రాజకీయ నేతగా త్రిష!
ఈ ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి వచ్చారా? ఏంటి? రాజకీయ నాయకుల ఫక్కీలో నమస్కారం పెడుతున్న త్రిష బొమ్మలు గోడల మీద కనిపించడంతో తమిళనాట ఇప్పుడు అందరూ అదే అనుకుంటున్నారు. విషయమేమిటని ఆరా తీస్తే, ఆ పోస్టర్లు, గోడ మీద రాతలన్నీ త్రిష కొత్త సినిమాలోని పాత్రకు సంబంధించినవట! ధనుష్ సరసన తొలిసారిగా త్రిష నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా పేరు - ‘కొడి’. అంటే తమిళంలో ‘జెండా’ అని అర్థం.
దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత కూడా ధనుషే. ఇందులో ఆయన తొలిసారిగా అన్నదమ్ముల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రెండో హీరోయిన్‌గా షామిలి నటిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష పేరు ‘రుద్ర’ అనీ, ఇందులో ఒక ఘట్టంలో ఎన్నికల్లో పోరాడే రాజకీయ నాయకురాలిగా ఆమె కనిపిస్తారనీ కోడంబాకమ్ కబురు.
మొత్తానికి, కథానాయిక త్రిష ఇప్పుడు కెరీర్‌లో కొత్త దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఆమె ఇప్పుడు కొత్త తరహా పాత్రల వైపు మొగ్గుచూపుతున్నారను కోవచ్చు. ఈ చెన్నై సుందరి ఇటీవల నటిస్తున్న సినిమాలు, చేస్తున్న పాత్రలే అందుకు ఉదాహరణ.
కమలహాసన్ ‘చీకటి రాజ్యం’లో పోలీసు అధికారిగా, ఈ మధ్యే ‘కళావతి’ (తమిళ మాతృక ‘అరణ్మణై-2’)లో భీతిల్లిన హీరోయిన్‌గా, తెలుగు- తమిళాల్లో రూపొందుతోన్న హార్రర్ థ్రిల్లర్ ‘నాయకి’ చిత్రంలో 1980ల నాటి ఫ్యాషన్‌లో కనిపించే నాయికగా - ఇలా మునుపటి కన్నా భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు ధనుష్ సినిమాలో రాజకీయ నేతగా కనిపించడం విశేషం. వెరసి, ప్రేమ, పెళ్ళి వ్యవహారాలన్నీ పక్కనపెట్టేశాక, ఈ అందగత్తె కొత్త తరహా పాత్రల పైనే దృష్టి పెడుతున్నారనుకోవాలి. అదీ ఒకందుకు మంచిదే!