ఒక దైవ రహస్యం వెల్లడి చేస్తామంటూ ఆద్యంతం ఆసక్తి రేపేలా రూపుదిద్దుకుంటున్న సినిమా తూనీగ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రోమో సాంగ్ ను కళింగనగరిలో ఈజిప్టు సుందరి నవలా రచయిత భాను ప్రకాశ్ కెంబూరి సామాజిక మాధ్యమాల ద్వారా విడుదలచేశారు. జాతరమ్మ జాతర కూలిజనం జాతర అనే పల్లవితో సాగే ఈ పాటను రేలా రే రేలా ఫేం జానకీ రావు స్వీయ స్వరకల్పనలో ఆలపించారు. చిత్ర ప్రచార సారథి రత్నకిశోర్ శంభుమహంతి సాహిత్యం అందించారు.
ఈ సందర్భంగా భాను ప్రకాశ్ మాట్లాడుతూ ‘సరికొత్త ఆలోచనలకు ఈ సినిమా నాంది కావాలి.మా శ్రీకాకుళం కుర్రాళ్లు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం అయితే రేపటి వేళ మరికొందరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. శ్రీకాకుళం అంటే వలసలకు నిలయం అని, వెనుకబాటుకు చిరునామా అని ఏవేవో అనుకుంటారు కానీ ఇక్కడి కళలు, ఇక్కడి సాహిత్యం, ఇక్కడి జానపదం ఎంతో గొప్పవి. వీటిని సినీ మాధ్యమం విరివిగా వాడుకుని విజయాలు సాధించింది.
కారణాలేమైనప్పటికీ ఇక్కడి జానపదం ప్రపంచ వ్యాప్త గుర్తింపునకు నోచుకోలేకపోతోందీ వేళ. ఈ నేపథ్యంలో జానకీరాం ఆలపించిన ఈ పాట ఎంతో హృద్యంగా ఉంది. గతంలో కూడా ఈ ప్రాంత అస్తిత్వ గొంతుకగా, ఆత్మ గౌరవానికి ప్రతినిధిగా నిలిచిన వారెందరో ఉన్నారు.ఆ కోవలో ఆ తోవలో మిత్రులు, చిత్ర దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చిత్రయూనిట్ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం చిత్రబృందం తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న చిత్రయూనిట్ సంగీత దర్శకుడు గాయకుడు జానకీ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రచారబాధ్యతలు నిర్వహిస్తున్న రత్నకిశోర్ శంభుమహంతికి దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ అభినందనలు తెలిపారు. ఈ చిత్రం విషయమై మొదటి నుంచి అండగా ఉంటూ వస్తున్న రచయిత, దర్శకులు తనికెళ్ల భరణికి, మరో రచయిత మరుధూరి రాజాకు, నిర్మాత రాజ్ కందుకూరికి, ప్రముఖ దర్శకులు వేణు ఊడుగులకి, సతీశ్ వేగేశ్నకు, సినివారం ఫేం అక్షర కుమార్ బృందానికి, ప్రముఖ కళా దర్శకులు లక్ష్మణ్ ఏలేకు, ప్రముఖ నఖ చిత్ర కళాకారులు రవి పరసకు, ప్రముఖ చిత్రకారులు బాబు దుండ్రపెల్లికి, గిరిధర్ అరసవల్లికి, ధనుంజయ అండ్లూరికి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ శ్రీనివాస ఫణిదర్ కు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment