
నన్ను గెలవలేరు!
అంతే కాదు. నాపై గెలుస్తాననుకోవడమూ కష్టమే! ఒకవేళ ఎవరైనా అటువంటి కలలు కంటుంటే... త్వరగా మేల్కోవడం మంచిది. మేల్కొని మమ్మల్ని క్షమించమని నన్ను వేడుకోండని చెబుతున్నారు త్రిష. ఇప్పుడీ గెలుపోటముల ప్రస్తావన ఎందుకు? ఎందులో ఆమెను గెలవలేరు? పదేళ్లకు పైగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న ఆమె కొత్త కథానాయికలకు ఏమైనా సవాల్ విసురుతున్నారా? వంటి ఆలోచనల్లోకి వెళ్లొద్దు.
ఎందుకంటే... త్రిష చెబుతున్నది కథానాయికల గురించి కాదు, బాక్సింగ్ గురించి! త్రిషకు కొత్తగా బాక్సింగ్‌పై ప్రేమ పుట్టుకొచ్చింది. ఫిట్‌నెస్ కోసం ఇటీవల రెగ్యులర్ వర్కౌట్స్‌లో బాక్సింగే ఎక్కువ చేస్తున్నారు. దీనికి మరో కారణం కూడా ఉందండోయ్... ఓ తమిళ సినిమా కోసం త్రిష బాక్సింగ్ నేర్చుకోవలసి వచ్చింది. ఆ సినిమాలో ఓటమి ఎరుగని బాక్సర్‌గా కనిపించనున్నారని చెన్నై కోడంబాక్కమ్ టాక్! అటు సినిమాకూ, ఇటు స్లిమ్ముగా ఉండడడానికీ ఆమెకు బాక్సింగ్ అక్కరకు వస్తోందన్న మాట.