హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. ఇందులో ప్రముఖ హీరోతో పాటు దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్‌ఖాన్, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామేన్ శ్యాంకే నాయుడు, హీరోలు నవదీప్, తరుణ్, తనీష్, కేరక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు.
అయితే వీరి పేర్లను ఎక్సైజ్ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. ఇటీవల పట్టుబడిన డ్రగ్ వ్యాపారి కెల్విన్ ఫోన్‌లోని కాల్‌డేటా ఆధారంగా సినిమా ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. అయితే వీరంతా డ్రగ్స్ తీసుకుంటున్నారా? లేదా మాదకద్రవ్యాల క్రయవిక్రయాల్లో పాలుపంచుకుంటున్నారా అన్న అంశాన్ని లోతుగా విచారిచేందుకే నోటీసులు జారీచేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నామని, ఇప్పటికే 10 మందికి నోటీసులు ఇచ్చామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు లిస్టులో ఉన్నారని వెల్లడించారు. నోటీసులు ఇచ్చిన వారిని సిట్ ఆఫీసులోనే విచారిస్తామని తెలిపారు. హీరోయిన్లను సిట్ ఆఫీసులో కాకుండా బయట విచారిస్తామన్నారు. విచారణ అంశాలు బయటకు వెల్లడించబోమని స్పష్టం చేశారు.