక్షత్రం, బాలకృష్ణుడు, తమిళంలో మా నగరం, సరవనన్ ఇరుక్క భయమేన్, నెంజమ్ మరప్పదిల్లయ్, జెమిని గణేశన్ సురళీ రాజనుమ్... ఇలా ఆరు సినిమాల్లో కనిపించారు రెజీనా. ఈ సంవత్సరం తమిళంలో పార్టీ, చంద్రమౌళి, తెలుగులో అ! రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ‘పెళ్ళి చూపులు’తో ఫేమస్ అయిన రీతూ వర్మ ఈ ఏడాది తమిళంలో విక్రమ్ సరసన ‘ధృవనక్షత్రం’, దుల్కర్ సల్మాన్‌తో ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్’ సినిమాల్లో కనిపించనున్నారు. వీళ్లు కాకుండా మరికొంత మంది భామలు ఈ సంవత్సరంలో తెలుగు తెరపై తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
కొందరు బాలీవుడ్ భామల సినిమాలు ఈ ఏడాది తెలుగులో రిలీజ్ కానున్నాయి. వారి హిందీ సినిమాల విషయం పక్కనపెడితే.. ఆ లిస్ట్‌లో శ్రద్ధాకపూర్ (‘సాహో’) అదితిరావ్ హైదరి (సుధీర్‌బాబు సినిమా), కియారా అద్వాని (మహేశ్ 24), కంగనా రనౌత్ (మణికర్ణిక), సన్నీ లియోన్ (వీరమహాదేవి) ఉన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ ఎంతమందినైనా ఆహ్వానిస్తుంది. సో.. ఈ ఏడాది ఇంకా నయా తారలు చాలామంది వస్తారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment