బికినీలో త్రిష?!
త్రిషను సముద్ర కెరటంతో పోల్చొచ్చు. పడి లేవడం కెరటానికి ఎంత సహజమో, కెరీర్ పరంగా పడి లేవడం త్రిషకు సహజమై పోయింది. ‘ఈ అమ్మాయి పని అయిపోయింది’ అని అనుకునేలోపే... ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో మళ్లీ తన హవా చాటుతుంటారు త్రిష. గత ఏడాది జీవాతో ఆమె చేసిన ‘ఎండెండ్రుం పొన్నగై’ చిత్రం తమిళనాట పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ సినిమాతో మళ్లీ త్రిష వెలుగులోకి వచ్చారు. తెలుగులో తాజాగా బాలకృష్ణ సరసన చాన్స్ కొట్టేసి అందరి దృష్టినీ ఆకర్షించేశారు.
మరో వైపు కన్నడంలో ‘దూకుడు’ రీమేక్‌గా రూపొందిన ‘పవర్’ చిత్రంలో పునీత్ రాజ్‌కుమార్‌కు జోడీగా నటించారు. ఇలా దక్షిణాది మొత్తాన్ని కవర్ చేస్తున్నారు త్రిష. ఇదిలావుంటే... సమంత, తమన్నా, కాజల్ లాంటి కథానాయికల పోటీని తట్టుకోడానికో ఏమో కానీ... ‘పవర్’ చిత్రం కోసం ఎప్పుడూ చేయని సాహసం చేసేశారట త్రిష. అదే... ‘బికినీ’. ఈ సినిమాలో త్రిష బికినీలో కనిపించబోతున్నారనేది బెంగళూరు టాక్. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రచార చిత్రాలు కన్నడ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయట. ఈ నెల 28న ‘పవర్’ విడుదల కానుంది. అంటే... త్రిష బికినీ సోయగాలతో కన్నడ యువతకు కనువిందు చేసే రోజు ఇంకెంతో దూరంలో లేదన్నమాట.