‘మేమూ మనుషులమే, మాకూ ఫ్యామిలీలు ఉన్నాయి’
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కట్టడికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సహకరిస్తుందని ‘మా’ కార్యదర్శి, సీనియర్ నటుడు, నరేష్ తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై ‘మా’ శుక్రవారం సాయంత్రం వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ...‘ సినీ నటుల పేర్ల విషయంలో మీడియా సంయమనం పాటించాలి. నోటీసులు వచ్చినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు. విచారణకు పిలవడం వేరు. నేరం చేయడం వేరు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది.
తప్పుచేయనివారికి మా ఆర్టిస్టులకు పూర్తి మద్దతుగా ఉంటాం. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. కొంతమంది చేసిన తప్పును అందరికీ ఆపాదించొద్దు. ఇది కొందరు వ్యక్తుల సమస్య. ఇండస్ట్రీ సమస్య కాదు. అధికారికంగా పేర్లు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడండి. మేము మనుషులమే. మాకు కుటుంబాలు ఉన్నాయి. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి ఇండస్ట్రీ సిద్ధంగా ఉంది. కేవలం ఒక్క చిత్ర పరిశ్రమను ఫోకస్ చేయడం సరికాదు.’ అని అన్నారు.
‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ ‘ తప్పు చేయనివారికి ‘మా’ అండగా ఉంటుంది. తప్పు చేసినవారిని శిక్షించడంలో తప్పులేదు. ఏ ఇండస్ట్రీలో జరిగినా తప్పు తప్పే. అమాయకులను బలి పశువుల్ని చేయవద్దు. డ్రగ్స్ కేసులో ఉన్నది కొద్దిమంది సినిమావాళ్లు మాత్రమే. నోటీసుల రానివారికి కూడా నోటీసులు వచ్చినట్లు వార్తలు ప్రసారం చేయడం బాధాకరం. విచారణలో తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నవారి గురించి విచారణ అధికారి అధికారికంగా చెప్పేవరకూ ఆగండి. పేర్లను వేసే విషయంలో మీడియా సంయమనం పాటించాలి’ అని సూచన చేశారు.